కడుపుకోతలు

ABN , First Publish Date - 2022-05-02T05:30:00+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్‌ కిట్‌, అమ్మఒడి వంటి పథకాలను అమలు చేస్తున్నా ప్రసవాల కోసం ప్రైవేట్‌ ఆస్పత్రుల గడపతొక్కే వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు.

కడుపుకోతలు

- జిల్లాలోని ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో విచ్చలవిడిగా పెరిగిన సిజేరియన్లు

- ప్రభుత్వ నజరానా వదులుకొని ప్రైవేట్‌ ఆసుపత్రుల వైపు పరుగులు

- వసతులు లేకపోవడం సిబ్బంది కొరతే కారణం

- ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరిపడా గైనిక్‌ వైద్యులు లేక ఆలస్యమవుతున్న ప్రసవాలు

- దీంతో ప్రాణాపాయస్థితికి చేరుకుంటున్న తల్లీ, బిడ్డ

- మొదటి కాన్పులో సాధారణ ప్రసవాలే చేయాలని ప్రభుత్వ ఆదేశాలు

- ప్రభుత్వ ఆదేశాలను పాటించని యాజమాన్యాలు


కామారెడ్డి, మే 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్‌ కిట్‌, అమ్మఒడి వంటి పథకాలను అమలు చేస్తున్నా ప్రసవాల కోసం ప్రైవేట్‌ ఆస్పత్రుల గడపతొక్కే వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు లేక, గైనిక్‌ వైద్యుల కొరత, అత్యవసర సమయాల్లో కిందిస్థాయి సిబ్బంది వ్యవహరించే తీరు వంటివి నచ్చక చాలా మంది ప్రభుత్వం అందించే నజరానాను వదులుకొని ప్రైవేట్‌ ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. దీనిని ఆసరాగా చేసుకొని కొంత మంది ప్రైవేట్‌ ఆసుపత్రుల యాజమాన్యాలు అవసరం లేకున్నా సిజేరియన్లు చేస్తున్నారు. ఇలా చేసి రూ.వేలకు వేలు లాగుతూ అక్రమార్జనకు ఒడిగడుతున్నారు. ఈ విధానానికి స్వస్తి చెప్పాలని భావించిన కేంద్ర ప్రభుత్వం గతంలోనే జాతీయ ఆరోగ్యమిషన్‌ పథకంలో భాగంగా ప్రైవేట్‌ ఆస్పత్రిలో సిజేరియన్‌ చేయాలంటే అనుమతి ఉండాలనే నిబంధన విధించింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సైతం మొదటి కాన్పు సాధారణ ప్రసవం చేయడంతో పాటు అవసరమైతేనే సిజేరియన్‌ల వైపు మొగ్గు చూపాలని ఆదేశించింది. ఈ ఆదేశాలను కొంత మేర ప్రభుత్వ ఆసుపత్రుల్లో అమలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ప్రైవేట్‌ ఆసుపత్రులు మాత్రం అమలు చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెరిగిన ప్రసవాలు

ప్రభుత్వ ఆసుపత్రుల్లో రూపాయి ఖర్చు లేకుండా ప్రసవం చేస్తుంటే ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో మాత్రం సిజేరియన్‌ల పేరిట భారీగానే వసూలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్‌ కిట్‌ను ప్రవేశపెట్టక ముందు ప్రైవేట్‌ ఆసుపత్రుల్లోనే అధికంగా ప్రసవాలు జరిగేవి. కొంత మంది వైద్యులు రక్తహీనత, బీపీ ఎక్కువగా ఉందని గర్భంలో శిశువు ఉమ్మనీరు మింగిందని గర్భిణి కుటుంబీకులను కంగారు పెట్టించి డబ్బులు లాగడమే లక్ష్యంగా సిజేరియన్‌ల వైపు మొగ్గు చూపుతూ వచ్చారు. వాస్తవానికి అత్యవసర పరిస్థితుల్లోనే సిజేరియన్‌లు చేయాలనే నిబంధన ఉన్నప్పటికీ అవేమీ పట్టించుకోకుండా సాధారణ ప్రసవమైతే తక్కువ డబ్బు వస్తుందని, సిజేరియన్‌ చేస్తే అన్ని విభాగాలతో పాటు వైద్యులకు సైతం ఎక్కువ మొత్తంలోనే డబ్బులు అందే అవకాశం ఉందని కడుపుకోతలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. బాధితులు చేసేదిమీ లేక, ఆర్థిక స్థోమత సరిపడకపోయినా రూ.40వేల నుంచి 60వేల వరకు చెల్లించేవారు. కేసీఆర్‌ కిట్‌ అమలు జరిగినప్పటి నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు గణనీయంగా పెరిగాయి. కానీ ప్రస్తుతం సిబ్బంది లేమి, పురిటినొప్పులు భరించలేక గర్భిణి, వారి కుటుంబీకులు వైద్యసిబ్బందిని తొందరపాటు పెట్టే చర్యలు, పురిటినొప్పులు వచ్చే దాక వేచి చూసే ప్రదర్శన చేయడంతో అనుకోని పరిస్థితుల్లో తల్లీ, బిడ్డకు ఏదైన ప్రమాదం సంభవిస్తే వారి కుటుంబీకులు దురుసు ప్రవర్తన, దాడులకు భయపడి ప్రభుత్వ ఆసుపత్రుల్లో సైతం ఆపరేషన్ల వైపు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. అయితే ఇటీవల మంత్రి హరీష్‌రావు ప్రసవాలపై చేసిన రివ్యూ ఆధారంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ కాన్పులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. 

