ఈ పిల్లాడు అప్పుడే చెప్పాడు!

ABN , First Publish Date - 2020-04-06T06:26:49+05:30 IST

జ్యోతిషం నిజమా, అబద్ధమా? దీనిపై భిన్న అభిప్రాయాలున్నాయి. కానీ పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని మాత్రం కాదనలేని వాస్తవం. అలా బాల్యంలోనే పరిమళించిన మేధావి పధ్నాలుగేళ్ల...

ఈ పిల్లాడు అప్పుడే చెప్పాడు!

జ్యోతిషం నిజమా, అబద్ధమా? దీనిపై భిన్న అభిప్రాయాలున్నాయి. కానీ పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని మాత్రం కాదనలేని వాస్తవం. అలా బాల్యంలోనే పరిమళించిన మేధావి పధ్నాలుగేళ్ల అభిజ్ఞా ఆనంద్‌. జ్యోతిషాన్ని ఆపోశన పట్టిన ఘనాపాఠి. ‘కరోనా’ దెబ్బకు యూట్యూబ్‌లో అభిజ్ఞ పేరు వైరల్‌ అవుతోంది. కారణం... కరోనా సహా ప్రపంచ పరిణామాలకు సంబంధించి అతడు చెప్పింది చెప్పినట్టు జరగడం!


‘జ్ఞ’ అంటే తెలుసుకోవడం, తెలుసుకున్నవాడు అని అర్థం. ‘అభిజ్ఞ’ అంటే విశేషంగా తెలుసుకోవడం, పండితుడు. ఎనిమిది నెలల క్రితం అభిజ్ఞా ఆనంద్‌ చెప్పిన జ్యోతిషం అక్షరాలా నిజమవ్వడంతో అతనిప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. అభిజ్ఞ ఏడో ఏటనే ‘కన్‌సైన్స్‌’ పేరుతో ఓ యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించాడు. ఈ ఛానల్‌కు దాదాపు 3.36 లక్షల మంది చందాదారులున్నారు. ‘కన్‌సైన్స్‌’ అంటే అంతరాత్మ. ఈ ఛానల్‌లో 8 నెలల క్రితం అతను ఓ వీడియో పోస్ట్‌ చేశాడు. 2019 నవంబరు నుంచి 2020 మే నెలాఖరు వరకూ ప్రపంచానికి గడ్డుకాలమని అందులో వెల్లడించాడు.


ఆశ్చర్యకరంగా అక్షరాలా అతను చెప్పినట్టే జరుగుతోంది. అతను కరోనా పేరును ప్రస్తావించకపోయినా ‘బయోవార్‌’ లాంటి పదాన్ని వాడాడు. దాంతో గడచిన రెండు మూడు రోజుల్లోనే అతని ఛానల్‌కు ఏకంగా లక్ష మంది చందాదారులు పెరగడం విశేషం. నిజానికి అభిజ్ఞ ఇవాళ కొత్తగా పాపులర్‌ కాదు. పదేళ్ల ప్రాయంలోనే భగవద్గీతలోని ఏడొందల శ్లోకాలను అనర్గళంగా వల్లెవేసినప్పుడే అతని పేరు మార్మోగింది. రెండున్నరేళ్ల వయసులో 50 రకాల కార్ల మోడళ్లు, 40 దేశాల జెండాలు చెప్పి అబ్బురపరిచాడు.  


పాఠాలు చెబుతూనే...

