నన్ను కలవడం సీఎస్‌కు ఇష్టం లేదేమో..!

ABN , First Publish Date - 2022-05-20T08:35:09+05:30 IST

‘‘నా సస్పెన్షన్‌ చట్ట విరుద్ధమని కోర్టు చెప్పింది.. సస్పెన్షన్‌ ఎత్తివేత జీవోలో టెక్నికల్‌ లోపం ఉంది. ఆ విషయాన్ని వివరించి జీతం అడిగేందుకు సీఎ్‌సను కలిసే యత్నం చేశాను. అందుబాటులో ఉన్నా జీఏడీలో రిపోర్టు చేసి వెళ్లమన్నారు. నన్ను కలవడం

నన్ను కలవడం సీఎస్‌కు ఇష్టం లేదేమో..!

సస్పెన్షన్‌ ఎత్తివేత జీవోలో లోపాలున్నాయి

అవి వివరించేందుకే కలవాలనుకున్నాను

కానీ, జీఏడీలో రిపోర్టుచేసి వెళ్లమన్నారు

జీవో సవరిస్తే సరే..లేదంటే మళ్లీ కోర్టుకు..: ఏబీవీ


అమరావతి, మే 19(ఆంధ్రజ్యోతి): ‘‘నా సస్పెన్షన్‌ చట్ట విరుద్ధమని కోర్టు చెప్పింది.. సస్పెన్షన్‌ ఎత్తివేత జీవోలో టెక్నికల్‌ లోపం ఉంది. ఆ విషయాన్ని వివరించి జీతం అడిగేందుకు సీఎ్‌సను కలిసే యత్నం చేశాను. అందుబాటులో ఉన్నా జీఏడీలో రిపోర్టు చేసి వెళ్లమన్నారు. నన్ను కలవడం ఆయనకు ఇష్టం లేదేమో. బిజీగా ఉంటే రేపు వస్తానని పీఎ్‌సను అడిగాను. జీఏడీలో ఇవ్వమన్నారు. జీఏడీలోని కార్యదర్శులందరూ నా కన్నా జూనియర్లు. సివిల్‌ సర్వీసెస్‌ రూల్స్‌ ప్రకారం జూనియర్‌కు సీనియర్లు రిపోర్టు చెయ్యరు. అయినా రిపోర్టు చెయ్యడం వరకే నా పని’’ అని డీజీపీ ర్యాంకు ఐపీఎస్‌ అధికారి, నిఘా విభాగం మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. వైసీపీ ప్రభుత్వం తనపై కక్షకట్టి చేస్తున్న వేధింపులపై న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఆయన, కోర్టు తీర్పు మేరకు ఇటీవల సీఎ్‌సను కలిసి వినతిపత్రం ఇచ్చారు. తాజాగా ఆయన సస్పెన్షన్‌ ఎత్తేసినా, ప్రభుత్వం జీఏడీలో రిపోర్టు చేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. అందులో ఉన్న లోపాలను వివరించేందుకు గురువారం సచివాలయంలో సీఎస్‌ సమీర్‌ శర్మను కలిసేందుకు ఏబీ వెంకటేశ్వరరావు ప్రయన్నించారు.


