అభిబస్ ‌ఎంతవరకు సక్సెస్‌..?

ABN , First Publish Date - 2020-07-07T18:36:40+05:30 IST

ఆర్టీసీ బస్సుల్లో స్పాట్‌ రిజర్వేషన్‌ కోసం..

అభిబస్ ‌ఎంతవరకు సక్సెస్‌..?

ఆంధ్రజ్యోతి, విజయవాడ : ఆర్టీసీ బస్సుల్లో స్పాట్‌ రిజర్వేషన్‌ కోసం ఉన్నతాధికారులు అభిబస్‌ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం వివాదాస్పదమవుతోంది. సాధారణంగా నామినేషన్‌ విధానం ఒక ఏడాదికి మించి ఉండదు. అదేమి చిత్రమో అభిబస్‌ సంస్థకు ఐదేళ్లకు నామినేషన్‌ పద్ధతిన కేటాయించారు. ఈ విధానాన్ని ఆర్టీసీలోని కొందరు అధికారులు వ్యతిరేకించినా, ఉన్నతాధికారులు మాత్రం ఓటు వేయటం వివాదాస్పదమవుతోంది. వైసీపీ ప్రభుత్వం వచ్చీ రాగానే అభిబస్‌తో ఒప్పందాలను పునః సమీక్షించటం జరిగింది. ఆ సంస్థతో గడువు ముగుస్తున్న దశలో స్పాట్‌ రిజర్వేషన్‌ యాప్‌కు రూపకల్పన చేయటం, ఇందుకోసం ఒప్పందం కుదుర్చుకోవటం మరింత చర్చనీయాంశమైంది. ఒప్పందంలోని అంశాలూ విమర్శలకు తావిస్తున్నాయి. 


పేదలకు అక్కరకొస్తుందా..?

కరోనా సీజన్‌లో నగదు రహిత లావాదేవీల కోసం సత్వరం పనిచేసే ఒక యాప్‌ను తీసుకురావాలన్న ఉద్దేశంతో అభిబస్‌ సంస్థతో ఆర్టీసీ యాజమాన్యం ఒప్పందం చేసుకుంది. కరెంట్‌, అడ్వాన్స్‌ రిజర్వేషన్‌ చేసుకోవటానికి ఆర్టీసీ ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌ ఉంది. అయినప్పటికీ స్పాట్‌ రిజర్వేషన్‌ పేరుతో ఈ కొత్త యాప్‌ను తీసుకొచ్చారు. ఏరోజుకారోజు ఈ యాప్‌ ద్వారా టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చు. దీనిద్వారా సత్వరం టికెట్‌ వస్తుందని ఆర్టీసీ అధికారులు చెబుతున్న మాట. ఆర్టీసీ బస్సుల్లో సింహభాగం పేద, మధ్య తరగతి వర్గాలే ప్రయాణిస్తుంటారు. వీరిలో చాలామందికి సాంకేతికత తెలియదు. నూరుశాతం క్యాష్‌లెస్‌ విధానంలో టికెట్‌ బుకింగ్‌ అనేది జరగని పని. ప్రతి టికెట్‌ కోసం ఆర్టీసీ అభిబస్‌కు 15 పైసలు చెల్లిస్తుందని ఒప్పందంలో పొందుపరిచారు.


అంతమంది ప్రయాణికులు ఉంటారా..?

సాధారణంగా రోజుకు 60 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తుంటారు. ఇందులో వివిధ రకాల పాస్‌లు పోనూ, నికరంగా 40 లక్షల మంది ప్రయాణిస్తారు. కరోనా కారణంగా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఇలాంటి సందర్భంలో ఆర్టీసీ అధికారులు 10 లక్షల మంది ప్రయాణిస్తారన్న గ్యారెంటీని అభిబస్‌ సంస్థకు ఇవ్వటం వెనుక కారణమేంటో తెలియట్లేదు. కరోనాను దృష్టిలో ఉంచుకుని చూస్తే నామినేషన్‌ పద్ధతిలో ఏడాదికి మాత్రమే ఒప్పందం కుదుర్చుకునేవారు. కానీ, ఐదేళ్లకు ఇవ్వడం వెనుక కథ ఏమిటో అర్థం కావట్లేదు. కాగా, ఈ స్పాట్‌ రిజర్వేషన్‌ యాప్‌కు ‘ప్రథమ’ అనే పేరును పరిశీలిస్తున్నారు. 


Updated Date - 2020-07-07T18:36:40+05:30 IST