AP: సస్పెన్షన్ వేటుపై AB Venkateswara Rao ఏమన్నారంటే...

ABN , First Publish Date - 2022-06-29T17:26:36+05:30 IST

సీనియర్ ఐపీయస్ అధికారి ఏబీవీపై జగన్ ప్రభుత్వం మరోసారి సస్పెన్షన్‌ వేటు వేసింది. దీనిపై ఆయన...

AP: సస్పెన్షన్ వేటుపై AB Venkateswara Rao ఏమన్నారంటే...

విజయవాడ (Vijayawada): సీనియర్ ఐపీయస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (AB Venkateswara Rao)పై జగన్‌ (Jagan) ప్రభుత్వం మరోసారి సస్పెన్షన్‌ (Suspension‌) వేటు వేసింది. దీనిపై స్పందించిన ఆయన బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తనను సస్పెన్షన్ చేసినట్లు మీడియాలో వచ్చిందన్నారు. తనకైతే ఇంకా ఎటువంటి ఆదేశాలు అందలేదన్నారు. సాక్షి ఛానల్‌లో వస్తున్న కధనాలు పూర్తిగా అబద్దమన్నారు. తనపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఆర్డర్‌లో చెప్పారని, మార్చి 2021లో తనపై కేసు పెట్టారని చెబుతున్నారు.. కేసు ట్రైల్ లేకుండా సాక్షిని ఎలా బెదిరిస్తారని ప్రశ్నించారు. 3-1కింద ఇచ్చిన సస్పెన్షన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసిందని, మళ్లీ 3-3కింద ఎలా సస్పెన్షన్ చేస్తారని ఆయన నిలదీశారు. అది చట్ట విరుద్దమన్నారు. తనపై ఛార్జిషీట్ లేదని, తానెందుకు భయపడాలన్నారు. సీఎం జగన్‌పై 12 సీబీఐ కేసుల్లో ఛార్జి షీట్‌లు ఉన్నాయన్నారు. శ్రీలక్ష్మిపైనా కేసులు ఉన్నాయని.. వాళ్లకు వర్తించని రూల్స్ తనకెలా వర్తిస్తాయని ప్రశ్నించారు. ఇది ప్రాథమిక హక్కులకు భంగమని, దీనిపై మళ్లీ తాను న్యాయ పోరాటం చేస్తానని ఏబీవీ స్పష్టం చేశారు.


ఏబీసీ అధికారులు చెప్పినవన్నీ అబద్దాలేనని, అందుకు ఆధారాలు తన వద్ద ఉన్నాయని ఏబీ వెంకటేశ్వరరావు చెప్పారు. రూపాయి అవినీతి జరగని దగ్గర.. అవినీతి కేసు ఏంటని ప్రశ్నించారు. ఇజ్రాయిల్ కంపెనీకి రెండు లేఖలు రాశారని, ఎవ్వరికి ఏ రూపంలోనూ ఒక్క రూపాయి చెల్లించలేదని వాళ్లే చెప్పారని, మరి ఏ ఆధారం ఉందని ఏసీబీ కేసు నమోదు చేశారని నిలదీశారు. కొంతమంది అధికారులు చేసే తప్పులకు ప్రభుత్వం నింద మోయాల్సి వస్తోందన్నారు. కొన్ని శక్తులు,  వ్యక్తులు తనను టార్గెట్ చేశారన్నారు. రాష్ట్రాన్ని తగలబెట్టకుండా ఆనాడు అడ్డుకున్నాను.. కోడి కత్తి ఘటనతో ఘర్షణలు‌ చేయాలని చూస్తే ఆపాను.. అందుకే తనను అన్ని విధాలా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఏబీవీ అన్నారు. 23మంది వైసీపీ ఎమ్మెల్యే లు.. టీడీపీలోకి రావడం వెనుక తనకేం సంబంధమన్నారు. విచారించి..తన ప్రమేయం ఉంటే చర్యలు తీసుకోవచ్చునన్నారు. ఇదే అంశాన్ని చెప్పుకుని ఎంతకాలం ప్రచారం చేస్తారన్నారు. 


ఎఫ్ఐఆర్ పూర్తి లోపభూయిష్టంగా ఉందని ఏబీ వెంటకటేశ్వరరావు అన్నారు. తనపై విచారణలు పూర్తి చేసి త్వరగా ముగించాలన్నారు. ప్రభుత్వ తీరుపై న్యాయ పోరాటం చేస్తానని ఆయన మరోసారి చెప్పారు. డిఫర్మేషన్ వేసేందుకు ఇచ్చిన 12వారాల గడువు దాటి పోయిందని.. ఇప్పుడు పరువు నష్టం కేసు వేసే అంశాన్ని పరిశీలిస్తానన్నారు. పరువునష్టం దావా కేసులో తనపై కుట్రలు చేసే వ్యక్తుల పేర్లు కూడా ఉంటాయని ఏబీ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు.

Updated Date - 2022-06-29T17:26:36+05:30 IST