ఓ పక్క ఉద్యోగం... మరో పక్క విద్యార్థులకు జ్యోతిష పాఠాలు... అభిజ్ఞా ఆనంద్‌ క్షణం కూడా ఖాళీగా ఉండడు. జ్యోతిషంపై అతను మూడు గంటల పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇస్తాడు. ఇప్పటి వరకు దాదాపు ఎనభై సంస్థల్లో అతని జ్యోతిష, వాస్తు బోధనలు చేశాడు. వీటితోపాటు ‘విశ్వమ్‌ వాస్తుమయం’ వెబ్‌ పోర్టల్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తూ, భారతీయ విజ్ఞాన భాండాగారాన్ని ప్రజలకు అందించే మహత్కార్యం కోసం పాటుపడుతున్నాడు. ఒక్కడే ఇన్ని... ఎలా? అదీ ఇంత చిన్న వయసులో! అభిజ్ఞను చూసినవారికి, అతడి గురించి విన్నవారికి అదే పెద్ద ఆశ్చర్యం. అభిజ్ఞ ప్రతిభాపాటవాలకు కొలమానంగా ఎన్నో అవార్డులూ, రివార్డులూ సొంతమయ్యాయి. అయినా అభిజ్ఞలో గర్వం కనిపించదు. ముఖంలో వర్ఛస్సు... పెదవులపై చిరునవ్వు... ఎంత ఎదిగినా ఒదిగి ఉండే అతడి తత్వం ఎవరికైనా ఆదర్శమే!


చెప్పిందే జరుగుతోంది...!

ఇప్పుడు ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తోంది కరోనా వైరస్‌. ఈ సమయంలో ‘పోతులూరి వీరబ్రహ్మంగారు అలా చెప్పారు... బాబా వంగా ఇలా చెప్పారు’ అనేవి ఎక్కుగా వినపడుతున్నాయి. అయితే వారు ఇప్పుడు మన మధ్య లేరు. కానీ అభిజ్ఞ... మనలో ఒకడు. ఇలాంటి విపత్తు ఒకటి ముంచుకొస్తుందని అతడు ఎనిమిది నెలల ముందే తన వీడియోల ద్వారా హెచ్చరించాడు. గ్రహ స్థితులను అనుసరించి ఈ ముప్పును నాడే పసిగట్టాడు. ‘2019 నవంబర్‌ నుంచి 2020 మే నెలాఖరు వరకు ప్రపంచం విపత్కర పరిస్థితులు, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. వైమానిక, రవాణా రంగాలు తీవ్రంగా దెబ్బతింటాయి. చైనాలో యుద్ధ వాతావరణం నెలకొంటుంది. ధనిక దేశాలన్నీ అతలాకుతలం అవుతాయి. ముఖ్యంగా ఈ ఏడాది మార్చి 29 నుంచి ఏప్రిల్‌ 2 మధ్య తీవ్ర పరిణామాలుంటాయి. మకర రాశిలో గురు, కుజ, శని ఒకే రేఖలో ఉండటం... మిథునంలో రాహువుతో చంద్రుడు చేరడం ఇందుకు కారణం’ అని అభిజ్ఞ ఆ వీడియోలో పేర్కొన్నాడు. ఇంకా దాని గురించి వివరిస్తూ... ‘చంద్రుడు.. నీరు, రాహువు అంటే కమ్యూనికేషన్‌ వ్యవస్థ. తుమ్ములు, దగ్గులకు ఈ కలయిక కారణమవుతుంది’ అన్నాడు. అతడు చెప్పింది ఇప్పుడు అక్షర సత్యమయింది. దీంతో అభిజ్ఞ వీడియో నెట్టింట తెగ చెక్కర్లు కొడుతోంది.



వయసు చిన్న... చదువు పెద్ద... 

కర్ణాటకలోని శ్రీరంగపట్నం అభిజ్ఞ ఊరు. 2006లో ఆనంద్‌ సుబ్రమణియన్‌, అన్నూ ఆనంద్‌ దంపతులకు జన్మించాడు. అభిజ్ఞ చెల్లెలు అభిదేయ ఆనంద్‌. పసితనంలోనే కొడుకు ప్రతిభాపాటవాలను గమనించి, తల్లితండ్రులు ప్రోత్సహించారు. మూడేళ్ల నుంచే సంస్కృతం నేర్పించారు. చిన్న వయసులోనే పాఠశాల విద్య పూర్తి చేసిన ఈ పిల్లాడు... ‘దివ్యజ్యోతి కాలేజ్‌ ఆఫ్‌ ఆస్ట్రాలజీ’లో చేరాడు. అభిజ్ఞలోని విజ్ఞాన గనికి ఇది మచ్చుతునక మాత్రమే. ఆ తర్వాత ఆయుర్వేదిక్‌ మైక్రో బయాలజీలో 96 శాతం మార్కులతో పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ పట్టా పొందాడు. ఆ కోర్సు చేసిన అతి పిన్న వయస్కుడు అభిజ్ఞేనని చెప్పాలి. ఆచార్యుడిగా పాఠాలు... 


