ఏబీవీకి ఊరట

ABN , First Publish Date - 2020-05-23T08:07:52+05:30 IST

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి, ఏపీ ఇంటెలిజెన్స్‌ మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఊరట లభించింది.

ఏబీవీకి ఊరట

ఆయన సస్పెన్షన్‌ జీవో రద్దు

క్యాట్‌ ఊత్తర్వులూ కొట్టివేత

విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశం


అమరావతి, మే 22 (ఆంధ్రజ్యోతి): సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి, ఏపీ ఇంటెలిజెన్స్‌ మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనను సస్పెండ్‌ చేస్తూ ఫిబ్రవరి 8వ తేదీన జారీ చేసిన ఆదేశాలను న్యాయస్థానం కొట్టివేసింది. ఆయన సస్పెన్షన్‌ను సమర్థిస్తూ... కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ (క్యాట్‌) మార్చి 17వ తేదీన ఇచ్చిన ఆదేశాలనూ రద్దు చేసింది. ఏబీ వెంకటేశ్వరరావును తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, ఆయనకు రావాల్సిన అన్ని ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలని స్పష్టం చేసింది. అధికారులు ఆరోపణలు ఎదుర్కొనేటప్పుడు... వాటిపై విచారణ కోసం సర్వీసు నిబంధనల్లో తగినంత గడువు నిర్దేశించారని, వెంకటేశ్వరరావుపై వచ్చిన ఆరోపణలపై ఆ గడువులోగా విచారణను పూర్తి చేయాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ డీవీఎ్‌సఎస్‌ సోమయాజులు, జస్టిస్‌ కె.లలితతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.


పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంకటేశ్వరరావుపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందని, ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా ఏకపక్షంగా సస్పెండ్‌ చేసిందని తెలిపారు. గత ఏడాది మే 30 నుంచి ఆయనను సస్పెండ్‌ చేసిన రోజు వరకు ఎలాంటి జీతభత్యాలు చెల్లించలేదని తెలిపారు. భద్రతా పరికరాల కొనుగోళ్ల వ్యవహారంలో ఆయన ప్రత్యక్ష ప్రమేయం లేదని వివరించారు. అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరాం వాదనలు వినిపిస్తూ.. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిని సస్పెండ్‌ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు.


ముందే సస్పెండ్‌ చేసి.. ఆ తర్వాత సాకులు

ఏబీ వెంకటేశ్వరరావు విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై గతంలోనే విమర్శలు వెల్లువెత్తాయి. ఏబీ గత  టీడీపీ ప్రభుత్వంలో నిఘా చీఫ్‌గా పనిచేసినప్పుడు ప్రభుత్వానికి దగ్గరగా ఉన్నారన్న భావన ప్రస్తుత సర్కారులో ఉంది. అందుకే వచ్చీరాగానే ఆయనకు పోస్టింగ్‌ ఇవ్వకుండా పక్కనపెట్టింది. జీతభత్యాలు నిలిపివేసింది. చివరకు సస్పెం డ్‌ చేయాలనుకుని అదే పనిచేసింది. సాధారణంగా ఎవరైనా అధికారి తప్పు చేస్తే దానిపై విచారణ జరిపించడం, క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం సహజం.


అయితే ఏబీ విషయంలో ఆయనేదో పొరపాటు చేసినట్లు తేలడం వల్ల సస్పెన్షన్‌ వేటు వేయలేదు. సస్పెండ్‌ చేయాలని ముందుగానే నిర్ణయం తీసుకుని.. ఆ తర్వాత దానికోసం కారణాలో/సాకులో వెతికారన్నది స్పష్టమవుతోందని పలువురి ఆరోపణ. రక్షణ పరికరాల కొనుగోలులో అవకతవకలు జరిగాయని, వాటిని తన కుమారుడి కంపెనీకి కాంట్రాక్టుకు ఇచ్చి తెప్పించారన్నది సర్కారు మోపిన అభియోగం. సస్పెండ్‌ చేసి నెలలు గడుస్తున్నా.. సదరు ఆరోపణలకు ప్రభుత్వం రుజువులు చూపించలేకపోయిందని.. దీనివల్లే హైకోర్టు ఏబీకి అనుకూలంగా తీర్పు వెలువరించిందని పలువురు అంటున్నారు.

Updated Date - 2020-05-23T08:07:52+05:30 IST