అల్లకల్లోలం

ABN , First Publish Date - 2022-05-12T06:00:09+05:30 IST

అల్లకల్లోలం

అల్లకల్లోలం
పాలకాయితిప్ప వద్ద పడిపోయిన డాల్ఫిన్‌ బొమ్మలు

రెండు జిల్లాలపై అసాని తుఫాను ఎఫెక్ట్‌

బలమైన ఈదురుగాలులు, చిన్నపాటి వర్షాలు

మచిలీపట్నానికి దగ్గరగా వచ్చి గమనం మార్పు

ఎక్కడికక్కడ పునరావాస కేంద్రాల ఏర్పాటు

తీరప్రాంత గ్రామాల్లో అధికారుల పర్యటన

ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సంసిద్ధం

నేడు బలహీనపడే అవకాశం : వాతావరణ శాఖ


తుఫాను తీవ్ర ప్రకంపనలే సృష్టించింది. మచిలీపట్నానికి దగ్గరగా వచ్చి, తీరం దాటకుండా, అటూ ఇటూ తిరుగుతూ దోబూచులాడింది. ఫలితంగా రెండు జిల్లాల్లో భారీ ఈదురుగాలులు, వర్షాలు కురిశాయి. తీర ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. అధికారులు అప్రమత్తమై పునరావాస కేంద్రాలను సిద్ధం చేశారు. అయితే, తుఫాను తీవ్రత తగ్గిందని, గురువారం ఉదయానికి బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలపడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 


ఆంధ్రజ్యోతి- మచిలీపట్నం : అసాని తుఫాను జిల్లాను వణికించింది. తీవ్ర తుఫానుగా మారి బుధవారం సాయంత్రానికి మచిలీపట్నానికి 30 కిలోమీటర్ల దగ్గరగా వచ్చింది. నరసాపురానికి 50 కిలోమీటర్లు, కాకినాడకు 120 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 270 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమై ఉంది. తుఫాను  మచిలీపట్నం దగ్గర వరకు వచ్చినప్పటికీ తీరం తాకకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. అయితే, తుఫాను తన గమనాన్ని మార్చుకుని నరసాపురం మీదుగా తీరం వెంబడి  పయనిస్తోందని, అయినా సరిగ్గా అంచనా వేయలేకపోతున్నామని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది గురువారం ఉదయానికి మరింత బలహీనపడి వాయుగుండంగా మారుతుందని పేర్కొన్నారు. 

తీరప్రాంతాలపై దృష్టి

తుఫాను మచిలీపట్నం వద్ద తీరాన్ని తాకుతుందనే హెచ్చరికలతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.  కలెక్టర్‌ రంజిత్‌ బాషా, జేసీ మహేష్‌కుమార్‌ రావిరాల, డీఆర్వో ఎం.వెంకటేశ్వర్లు, ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌, ఇతర పోలీస్‌ అధికారులు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది అప్రమత్తమయ్యారు. తీర ప్రాంతాల్లోని ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లను అప్రమత్తం చేశారు. మాజీమంత్రి పేర్ని నాని, మచిలీపట్నం తహసీల్దార్‌ డి.సునీల్‌బాబు మంగళవారం రాత్రి మచిలీపట్నం మండలంలోని కోన, పోలాటితిప్ప, పల్లెతుమ్మలపాలెం గ్రామాల్లో పర్యటించారు. విపత్కర పరిస్థితులు ఎదురైతే ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం..  సీఎంతో వీడియో కాన్ఫరెన్స్‌లో కృష్ణా జిల్లా కలెక్టర్‌ రంజిత్‌ బాషా