ఇప్పుడు ఈ పిల్లాడి వయసు కేవలం పధ్నాలుగేళ్లు. ఇంత చిన్న వయసులో గుజరాత్‌లోని ‘మహర్షి వేదవ్యాస అంతర్జాతీయ సంప్రదాయ వేద విశ్వవిద్యాలయం’ ఆచార్యుడిగా నియమితుడయ్యాడు. ఇది సాధారణ విషయం కాదు. అభిజ్ఞ విజ్ఞాన మథనం అంతటితోనే ఆగిపోలేదు. ఫైనాన్షియల్‌ ఆస్ర్టాలజీలో పీహెచ్‌డీ చేసి, డాక్టరేట్‌ సంపాదించాడు. జ్యోతిషంలోని వివిధ విధానాలపై అనేక పరిశోధనలు చేశాడు. వాస్తులోనూ నైపుణ్యం పొందిన అభిజ్ఞ... ప్రస్తుతం ‘విశ్వమ్‌ వాస్తుమయం’ వెబ్‌ పోర్టల్‌ను కూడా నిర్వహిస్తున్నాడంటే ఆశ్చర్యం కలగక మానదు. ఇంత చిన్న వయసులోనే జ్యోతిష శాస్త్రాన్ని ఆపోశన పట్టడం అతడికే చెల్లింది. 


అపార విషయ పరిజ్ఞానం... 

జ్యోతిషం, ఆయుర్వేదం, వాస్తు శాస్త్రాలకు సంబంధించి ఎలాంటి ప్రశ్న అడిగినా ఠక్కున సమాధానం చెబుతాడు అభిజ్ఞ. అపార విషయ పరిజ్ఞానం అతడిది! కొందరు ప్రఖ్యాత జ్యోతిష్కులు అతడిని పరీక్షించారు కూడా! జ్యోతిష శాస్త్రంలో నవాంశ, దశాంశ, షోడశాంశ, త్రిశాంశ, షష్ఠ్యంశ లాంటి వాటిపై ప్రశ్నలు అడిగితే టకటకా సమాధానాలు చెప్పాడు. ‘అనేక రకాల జ్యోతిష విధానాలు ఉన్నాయి కదా... నువ్వు ఏ జ్యోతిష విధానాన్ని అనుసరిస్తావు’ అని అడిగితే... ‘నాకు ప్రశ్న జ్యోతిషం ఇష్టం. ఎందుకంటే నేటి కలియుగ పరిస్థితుల్లో... పుట్టిన సమయాన్ని ఎవరూ కచ్చితంగా నిర్ణయించలేరు. అందువల్ల ఫలితాలను కచ్చితంగా చెప్పడానికి ప్రశ్న జ్యోతిష విధానం బాగుంటుంది’ అంటాడు. గ్రహస్థితులను అనుసరించి బంగారం ధర రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో అంచనా కూడా వేస్తుంటాడు. ‘జ్యోతిషం అబద్ధం అనేవారు చాలామందే ఉన్నారు. కానీ జ్యోతిషం నిజం’ అంటాడు ఈ బాల మేధావి. జ్యోతిషం మాటెలా ఉన్నా... నేడు అతని వీడియోలు వైరల్‌ అన్నది కనిపిస్తున్న నిజం.

-పామర్తి హేమసుందర్‌



Updated Date - 2020-04-06T06:26:49+05:30 IST