సిజేరియన్‌లకే ప్రాధాన్యత..

కామారెడ్డి జిల్లాలో గత 4 సంవత్సరాల కాలంలో మొత్తం 76,477 ప్రసవాలు జరగగా అందులో ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ ప్రసవాలు 34,165, సిజేరియన్‌లు 11,813 జరుగగా ప్రైవేట్‌ ఆసుపత్రిలో సాధారణ ప్రసవాలు 13,690, సిజేరియన్‌లు 16,809 జరిగాయి. ఈ లెక్కలను పరిశీలిస్తే ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో జరుగుతున్న సిజేరియన్ల తీరు అర్థం చేసుకోవచ్చు. కేసీఆర్‌ కిట్‌ వచ్చినప్పటి నుంచి ప్రైవేట్‌ ఆసుపత్రుల ధనార్జన తగ్గిపోవడం వల్ల ఆపరేషన్లకే మొగ్గు చూపుతూ అధికారుల కళ్లు కప్పేందుకు తూతూ మంత్రంగా నార్మల్‌ డెలివరీలు చేస్తున్నారు. కొన్నిచోట్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులు సరిగా లేకపోవడం బెడ్లు సరిపడా లేకపోవడం, డాక్టర్ల కొరత, సిబ్బంది కొరత వల్ల డెలివరీలు చేయడం ఆలస్యం అవుతుండడంతో ప్రైవేట్‌ ఆసుపత్రికి వెళ్తున్నారు. ఇలా వెళ్తున్న వారిని వదిలిపెట్టకుండా అవసరం లేకున్నా సిజేరియన్‌లు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో సిజేరియన్లపై వైద్య ఆరోగ్యశాఖ పకడ్బందీగా చర్యలు తీసుకుంటేనే సిజేరియన్‌లు తగ్గే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోని లోటు పాట్లపై దృష్టిసారించి అప్పుడప్పుడు జరుగుతున్న సిజేరియన్లను సైతం తగ్గించేలా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

సిజేరియన్ల వల్ల కలిగే అనర్థాలు

సిజేరియన్లు చేయడం వల్ల మహిళల్లో పలు రకాల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణ డెలివరీల్లో పుట్టె చిన్నారుల కంటే సిజేరియన్లలో పుట్టె చిన్నారులకు అనేక రకాలైన సమస్యలు ఏర్పాడుతాయని అంటున్నారు. అదేవిధంగా శస్త్ర చికిత్స జరిగేప్పుడు రక్తం ఎక్కువగా పోవడం వల్ల మహిళలకు ఆరోగ్య విషయంలో ఇబ్బందులు ఏర్పడడమే కాకుండా సాధారణ ప్రసవం అయినవారితో పోలిస్తే ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాల్సి వస్తోంది. మత్తులో ఉండడం వల్ల పుట్టిన బిడ్డకు వెంటనే ముర్రుపాలు ఇవ్వలేకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. మహిళలు శారీరకంగా, మానసికంగా ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసివస్తోందని నిపుణులు అంటున్నారు.

ప్రభుత్వ ఆదేశాలు బేఖాతర్‌

గర్భిణుల ఆరోగ్య పరిస్థితులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తం చేస్తూ అనేక రకాల నిబంధనలు తీసుకువస్తున్నా అవి కేవలం కాగితాలకు మాత్రమే పరిమితమవుతున్నట్లు తెలుస్తోంది. వాటిని అమలు చేయాల్సిన అధికారుల అలసత్వం వల్లే ప్రభుత్వ లక్ష్యాలు నీరుగారుతున్నాయని సమాచారం. ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో జరుగుతున్న సిజేరియన్లకు సంబంధించిన లెక్కలను చూసి కట్టడి చేయాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటూ తూతూ మంత్రంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. ఇటీవల వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు సైతం ప్రసవాలు జరుగుతున్న తీరుపై పలు సూచనలు చేయగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొంతమేర మార్పు కనిపిస్తున్నా ప్రైవేట్‌ ఆసుపత్రుల తీరు మాత్రం మారడం లేదని తెలుస్తోంది. మొదటి కాన్పు ఖచ్చితంగా సాధారణ ప్రసవమే చేయాలని ఆదేశాలు ఉన్నప్పటికీ బేఖాతర్‌ చేస్తున్నారనే వాదనలు లేకపోలేదు.

Read more