అవి ఫోర్జరీ పత్రాలు.. డీజీపీ కార్యాలయమే సృష్టించింది

ABN , First Publish Date - 2021-04-11T08:30:34+05:30 IST

ఫోర్జరీ, మోసం, సాక్షులు, సాక్ష్యాల్ని ట్యాంపరింగ్‌ చేయడం లాంటి నేరాలకు సాక్ష్యాత్తూ డీజీపీ, సీఐడీ అదనపు డీజీ, ఏసీబీ డీజీ, నిఘా విభాగం అధికారులు పాల్పడ్డారని

అవి ఫోర్జరీ పత్రాలు.. డీజీపీ కార్యాలయమే సృష్టించింది

సీబీఐ విచారణ జరిపించండి

ఆ నకిలీ పత్రాల ఆధారంగా సస్పెన్షన్‌

ప్రవీణ్‌ ప్రకాశ్‌, అప్పటి సీఎస్‌ సాహ్నిని

బాధ్యులను చేసి చర్యలు తీసుకోవాలి

వారిని పోస్టుల నుంచి తొలగించండి

అప్పుడే నిష్పాక్షిక విచారణకు అవకాశం

సీఎస్‌కు ఏబీ వెంకటేశ్వరరావు లేఖ


అమరావతి, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): ఫోర్జరీ, మోసం, సాక్షులు, సాక్ష్యాల్ని ట్యాంపరింగ్‌ చేయడం లాంటి నేరాలకు సాక్ష్యాత్తూ డీజీపీ, సీఐడీ అదనపు డీజీ, ఏసీబీ డీజీ, నిఘా విభాగం అధికారులు పాల్పడ్డారని నిఘా విభాగం మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు ఆరోపించారు. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌కు శనివారం ఆయన లేఖ రాశారు. అంతర్వేది రథం దగ్ధం కేసును సీబీఐకి ఇచ్చినట్లే, ఈ నేరాలపైనా ఆ సంస్థతో విచారణ చేయించాలన్నారు. ‘‘ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్‌, నాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ, సీఐడీ ఏడీజీ, సీఐడీ డీఎస్పీలు...నా కుమారుడు పూర్తిగా నాపై ఆధారపడి ఉంటే తప్ప రూల్‌4(3)(ఎ) వర్తించదన్న విషయాన్ని గుర్తించడంలో విఫలమయ్యారు. ఈ అధికారులు బుర్ర పెట్టి ఆలోచించకుండా సదరు సెక్షన్‌ను నా కేసుకు వర్తింపచేయడం వల్ల ప్రభుత్వం నన్ను సస్పెండ్‌ చేస్తూ అక్రమంగా ఉత్తర్వులు ఇచ్చింది. ఈ దృష్ట్యా ప్రవీణ్‌ప్రకాశ్‌, నీలం సాహ్నిపై కూడా చర్యలు తీసుకోవాలి’’ అని తొమ్మిది పేజీల లేఖలో కోరారు. ఫోర్జరీ, మోసం లాంటివి ఎలా జరిగాయో అందులో వివరించారు.ఆ లేఖ సారాంశం ఇదీ.. 


అందరూ పెద్దలే...

‘‘నా నిర్ద్దోషిత్యాన్ని నిరూపించుకునేందుకు, జరిగిన తప్పులను చెప్పేందుకు నా కేసుపై నియమించిన విచారణ కమిషన్‌ను బహిరంగంగా, మీడియా ముందే విచారణ చేయాలని కోరాను. కానీ నా అభ్యర్థనను తిరస్కరించారు. అనంతరం ఈ ఏడాది మార్చి 18వ తేదీన నా కేసులో విచారణ ప్రారంభమైంది. ఆ మరునాటి ఉదయమే విజయవాడ, హైదరాబాద్‌లోని నా నివాసాల్లో సోదాలు చేశారు. ఒక ల్యాప్‌టాప్‌, డెస్క్‌ టాప్‌ సీజ్‌ చేశారు. విచారణ కమిషన్‌ ముందు విచారణకోసం నేను సిద్ధం చేసుకున్న నోట్సు, ప్రశ్నలు అన్నీ వాటిలోనే ఉన్నాయి. మరికొన్ని డాక్యుమెంట్లను కూడా వాళ్లు సీజ్‌ చేశారు. ఇన్ని చేసినా విచారణ కమిషన్‌ ముందు మార్చి 22నుంచి ఏప్రిల్‌ 4వ తేదీవరకు జరిగిన విచారణలో పాల్గొని...అన్ని విషయాలను ఆన్‌రికార్డ్‌గా సమర్పించాను. ఇరువైపుల వాదనలు ముగిశాక ఈ నెల ఏడో తేదీన ప్రాసిక్యూషన్‌ తన వాదనలను రాతపూర్వకంగా కమిషన్‌ ముందు సమర్పించింది.