తుఫాను పరిస్థితులపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో కలెక్టరేట్‌ నుంచి అధికారులు పాల్గొన్నారు. తుఫాను మచిలీపట్నం వద్ద తీరాన్ని తాకి విపత్కర పరిస్థితులు ఏర్పడితే  రెండు గంటల్లోగా పరిస్థితిని చక్కదిద్దేందుకు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్‌ సీఎంకు వివరించారు. బలమైన ఈదురుగాలుల కారణంగా అరటి, బొప్పాయి తోటలు ధ్వంసమయ్యాయని చెప్పారు. భారీ వర్షాలు కురిస్తే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. తుఫాను రక్షిత భవనాల్లో పునరావాస శిబిరాలను ఏర్పాటు చేశామని చెప్పారు. తక్షణ, రక్షణ చర్యలు, పునరావాస కార్యక్రమాలకు రూ.2.50 కోట్లకు అనుమతులు వచ్చాయని తెలిపారు. కాగా, కలెక్టర్‌, ఎస్పీ బుధవారం మచిలీపట్నంలోని రాడార్‌ కేంద్రానికి వెళ్లారు. అక్కడి వాతావరణ శాఖ అధికారులను తుఫాను వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మంగినపూడి బీచ్‌లో పర్యటించారు. తాళ్లపాలెం తదితర గ్రామాలకు వెళ్లి పునరావాస కేంద్రాల కోసం ఎంపిక చేసిన కమ్యూనిటీ భవనాలను పరిశీలించారు. 

సముద్రంలో భయానక దృశ్యాలు 

తుఫాను ప్రభావంతో మంగినపూడి బీచ్‌ వద్ద సముద్రపు అలలను తాకినట్టుగా బుధవారం నల్లటి భారీ మబ్బులు ఆవహించాయి. తీరప్రాంతమంతా భయానకంగా కనిపించింది. మునుపెన్నడూ లేని విధంగా మబ్బులు కమ్మాయని స్థానిక మత్స్యకారులు తెలిపారు. తుఫాను ప్రభావంతో జిల్లావ్యాప్తంగా రెండు రోజులుగా బలమైన గాలులు, ఓ మోస్తరు వర్షం కురుస్తూనే ఉంది. కృష్ణాజిల్లాలో సగటు వర్షపాతం 9.8 మిల్లీమీటర్లుగా నమోదు కాగా, ఉయ్యూరులో అత్యధికంగా 19.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఎన్టీఆర్‌ జిల్లాలో 6.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 

విజయవాడ కూల్‌ కూల్‌..

తుఫాను ప్రభావానికి విజయవాడ నగరం తడిసి ముద్దయింది. పలు ప్రాంతాలు కొద్దిపాటి వర్షానికే జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో మురుగుకాల్వలు పొంగిపొర్లాయి. మొగల్రాజపురం, పటమట, భవానీపురం, చిట్టినగర్‌, ఏలూరు రోడ్డు, ఎంజీ రోడ్డు ప్రాంతాల్లో వర్షపు నీరు రహదారులపై నిలిచిపోయింది. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ఈ వర్షానికి చిరువ్యాపారాలు బాగా దెబ్బతిన్నాయి. పలు రైళ్లు, విమానాలు రద్దు కావడంతో ముందే ప్రయాణాల షెడ్యూల్‌ను ఖరారు చేసుకున్న వారు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకున్నారు. మరికొంతమంది ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. మరో రెండురోజుల పాటు ఈ చల్లటి వాతావరణం కొనసాగే అవకాశముంది.

పంటలను కాపాడుకోండి.. ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ దిల్లీరావు

తుపాను ప్రభావం కారణంగా రైతులు తమ పంటలను కాపాడుకునేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ దిల్లీరావు విజ్ఞప్తి చేశారు. మత్స్యకారులు, సాధారణ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని విజ్ఞప్తి చేశారు.

ఎన్టీఆర్‌ కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌

విజయవాడలోని కలెక్టరేట్‌లో 24 గంటలూ పనిచేసేలా కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా, సాయం అవసరమైనా 99103 13920 నెంబర్‌కు ఫోన్‌ చేయాలని సూచించారు.








Read more