వదల బొమ్మాళీ..!

ABN , First Publish Date - 2022-05-22T07:01:11+05:30 IST

వదల బొమ్మాళీ..!

వదల బొమ్మాళీ..!

వాహన తయారీదారులను వీడని కష్టాలు

ఈ ఏడాదీ ‘చిప్‌’లు, ముడి సరుకులకు కొరతే..!

వాహన తయారీదారులను కష్టాలు వీడనంటున్నాయి. కరోనా సంక్షోభం కారణంగా కుంటుపడిన విడిభాగాలు, ముడి సరుకుల సరఫరా ఈ ఏడాదిలోనైనా మెరుగవుతుందని, వాహన విక్రయాలు మళ్లీ పుంజుకోవచ్చన్న వారి అంచనాలు తలకిందులయ్యాయి. రష్యా -ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం, చైనాలో కరోనా మళ్లీ విజృంభించడం వంటి పరిణామాలు ఆటోమొబైల్‌ కంపెనీల ఆశలపై నీళ్లు జల్లాయి. ఎందుకంటే, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తలతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి సరుకులు, ముఖ్యంగా వాహన తయారీలో ఉపయోగించే లోహాల ధరలు అనూహ్యంగా పెరిగాయి. ముడిసరుకుల సరఫరాలో నూ ఇబ్బందులెదురవుతున్నాయి. సెమీకండక్టర్లు (చిప్‌) సహా ఇతర ఎలకా్ట్రనిక్‌ విడి భాగాలను సరఫరా చేసే చైనా పారిశ్రామిక వాడలు లాక్‌డౌన్‌ కావడంతో వాటి కొరత ఇప్పట్లో తీరేలా కన్పించడం లేదు. ఇందుకు తోడు కంపెనీలు ఉత్పత్తి వ్యయ భారం కారణంగా వాహనాల ధరలను ఇప్పటికే పలు మార్లు పెంచాయి. ఇంధనం ధరలూ భగ్గుమంటుండటంతో వాహనం కొనుగోలు చేయాలనుకునేవారు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సి వస్తోంది. 

పైగా, ధరలను నియంత్రించే చర్యల్లో భాగంగా ఆర్‌బీఐ ఇప్పటికే రెపో రేటును 0.40 శాతం పెంచింది. మున్ముందు పరపతి సమీక్షల్లో మరింత వడ్డింపు తప్పదని విశ్లేషకులు అంటున్నారు. దాంతో వాహన రుణాలూ ప్రియం కానున్నాయి. అన్నీ వెరసి, వాహన గిరాకీపై గణనీయ ప్రభావం చూపవచ్చని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. మౌలిక ప్రాజెక్టుల్లో పెరిగిన ప్రభుత్వ పెట్టుబడులు, ఈ ఏడాదీ మెరుగైన వర్షపాతం నమోదుకావచ్చన్న అంచనాలు, కొత్త వాహన మోడళ్ల విడుదలతో పాటు పెంట్‌అప్‌ డిమాండ్‌ వంటి అంశాలు మాత్రం ఈ ఏడాది ఆటో రంగ వృద్ధికి దోహదపడగలిగే అవకాశాలున్నాయి. 

Updated Date - 2022-05-22T07:01:11+05:30 IST