తనను సస్పెండ్‌ చేస్తూ ఇచ్చిన జీవోనే అసంపూర్ణంగా ఉందని, ప్రభుత్వం వేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్‌ చేసినందున.. హైకోర్టు ఆర్డర్‌ను అమలు చేయాలని చెప్పేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. జాయినింగ్‌ రిపోర్టు పేషీలో ఇచ్చి వెళ్లాలని సూచించగా.. అలాగే ఇచ్చి ఆయన బయటకు వచ్చారు. అనంతరం విజయవాడలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి. అలా చేయాలంటే నన్ను సస్పెండ్‌ చేసిన రోజు నుంచే సర్వీసును పునరుద్ధరించాలి. అయితే ప్రభుత్వం అవేవీ పట్టించుకోకుండా రెండేళ్ల సస్పెన్షన్‌ గురించి చెప్పకుండా ఈ ఏడాది ఫిబ్రవరి 8నుంచి సస్పెన్షన్‌ రీవోక్‌ చేస్తున్నట్లు జీవో ఇవ్వడం ఏమిటి? అందులో ఏముందో చదువు కోలేదా? లేక లీగల్‌ అభిప్రాయం అలా వచ్చిందా అనేది తెలీదు. ఈ విషయాన్ని వివరించేందుకే సీఎ్‌సను కలుద్దామనుకున్నాను. ‘మీరిచ్చిన ఆర్డర్‌ అసంపూర్తిగా ఉందని’ చెప్పాలనుకున్నాను. ‘సరిచేస్తే సరి చేయండి... లేదంటే మళ్లీ నేను కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంద’ని చెబుదామనుకున్నాను’ అని ఏబీవీ వివరించారు. రెండు రెళ్లు నాలుగు అనేదానికి కూడా కోర్టుకు వెళ్లాలంటే ఎలా.. డబ్బు, సమయం వృథా కదా.. అని ప్రశ్నించారు. ‘‘నేను తప్పు చేసి ఉంటే తేల్చాలి. మూడేళ్లుగా ఏమి చేస్తున్నారు? ఈ ప్రభుత్వం ఏర్పడిన పద్దెనిమిది నెలలకు ఒక చార్జిషీట్‌ ఇచ్చారు.? అది కూడా సుప్రీంకోర్టు చెబితేనే చేశారు. పోనీ అందులో ఏమన్నా ఉన్నాయా అంటే.. ఏమీ లేవు. అదిచ్చి ఇప్పటికే ఏడాదిన్నర అయింది. ఏమైనా తేల్చారా? ఫలానా తప్పు చేశావని చెప్పారా అంటే అదీ లేదు. ఏదైనా ఉంటే తేల్చండి. ఉంటే కేసు పెట్టండి. తప్పులు తేల్చకుండా మీడియా ద్వారా బురద జల్లడం ఎంతవరకు సమంజసం?’’ అంటూ ప్రశ్నలవర్షం కురిపించారు. విజయవాడ పోలీస్‌ కమిషనర్‌గా ఉన్నప్పుడు బాధితుల ఇళ్లకెళ్లి ఎఫ్‌ఐఆర్‌లు ఇచ్చివచ్చే విధానం ప్రవేశ పెట్టామని, రాజకీయాలకు అతీతంగా పోలీసులు పనిచేసేలా మానిటరింగ్‌ సిస్టమ్‌ అమలు చేశానని వివరించారు. అవేవీ తెలుసుకోకుండా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారన్నారు. 


కోర్టు ఖర్చులు వారితో రికవరీ చేయాలి: సీఎస్‌కు ఏబీవీ లేఖ 

రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయని, ఏ విక్రేతకూ రూపాయి చెల్లించని వ్యవహారంలో తనపై కల్పిత ఆధారాలు సృష్టించిన వారి నుంచి న్యాయస్థానం ఖర్చులు రికవరీ చేయాలని ఏబీ వెంకటేశ్వరరావు... సీఎస్‌ సమీర్‌శర్మకు లేఖ రాశారు. రాష్ట్రంలో 2019 మే 30న ప్రభుత్వం మారగానే ఏసీబీ డీజీగా ఉన్న తనను జీఏడీకి బదిలీ చేసి పోస్టింగ్‌ లేకుండా, జీతం ఇవ్వకుండా వేధించడంతో కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు. తనకు జరిగిన అన్యాయంపై అప్పటి సీఎస్‌ నీలం సాహ్ని, సలహాదారు అజేయ్‌ కల్లంకు విన్నవించినట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. అప్పట్లో సీఎం కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, సీఐడీ ఏడీజీ పీవీ సునీల్‌ కుమార్‌, ఓఎ్‌సడీ విజయ్‌పాల్‌ అనైతిక చర్యల వల్ల ప్రభుత్వానికి తన జీతభత్యాల భారం, తనకు కోర్టు ఖర్చులు తప్పలేదని వివరించారు. ఆ సొమ్మును అనైతిక చర్యలకు పాల్పడిన అధికారుల నుంచి రికవరీ చేయాలని లేఖలో కోరారు. న్యాయం కోసం ఖరీదైన లాయర్లను నియమించుకున్న తన ఖర్చులు కూడా వారి నుంచే రికవరీ చేసి ఇప్పించాలని కోరారు.

Updated Date - 2022-05-20T08:35:09+05:30 IST