సర్కారు ఆస్తులు.. నిర్లక్ష్యం పాలు!

ABN , First Publish Date - 2020-12-03T05:07:19+05:30 IST

సర్కారు ఆస్తులు.. నిర్లక్ష్యం పాలు!

సర్కారు ఆస్తులు.. నిర్లక్ష్యం పాలు!
నిరుపయోగంగా గృహ నిర్మాణశాఖ కార్యాలయ భవనం

  • ఆమనగల్లులో నిరుపయోగంగా ప్రభుత్వ భవనాలు
  • వినియోగించక.. శిథిలావస్థకు..
  • తాత్కాలిక మరమ్మతులతో గోదాములు వినియోగంలోకి..
  • పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు

ఆమనగల్లు : సర్కార్‌ ఆస్తులు నిర్లక్ష్యం పాలవుతున్నాయి. ఆమనగల్లులో లక్షలాది రూపాయలతో నిర్మించిన భవనాలను వినియోగించక పోవడంతో ఎందుకూ పనికిరాకుండా పోతున్నాయి. స్వల్ప మరమ్మతులు చేస్తే పలు గోదాములు, భవనాలు వినియోగంలోకి వచ్చే అవకాశం ఉన్నా ఆదిశగా ప్రజాప్రతినిధులు, అధికారులెవరూ చొరవ తీసుకోవడం లేదు. అనేక కార్యాలయాలకు అనువైన భవనాలు లేవు. వీటిని వినియోగంలోకి తెస్తే భవనాలు లేని కార్యాలయాలకు ఉపయోగపడుతాయి. ఆమనగల్లు మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో గోదాములు, భవనాలు, క్వార్టర్లు నిరుపయోగంగా మారి శిథిలావస్థలోకి చేరుకుంటున్నాయి. అప్పట్లో ఆయా భవనాలు పంచాయతీ సమితికి, మండల పరిషత్‌కు వినియోగించేవారు. కాలక్రమేణా నిర్వహణలేక ప్రస్తుతం నిరుపయోగంగా మారి   పిచ్చి మొక్కలతో నిండిపోయాయి. పంచాయతీ సమితి కాలంలో వ్యవసాయ పరికరాలు, కార్యాలయ సామగ్రి, రైతులకు ఉపయోగపడేలా రెండుచోట్ల మూడు గోదాములను నిర్మించారు. రెండు దశాబ్దాలుగా వాటిని వినియోగించక నిరుపయోగంగా మారాయి. గోదాముల పైభాగం రేకులు పలుచోట్ల దెబ్బతిన్నాయి. గోడలకు నెర్రెలు పడ్డాయి. వాటికి తాత్కాలిక మరమ్మతులు చేస్తే వినియోగంలోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం  ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు చేస్తుంది.  అలా కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిల్వ చేయడానికి ఈ గోదాములను వినియోగించవచ్చు.


శిథిలావస్థలో సమితి క్వార్టర్స్‌


దశాబ్దాల క్రితం పంచాయతీ సమితి సిబ్బంది కోసం నిర్మించిన నివాస గృహాలు సైతం నిర్వహణలేక శిథిల స్థితికి చేరాయి. వ్యవసాయ శాఖ కార్యాలయ వెనుక భాగంలో లక్షలు వెచ్చించి నిర్మించిన గృహ నిర్మాణ శాఖ కార్యాలయ భవనం పిచ్చి మొక్కలతో నిండిపోయింది. ప్రభుత్వం గృహనిర్మాణ సంస్థను తీసివేయడంతో ఉద్యోగులు ఇతర శాఖల్లోకి వెళ్లడంతో భవనం కొన్నేళ్లుగా వృథాగా పడి మూగజీవాలకు ఆవాసంగా మారింది. 


వృథాగా ప్రభుత్వ భవనాలు


ఆమనగల్లులోని మండల పరిషత్‌ కార్యాలయ ప్రధాన ద్వారం పక్కన గెస్ట్‌హౌస్‌ భవనాన్ని మరమ్మతులు చేసినా వినియోగించక వదిలేశారు. ఆమనగల్లులో ఎక్కడా అతిథి గృహం లేదు. దీన్ని వినియోగంలోకి తెస్తే అతిథులు వచ్చినప్పుడు వినియోగించుకోవడానికి అవకాశం ఉంది. విద్యుత్‌ కార్యాలయ సమీపంలో ఇరిగేషన్‌ శాఖ కార్యాలయ భవనం కూడా వృథాగా పడి ఉంది. దీన్ని దశాబ్దం క్రితం లక్షలు వెచ్చించి మరమ్మతు చేసి మళ్లీ వినియోగించకుండానే వదిలేశారు. అంగడి బజారులో మాంసం విక్రయ కేంద్రం, చేనేత సంఘ భవనాలదీ ఇదే పరిస్థితి. కొన్నిచోట్ల భవనాల వస్తువులు అపహరణకు గురయ్యాయి. నిరుపయోగంగా ఉన్న వాటిని అలాగే వదిలేస్తే స్థలాలు కూడా అన్యాక్రాంతం అయ్యే ప్రమాదం లేకపోలేదు.

Updated Date - 2020-12-03T05:07:19+05:30 IST