బ్రిటిష్ ఎంపీతో బీజేపీ నేతల ఫోటోలను బయటపెట్టిన ఆప్

ABN , First Publish Date - 2022-04-18T23:48:18+05:30 IST

బ్రిటిష్ ఎంపీ తన్మన్‌జిత్ ధేసీని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కలవడంపై బీజేపీ చేసిన వ్యాఖ్యలపై ..

బ్రిటిష్ ఎంపీతో బీజేపీ నేతల ఫోటోలను బయటపెట్టిన ఆప్

న్యూఢిల్లీ: బ్రిటిష్ ఎంపీ తన్మన్‌జిత్ ధేసీని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కలవడంపై బీజేపీ చేసిన వ్యాఖ్యలపై ఆమ్ ఆద్మీ పార్టీ సోమవారంనాడు ఎదురుదాడికి దిగింది. గతంలో ఆ పార్టీ (బీజేపీ) నేతలు థేసిని కలిసినప్పుడు ఆ ప్రశ్నలు ఎందుకు లేవనెత్తలేదని నిలదీసింది. ధేసిని అప్పట్లో కలిసిన బీజేపీ నేతల ఫోటోలను కూడా ఆప్ పంజాబ్ యూనిట్ నేతలు విడుదల చేశారు. బీజేపీ నేతలు విజయ సంప్లా, సోమ్ ప్రకాశ్, హర్దీప్ సింగ్ పురి సహా పలువురు నేతలు గతంలో ధేశిని కలిసినప్పుడు ఈ ప్రశ్నలు ఎందుకు లేవనెత్తలేదని ఆప్ పంజాబ్ నేత, ప్రతినిధి మల్వీందర్ సింగ్ కాంగ్ ప్రశ్నించారు. బీజేపీ ద్వంద్వ ప్రమాణాలకు ఇది అద్దం పడుతోందని అన్నారు.


దీనికి ముందు, ధేసిని భగవంత్ మాన్ ఎందుకు కలిశారో చెప్పాలని బీజేపీ నేత, ఆర్మీ మాజీ చీఫ్ జేజే సింగ్ ఆదివారంనాడు నిలదీశారు. ధేసి వెలిబుచ్చిన వేర్పాటువాద అనుకూల, భారత వ్యతిరేక అభిప్రాయాలతో పంజాబ్ ప్రభుత్వం ఏకీభవిస్తోందా అని ప్రశ్నించారు. దీనిపై మాన్ ప్రభుత్వం వివరణ ఇవ్వాలన్నారు.


జమ్మూకశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని భారత ప్రభుత్వం రద్దు చేయడాన్ని లేబర్ పార్టీ ఎంపీ అయిన ధేశి గతంలో విమర్శించారు. గత వారంలో ఆయన భగవంత్ మాన్‌తో పాటు, ఆప్ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దాను కలిసారు. ఎన్ఆర్ఐలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఇదే విషయాన్ని ఓ ట్వీట్‌లో ధేశి నిర్ధారించారు.


Updated Date - 2022-04-18T23:48:18+05:30 IST