ఇలా సమర్పించిన డాక్యుమెంట్లు, అంతకుముందు హైకోర్టు, సుప్రీంకోర్టు, క్యాట్‌లలో ప్రాసిక్యూషన్‌ (ప్రభుత్వం) సమర్పించిన పత్రాలన్నీ పరిశీలిస్తే...అందులో జరిగిన నేరాలు అర్థమయ్యాయి. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్నవారంతా సీనియర్‌ అధికారులు, కీలక పదవుల్లో ఉన్నవారే. అందుకే విచారణ న్యాయబద్ధంగా, సకాలంలో జరిగేందుకు వారిని అదే పోస్టుల్లో కొనసాగించే అంశంపై పునరాలోచించాలి’’


మెమో తేదీ ఫోర్జరీ చేశారు

‘‘సీఐడీ డీఎస్పీ విజయ్‌పాల్‌ ఇచ్చిన నివేదిక మేరకు నన్ను సస్పెండ్‌ చేశారు. డీజీపీ 2.2.2020న సీఐడీ అదనపు డీజీకి నాపై వచ్చిన ఆరోపణలపై విచారించాలని ఒక మెమో పంపించారు. ఆ మెమోను సీఐడీ అదనపు డీజీ...సీఐడీ డీఎస్పీ విజయ్‌పాల్‌కు 3.2.2020న ఎండార్స్‌ చేశారు. దాని ఆధారంగా డీఎస్పీ విచారణ చేసి, అదే నెల ఐదవ తేదీన నివేదిక ఇచ్చారు. ఆ నివేదికను ఆరోతేదీన డీజీపీకి సీఐడీ ఫార్వార్డ్‌ చేసింది. దాన్ని ఆధారం చేసుకుని 8వ తేదీన నన్ను సస్పెండ్‌ చేశారు. అయితే ఇందులో ట్విస్టు ఏంటంటే...విచారణ కమిషన్‌ ముందు నాపై విచారణ చేయాలంటూ సీఐడీ అదనపు డీజీకి 5.2.2020న ఉత్తర్వులిచ్చినట్లు పేర్కొన్నారు. అంటే ఆ మెమోను డీజీపీ తన సంతకంతో ఐదో తేదీన లేకుంటే రెండో తేదీన అయినా ఇచ్చి ఉండాలి.


కానీ నోట్‌ఫైల్‌ను పరిశీలిస్తే ఆ మెమోను రవిశంకర్‌ డ్రాఫ్ట్‌ చేయగా...డీజీపీ తన స్వదస్తూరితో కరెక్షన్‌ చేశారు. అది ఐదో తేదీన జరిగింది. అంటే ఐదో తేదీన డ్రాఫ్ట్‌ సిద్ధమైతే...దాన్ని రెండో తేదీనే సీఐడీ అదనపు డీజీకి పంపించినట్లు, దాన్ని ఆయన మూడో తేదీన సీఐడీ డీఎస్పీకి పంపినట్లు, దానిపై సీఐడీ డీఎస్పీ ఐదో తేదీన నివేదిక ఇచ్చినట్లు ఎలా చూపిస్తారు? అంటే ఐదో తేదీన ఇచ్చిన మెమోను రెండో తేదీన ఇచ్చినట్లు డీజీపీయే దిద్దారు. ఇది స్పష్టమైన ఫోర్జరీనే. ఈ దృష్ట్యా ఐపీసీ సెక్షన్‌ 468కింద అతను శిక్షార్హుడు.


కాలం వెనక్కినడిచిందా?

