Viral: హాట్ టాపిక్‌గా ‘అమ్మమ్మ’ పెళ్లిళ్లు.. మేకప్‌తో ఎంత బురిడీ కొట్టించావ్ తల్లోయ్..!

ABN , First Publish Date - 2022-07-05T19:02:29+05:30 IST

పెళ్లి పేరుతో యువకుల్ని నమ్మించి మోసం చేసిన వాళ్లను చూసుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత డబ్బు, నగలతో పరారైన వాళ్లను గురించి..

Viral: హాట్ టాపిక్‌గా ‘అమ్మమ్మ’ పెళ్లిళ్లు.. మేకప్‌తో ఎంత బురిడీ కొట్టించావ్ తల్లోయ్..!

చెన్నై: పెళ్లి పేరుతో యువకుల్ని నమ్మించి మోసం చేసిన వాళ్లను చూసుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత డబ్బు, నగలతో పరారైన వాళ్లను గురించి కూడా వినుంటారు. కానీ.. ఈవిడ మూడో రకం. భార్యకు విడాకులిచ్చి మరో పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్న వాళ్లను టార్గెట్ చేసుకుని మోసాలకు పాల్పడుతుంటుంది. ఇలా ఇప్పటికి ఇద్దరిని పెళ్లి చేసుకుని వారిని మోసం చేసింది. మూడో వ్యక్తితో పెళ్లి తర్వాత ఈమె మోసాల పుట్ట పగిలింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అవడి సమీపంలోని ముత్తపుడుపేట ప్రాంతంలో ఇంద్రాణి అనే మహిళ నివాసం ఉంటోంది. ఆమె కొడుకు గణేష్ ఒక ప్రైవేట్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. గణేష్ వయసు 30 సంవత్సరాలు. పెళ్లయిన కొన్నేళ్లకు భార్యతో మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్నాడు. గత ఆరేళ్లుగా మళ్లీ పెళ్లి చేసుకునే ఆలోచనలో సంబంధాలు చూస్తున్నాడు.



ఈ క్రమంలో ఒక మ్యారేజ్ బ్రోకర్ ద్వారా 2021లో తిరుపతి సమీపంలోని పుత్తూరు ప్రాంతానికి చెందిన శరణ్య అనే మహిళ గురించి గణేష్‌కు తెలిసింది. ఆమెది పేద కుటుంబమని బ్రోకర్ చెప్పాడు. సరే.. ఆ మహిళ నచ్చితే పెళ్లి చేసుకోవాలని భావించి పెళ్లి చూపులకు వస్తున్నట్లు బ్రోకర్ ద్వారా శరణ్యకు కబురు చేశారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. శరణ్య అనే ఈ మహిళ వయసు 54 సంవత్సరాలు. పెళ్లి చూపులు చూసుకునేందుకు వస్తున్నారని తెలిసి బ్యూటీపార్లర్‌కు వెళ్లి యువతిలా కనిపించేందుకు, 35 ఏళ్ల మహిళలా కనిపించేందుకు మేకప్ చేయించుకుంది. యూత్‌ఫుల్ అపియరెన్స్ కోసం బాగానే మేనేజ్ చేసింది. పెళ్లి చూపుల్లో శరణ్యను చూసిన గణేష్ మహా అయతే తన కంటే ఐదేళ్లు పెద్దదయి ఉంటుందని అనుకున్నాడు. ఆమె వయసు 35 సంవత్సరాలని చెప్పినప్పటికీ ఆ ఫేక్ మేకప్‌కు ఫిదా అయిపోయి శరణ్యను పెళ్లి చేసుకునేందుకు గణేష్ సిద్ధపడ్డాడు.



ఇరు కుటుంబాల సమక్షంలో చెన్నైలోని తిరునిన్రవూర్‌లో గణేష్, శరణ్యల పెళ్లి జరిగింది. ఆమెకు 25 సవర్ల ఆభరణాలు చేయించి, కొంత ఎదురు కట్నం ఇచ్చి మరీ గణేష్ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయిన కొద్దిరోజులకు శరణ్య తన ప్లాన్‌ను యధావిధిగా అమలు చేసింది. ఇంటి బీరువా తాళాలు, నెలనెలా వచ్చే జీతం ఇంద్రాణికి (గణేష్ తల్లి) బదులు తనకు ఇవ్వాలని భర్తతో గొడవ పెట్టుకుంది. అంతటితో ఆగకుండా ఆస్తిని తన పేరును రాయాలని భర్తపై ఒత్తిడి తెచ్చింది. ఆమె ఒత్తిడితో ఆస్తిని రాసేందుకు ఇంద్రాణి, గణేష్ సిద్ధపడ్డారు. ఆస్తి రాసివ్వాలంటే ఆధార్‌తో పాటు కొన్ని డాక్యుమెంట్లు కావాలని అడగటంతో ఈ కిలేడీ నిర్వాకం అప్పుడు బయటపడింది. ఆధార్ కార్డ్ ఇస్తే తన వయసుకు సంబంధించిన అసలు నిజంతో పాటు తన మొదటి భర్త ఎవరో బయటపడుతుంది. అందువల్ల.. తన దగ్గర ఆధార్ గానీ, ఎలాంటి ప్రూఫ్స్ గానీ లేవని శరణ్య చెప్పడంతో గణేష్‌కు అనుమానమొచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేశాడు.



ఆమె సొంతూరికి వెళ్లి నిజానిజాలు ఆరా తీయగా.. గణేష్‌కు దిమ్మతిరిగే విషయం తెలిసింది. అప్పటికే ఆమెకు రెండు పెళ్లిళ్లు జరిగాయని తెలిసి ఈ మూడో భర్త అవాక్కయ్యాడు. శరణ్య అసలు పేరు సుకన్య. ఏపీకి చెందిన రవి అనే వ్యక్తితో ఆమెకు మొదట వివాహం జరిగింది. ఇద్దరు కూతుర్లు కూడా ఉన్నారు. ఆ ఇద్దరు కూతుర్లకు కూడా పెళ్లిళ్లయి పిల్లలున్నారు. ఆ తర్వాత భర్తతో గొడవలు రావడంతో తిరునిన్రవూర్‌కు వచ్చి బీఎస్‌ఎన్‌ఎల్ రిటైర్డ్ ఉద్యోగి అయిన తన తల్లితో కలిసి ఉండేది. ఆదాయం లేకపోవడంతో సుకన్య, ఆమె తల్లి శాంతమ్మల్ కలిసి స్థానికంగా ఉన్న కొందరు పెళ్లిళ్ల బ్రోకర్ల సాయంతో పెళ్లి పేరుతో మోసాలు చేయడం మొదలుపెట్టారు. గణేష్ కంటే ముందు జోల్లార్‌పేటకు చెందిన సుబ్రమణ్యన్ అనే రైల్వే ఫుడ్ సప్లయ్ కాంట్రాక్టర్‌ను సుకన్య పెళ్లి చేసుకుంది. అతనితో 11 ఏళ్లు కాపురం చేసింది. ఆ తర్వాత అతనికి హ్యాండిచ్చి గణేష్‌ను పెళ్లి చేసుకుంది. పెళ్లి పేరుతో ఇలాంటి మోసాలకు పాల్పడిన సుకన్యపై అవడి మహిళా పోలీస్ స్టేషన్‌లో గణేష్ తల్లి ఇంద్రాణి ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు సుకన్యను అరెస్ట్ చేశారు.

Updated Date - 2022-07-05T19:02:29+05:30 IST