అమిత్ షా ఇంటికి బుల్డోజర్లు పంపితే అల్లర్లు ఆగిపోతాయి: ఆప్

ABN , First Publish Date - 2022-04-20T23:18:31+05:30 IST

ఉన్నపళంగా అక్రమ కట్టడాలు బీజేపీకి ఇప్పుడెలా కనిపించాయని, ఇందులో బీజేపీ నేతల ఇళ్లు ఎందుకు లేవంటూ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బుధవారం ప్రశ్నించారు. బీజేపీ ఇప్పుడు రోహింగ్యాల గురించి మాట్లాడుతోందని, మరి 8 ఏళ్ల నుంచి బంగ్లాదేశీ రోహింగ్యాలు ఎక్కువగా..

అమిత్ షా ఇంటికి బుల్డోజర్లు పంపితే అల్లర్లు ఆగిపోతాయి: ఆప్

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే బుల్డోజర్ దేశ రాజధానిని చేరుకుంది. జహంగీర్‌పూర్ అల్లర్ల అనంతరం దేశ రాజధానిలో బుల్డోజర్ చర్చనీయాంశమైంది. దీనికి తోడు తొందరలోనే ఢిల్లీ మున్సిపాలిటీకి ఎన్నికలు ఉన్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీలు ఒకరికొకరు బుల్డోజర్లతో ఢీ కొట్టుకుంటున్నాయి. ఆప్ అయితే అదే బుల్డోజర్‌తో బీజేపీని నిలువరించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. పార్టీ నేతలు, సోషల్ మీడియా విభాగం.. బుల్డోజర్ అనే అంశాన్ని లేవనెత్తుతూ బీజేపీపై విరుచుకుపడుతున్నారు. ఈ దేశంలో అల్లర్లు ఆగిపోవాలంటే బుల్డోజర్లు బీజేపీ కేంద్ర కార్యాలయం, అమిత్ షా ఇంటికి పంపాలని దుమ్మెత్తి పోస్తున్నారు.


ఆప్ అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో ఈ విషయమై పోలింగ్ సైతం పెట్టారు. ‘‘బీజేపీ కేంద్ర కార్యాలయంపైకి బుల్డోజర్ పంపించాలా?’’ అంటూ నెటిజెన్లకు పోల్ పెట్టారు. దీనికి ఆప్ మద్దతుదారులతో పాటు బీజేపీ వ్యతిరేకులు పెద్ద ఎత్తున స్పందిస్తూ బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇంటికి కూడా బుల్డోజర్లు పంపాలని, అలా చేస్తే ఈ దేశంలో అల్లర్లు ఆగిపోతాయని ఆప్ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. పార్టీ సీనియర్ నేత మనిష్ సిసోడియా, రాఘవ్ చద్దా, అతిశిలు సోషల్ మీడియా, మీడియా ద్వారా బీజేపీపై దాడికి దిగుతున్నారు.


ఢిల్లీలో అక్రమ కట్టడాలను బుల్డోజర్లతో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కూల్చేస్తోంది. ఢిల్లీ మున్సిపాలిటీలో బీజేపీ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. దీంతో.. ఉన్నపళంగా అక్రమ కట్టడాలు బీజేపీకి ఇప్పుడెలా కనిపించాయని, ఇందులో బీజేపీ నేతల ఇళ్లు ఎందుకు లేవంటూ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బుధవారం ప్రశ్నించారు. బీజేపీ ఇప్పుడు రోహింగ్యాల గురించి మాట్లాడుతోందని, మరి 8 ఏళ్ల నుంచి బంగ్లాదేశీ రోహింగ్యాలు ఎక్కువగా దేశంలో ఎందుకు స్థిరపడ్డారో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ డేటా బయటకు వెల్లడించాని సిసోడియా డిమాండ్ చేశారు.


సుప్రీం కోర్టు స్టే ఇచ్చినప్పటికీ జహంగీర్‌పూర్ అల్లర్ల అనంతరం అనుమానితుల ఇళ్లపై బుల్డోజర్లను ప్రయోగించడంపై ఆప్ నేత రాఘవ్ చద్దా ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో శాంతిభద్రతలను కాపాడాలంటే భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయం మీదకు బుల్డోజర్లను పంపాలని ఆయన విమర్శించారు. బుల్డోజర్‌ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా అదుపు చేస్తున్నారని.. ఆయన ఇంటి మీదకే బుల్డోజర్లను పంపితే దేశంలో అల్లర్లు ఆగిపోతాయని రాఘవ్ అన్నారు.

Updated Date - 2022-04-20T23:18:31+05:30 IST