ఇజ్రాయెల్‌ నుంచి దిగుమతి చేసుకోవాలనుకున్న నిఘా పరికరాల కొనుగోలు ఆర్డర్‌ను రద్దు చేస్తున్నట్లుగా 24.12.2018న డీజీపీ ఉత్తర్వులిచ్చినట్లు రవిశంకర్‌ పేర్కొన్నారు. నోట్‌ఫైల్‌లోని పేరా 77లో దీన్ని పేర్కొన్నారు. ఏసీబీకి 26.5.2020న రాసిన లేఖలో, ఆ తర్వాత 27.3.2021న విచారణ కమిషన్‌ ముందు... డీజీపీ ఉత్తర్వుల మేరకు అన్నీ పరిశీలించి చేశానన్నారు. అయితే పరిశీలనలో ఆ నోట్‌ఫైల్‌లోని పేరా 77, పేజీ నెంబర్‌58ని చీఫ్‌ అడ్మినిస్ర్టేటివ్‌ అధికారి 9.1.2019న సిద్ధం చేశారు. 10.1.2019న రవిశంకర్‌ దానిపై సంతకం చేశారు. మరి అలాంటప్పుడు కొనుగోలు రద్దు ఆర్డర్‌ 24.12.2018నే ఎలా సిద్ధమైనట్లు? అంటే కొనుగోలు ఆర్డర్‌ రద్దు విషయంలోను, అదే సమయంలో నాపై విచారణ చేయాలని డీజీపీ ఇచ్చిన మెమో విషయంలోను కాలం వెనక్కినడి చిందన్న మాట!


అదేవిధంగా ఏసీబీ తప్పుడు సమాచారంతో నివేదికలు పంపించింది. తారుమారు చేసిన నివేదికలు నన్ను సస్పెండ్‌ చేసేలా ప్రభుత్వం తప్పుడు నిర్ణయం తీసుకునేందుకు కారణమయ్యాయి. వీటన్నింటిపైనా నా దగ్గర స్పష్టమైన ఆధారాలున్నాయి. ఒక నోట్‌ ఫైల్‌ను నేను సస్పెండ్‌ కావడానికి ముందు ఐపీఎస్‌ అధికారి రఘురామిరెడ్డి 13.12.2019న పట్టుకెళ్లిపోయి 19.12.2019న తిరిగి తెచ్చారు. అనధికారికంగా ఈ పనిచేశారు. ఆ నోట్‌ఫైల్‌లో విషయాలను ఏం తారుమారుచేశారు... దాని ఆధారంగా ఏ నివేదికలు సృష్టించారో విచారణ జరగాలి. అదేవిధంగా డీజీపీ కొన్ని విషయాలను కావాలని ప్రభుత్వానికి చెప్పకుండా తొక్కిపెట్టేయడం నా సస్పెన్షన్‌కు కారణమైంది.


నంబి నారాయణ కేసులాగే... 

‘‘యాధృచ్చికంగా నాపై విచారణ జరిగిన ఈ నెల నాలుగో తేదీనే పత్రికల్లో నంబి నారాయణ్‌ కేసుకు సంబంఽధించిన విషయం ప్రచురితమైంది. 1994లో నంబి నారాయణ్‌ కేసులో అప్పటి డీజీపీ, ఇంటెలిజెన్స్‌ బ్యూరో జాయింట్‌ డైరక్టర్‌ తప్పుడు కేసులు బనాయించారు. దీనిపై సుప్రీంకోర్టులో కేసు వేశారు. తప్పుడు కేసు బనాయించినందుకు గాను నంబి నారాయణ్‌కు రూ.1.3కోట్ల పరిహారం కేరళ ప్రభుత్వం చెల్లించాల్సి వచ్చింది. సదరు తప్పుడు కేసులు బనాయించిన అధికారులపై చర్యలకు విచారణ కొనసాగుతోంది. ఈ కేసుతో తన కేసుకు పోలికలు ఉన్నాయి’’ అని ఏబీ వెంకటేశ్వరరావు... సీఎ్‌సకు రాసిన లేఖలో పేర్కొన్నారు. 


నేరాలు ఇవీ..

1) నకిలీ పత్రాలు తయారుచే సి, వాటినే అసలైనవిగా సమర్పించారు. 

2) ట్యాంపరింగ్‌ చేసిన పత్రాల ఆధారంగా విచారణ నివేదిక తయారుచేశారు. 

3) ఎలాంటి రాతపూర్వక ఆదేశాలు లేకుండా అనధికారిక ఉత్తర్వులు జారీచేశారు. 

4) తప్పుడు సమాచారం ఉన్న నివేదికలు పంపి..వాటి ఆధారంగా నా సస్పెన్షన్‌ పై ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకొంది. 

5) అధికారం, కాజ్‌ ఆఫ్‌ యాక్షన్‌ లేకుండా రైట్‌ టు ప్రైవసీకి భంగం కలిగించారు. 

