Modi ఆ పని చేసుంటే రూ.30,000 కోట్లు ఆదా అయ్యేవి: Abhisekh Banerjee

ABN , First Publish Date - 2022-06-08T21:32:47+05:30 IST

కేంద్ర దర్యాప్తు సంస్థల పాత్రకు సంబంధించి నరేంద్ర మోదీ ప్రభుత్వంపై మరోసారి తృణమూల్ కాంగ్రెస్ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ...

Modi ఆ పని చేసుంటే రూ.30,000 కోట్లు ఆదా అయ్యేవి: Abhisekh Banerjee

న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థల పాత్రకు సంబంధించి నరేంద్ర మోదీ ప్రభుత్వంపై మరోసారి తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ అభిషేక్ బెనర్జీ (Abhisekh banerjee) విమర్శలు గుప్పించారు. తన ట్వీట్‌లో నీరవ్ మోదీ, విజయ్ మాల్వా ప్రస్తావన చేశారు. మోదీ ప్రభుత్వం తనపై కంటే నీరవ్ మోదీ, విజయ్ మాల్యాపై దృష్టిపెట్టి ఉంటే దేశ ప్రజలకు రూ.30,000 కోట్లు ఆదా అయ్యేవని అన్నారు. అభిషేక్ బెనర్జీ ప్రస్తుతం కంటి చికిత్స కోసం దుబాయ్‌లో ఉన్నారు.


కాగా, గార్గ్ ట్వీట్‌ను అభిషేక్ బెనర్జీ ఉటంకిస్తూ తన తాజా ట్వీట్‌లో మోదీ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వంలోని సెంట్రల్ ఏజెన్సీలు తనపై చూపిస్తున్న ఆసక్తిని విజయ్ మాల్యా, నీరవ్ మోదీలపై చూపించి ఉంటే దేశ ప్రజలకు చెందిన రూ.30,000 కోట్లు ఆదా అయ్యేవని అన్నారు. ''కేంద్రం తనపైన దృష్టి పెట్టడం కాదు... ఇప్పుడు యావత్ దేశం వాళ్లపై (కేంద్ర ప్రభుత్వం) దృష్టి పెట్టింది'' అని అభిషేక్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.


ఈడీ, సీబీఐ పాత్రపై సోమవారంనాడు 'బంగ్లా పక్షో'కు చెందిన గార్గ్ ఛటోపాధ్యాయ్ ఒక ట్వీట్‌ చేశారు. మోదీ ప్రభుత్వ దర్యాప్తు సంస్థ అయిన ఈడీ దుబాయ్‌లో బెంగాల్ ఎంపీ అభిషేక్ బెనర్జీ కదలికలపై కన్ను వేసిందని, సమాచారం కోసం ఒక గూఢచారిని నియమించాల్సిందిగా యూఏఈ ప్రభుత్వాన్ని కోరిందని ఆ ట్వీట్‌లో ఆయన పేర్కొన్నారు. ఒక ఎంపీపై ఈ విధంగా దృష్టి సారించడమనేది దేశ సార్వభౌమత్వాన్ని సరెండర్ చేసినట్టేనని అన్నారు.


కోల్ స్మగ్లింగ్ కేసులో ఢిల్లీకి రావాలంటూ అభిషేక్ బెనర్జీ, ఆయన భార్య రుజిర బెనర్జీకి అనేక సార్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు ఇచ్చింది. దీనిపై అభిషేక్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దర్యాప్తునకు పూర్తిగా సహకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, అయితే కోల్‌కతాలో తమను ప్రశ్నించవచ్చని ఆయన కోర్టుకు విన్నవించారు. అభిషేక్‌కు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఢిల్లీలో కాకుండా కోల్‌కతాలోనే విచారణ జరపాలని ఆదేశించింది. కాగా, చికిత్స కోసం తాను దుబాయి వెళ్లాల్సి ఉందని ఈడీకి అభిషేక్ ఇటీవల లేఖ రాశారు. అయితే భారత్ విడిచివెళ్లకుండా ఈడీ నిషేధం పెట్టింది. ఆ నిర్ణయాన్ని అభిషేక్ కోల్‌కతా హైకోర్టులో సవాలు చేశారు. దీంతో దుబాయ్ వెళ్లేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది.

Updated Date - 2022-06-08T21:32:47+05:30 IST