AAP vs BJP: రోహింగ్యాలకు ఫ్లాట్లు, సెక్యూరిటీ ప్రతిపాదనపై మాటల యుద్ధం

ABN , First Publish Date - 2022-08-18T01:59:01+05:30 IST

రోహింగ్యా అక్రమ వలసదారుల (Rohingya illegal Refugees) వ్యవహారం బుధవారంనాడు మాటలయుద్ధానికి ..

AAP vs BJP: రోహింగ్యాలకు ఫ్లాట్లు, సెక్యూరిటీ ప్రతిపాదనపై మాటల యుద్ధం

న్యూఢిల్లీ: రోహింగ్యా అక్రమ వలసదారుల (Rohingya illegal Refugees) వ్యవహారం బుధవారంనాడు మాటలయుద్ధానికి దారితీసింది. ఆమ్ ఆద్మీ పార్టీ సర్కార్‌కు, కేంద్రానికి మధ్య వాడివేడిగా మాటల యుద్ధం జరిగింది. కేంద్ర హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రి హర్దీప్ సింగ్ పురి (Hardeep Singh Puri) చేసిన వ్యాఖ్యలతో ఈ వివాదం మొదలైంది. రోహింగ్యా వలసదారులను ఢిల్లీ శివార్లలోని బక్కర్‌వాలా ప్రాంతంలోని ఈడబ్ల్యూఎస్ (Economically weaker sections) ఫ్లాట్స్‌కు షిఫ్ట్ చేస్తామని, మౌలిక వసతులు, భద్రత కల్పిస్తామని హర్దీప్ సింగ్ పురి ప్రకటించారు. అయితే, అలాంటి ఆదేశాలేవీ ఇవ్వలేదని కేంద్ర హోం శాఖ ఆ తర్వాత వివరణ ఇచ్చింది. రోహింగ్యాలను డిటెన్షన్ సెంటర్లలోనే ఉంచాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించినట్టు పేర్కొంది.


తొలుత హర్దీప్ సింగ్ పురి తన ప్రకటనలో దేశ శరణార్థుల విధానాన్ని విమర్శించే వారికి కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం నిరాశపరస్తుందని వ్యాఖ్యానించారు. ఆ వెంటనే ఆప్ వరుస ట్వీట్లలో కేంద్రంపై విమర్శలు గుప్పించింది. తామోదో సాధించామని గొప్పగా చెప్పుకునే ప్రయత్నం కేంద్రం చేస్తోందని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా చురకలు వేశారు. ఢిల్లీలో రోహింగ్యాలకు శాశ్వత నివాసం ఇచ్చే ప్రయత్నాన్ని కేంద్రం చాలా గోప్యంగా సాగిస్తోందనే విషయం పచ్చి నిజమని విమర్శించారు. ''కేంద్ర ప్రభుత్వం తరఫున లెఫ్టినెంట్ గవర్నర్ (L-G), అధికారులు, పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. సంబంధిత ఫైల్‌ను ముఖ్యమంత్రికి, ఢిల్లీ హోం మంత్రికి చూపించకుండా ఎల్-జీ ఆమోదానికి పంపారు. రోహింగ్యా అక్రమ వలసదారులను ఢిల్లీలో స్థిరపడేలా చేయాలన్న కుట్రను ఢిల్లీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకు సాగనీయదని ఆయన స్పష్టం చేశారు.


ఢిల్లీలో రోహింగ్యాలకు ఫ్లాట్లు, భద్రత కల్పించాలని జరుగుతున్న కుట్ర దేశ పౌరల భద్రతకు ముప్పని ఆప్ మరో నేత సౌరభ్ భరద్వాజ్ అన్నారు. ఫారినర్స్ రిజిస్ట్రేషన్ ఆఫీస్, ఢిల్లీ పోలీసులతో కలిసి చీఫ్ సెక్రటరీ నరేష్ కుమార్ తీసుకున్న నిర్ణయం ఇదని ఆయన ఆరోపించారు. న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేష్ (ఎండీఎంసీ) హర్దీప్ పురి చేతి కింద ఉండటం, ఎల్‌జీ ఆదేశాలకు అనుగుణంగా చీఫ్ సెక్రటరీ పనిచేస్తుండటం ద్వారా ఈ మొత్తం కుట్రను కేంద్రం నడిపిస్తోందని ఆయన విమర్శించారు. రోహింగ్యాలను ఇక్కడే స్థిరపడేలా చేసి వారిని ఓటు బ్యాంకుగా మార్చుకోవాలనేది కేంద్రం పన్నాగమని అన్నారు.


బీజేపీ కౌంటర్...

కాగా, ఆప్ విమర్శలను బీజేపీ ప్రతినిధి గౌరవ్ భాటియా తిప్పికొట్టారు. ఆప్ బుజ్జగింపు రాజకీయాలను ప్రజలు నమ్మరని,  కేంద్రానికి చాలా స్పష్టమైన పాలసీ ఉందని అన్నారు. జాతీయ భద్రత విషయంలో రాజీ లేదని, అక్రమ వలసదారులను వెనక్కి పంపాలని మన చట్టాలు చాలా స్పష్టంగా చెబుతున్నాయని తెలిపారు. 

Updated Date - 2022-08-18T01:59:01+05:30 IST