6) సాక్షుల్ని బెదిరించారు. మోసం, ఫోర్జరీ, సాక్షులు, సాక్ష్యాల్ని తారుమారుచేశారు. 


ఫోర్జరీ, నకిలీ డాక్యుమెంట్లకు ఆధారాలివిగో..

‘‘నా కేసులో విచారణ కమిషన్‌ ముందు ఆర్పీ ఠాకూర్‌ మార్చి 23వ తేదీన హాజరయ్యారు. ఆయనను క్రాస్‌ ఎగ్జామినేషన్‌ సందర్భంగా...ఇజ్రాయెల్‌ నుంచి పరికరాల కొనుగోలు ఆర్డర్‌ రద్దు చేస్తున్నట్లుగా 24.12.2018న ఇచ్చిన ఉత్తర్వులు ఇవ్వాలని అడిగాను. అయితే ఆయన ఇప్పుడు ఆ ఉత్తర్వులు ఎక్కడున్నాయో చూడడం కష్టమని, పీ అండ్‌ ఎల్‌ ఐజీ రవిశంకర్‌ తనకు చెప్పి ఆ ఉత్తర్వులు ఇచ్చి ఉండొచ్చని చెప్పారు. అయితే ఆ తర్వాత మార్చి 27న రవిశంకర్‌ విచారణ కమిషన్‌ ముందు హాజరైనప్పుడు ఆ ఉత్తర్వుల గురించి అడగ్గా..ఫైల్‌లో అలాంటి ఉత్తర్వులేమీ లేవన్నారు. అయితే నాటి డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ నుంచి తనకు ఫోన్‌ ద్వారా ఉత్తర్వు అందిందన్నారు.


ఆ ఫోన్‌ ద్వారా ఉత్తర్వును ప్రింట్‌ తీసి ఇవ్వాలని విచారణ కమిషన్‌ కోరింది. ఆ మేరకు ప్రింట్‌ తీసి ఆ డాక్యుమెంట్‌ను ప్రాసిక్యూషన్‌ ఎగ్జిబిట్‌ నెంబర్‌.76గా సమర్పించారు. అయితే డీజీపీ కార్యాలయం నుంచి హోం శాఖ ముఖ్య కార్యదర్శికి రావాల్సిన ఆ ఉత్తర్వులు నకిలీవి. ఎందుకంటే ఆ ఉత్తర్వుల్లో తేదీ లేదు. అదేవిధంగా ఆ కాపీలను ఇంకెవ్వరికీ పంపినట్లు మార్క్‌ చేసి లేదు. హోంశాఖ ముఖ్య కార్యదర్శిని సదరు ఉత్తర్వుల లేఖ గురించి విచారణ కమిషన్‌ అడగ్గా...అది తమ కార్యాలయంలో దొరకలేదని సమాధానమిచ్చారు. అంటే అసలు ఆ ఉత్తర్వుల లేఖే లేదు. డీజీపీ కార్యాలయం దాన్ని పంపనూలేదు. ఆ తర్వాత పీఅండ్‌ఎల్‌ విభాగం చీఫ్‌ అడ్మినిస్ర్టేటివ్‌ అధికారి సీ గోవిందరాజన్‌ కమిషన్‌ ముందు హాజరైనప్పుడు డీజీపీ ఉత్తర్వుల గురించి ప్రశ్నించగా...దానికి సంబంధించి ఒక ఇ-ఫైల్‌ను క్రియేట్‌ చేసి పంపినట్లు చెప్పారు. అయితే ఆ ఇ-ఫైల్‌ అనేది ఒక నకిలీది. మరోవైపు ఈ డీజీపీ ఉత్తర్వులను, అందులో కాపీ టు అని ఉన్న ఇతర చిరునామాలకు పంపించారా? అని అడగ్గా...ఫ్యాక్స్‌ ద్వారా పంపించానంటూ కొన్ని రసీదులను సమర్పించారు. అవి కూడా నకిలీవే. అసలు డీజీపీ ఉత్తర్వుల్లో...కాపీ టు అదనపు డీజీ నిఘా విభాగం అని ఉన్నా...ఆ కార్యాలయానికి అవి రానే రాలేదు. హోం శాఖ ముఖ్య కార్యదర్శి కార్యాలయానికీ రాలేదు. అసలు లేని ఉత్తర్వులు ఉన్నాయంటూ నకిలీవి సృష్టించారని దీన్నిబట్టే అర్థమవుతోంది’’

Updated Date - 2021-04-11T08:30:34+05:30 IST