ఆప్‌లో కొత్త ఉత్సాహం... బెంగళూరు నగర పాలక సంస్థపై కన్ను...

ABN , First Publish Date - 2022-04-23T22:55:12+05:30 IST

పంజాబ్ శాసన సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆమ్ ఆద్మీ

ఆప్‌లో కొత్త ఉత్సాహం... బెంగళూరు నగర పాలక సంస్థపై కన్ను...

బెంగళూరు : పంజాబ్ శాసన సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నూతనోత్తేజంతో కర్ణాటకపై దృష్టి సారించింది. బెంగళూరు నగర పాలక సంస్థ ఎన్నికల్లో సత్తా చాటడం ద్వారా వచ్చే ఏడాది మే నెలలో జరిగే శాసన సభ ఎన్నికల్లో గట్టి పోటీదారుగా నిలిచేందుకు వ్యూహ రచన చేస్తోంది. 


ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం బెంగళూరులో రైతుల సభలో మాట్లాడారు. ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో తాము ప్రభుత్వాలను ఏర్పాటు చేశామని, ఇక తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న మూడో రాష్ట్రం కర్ణాటకేనని చెప్పారు. 


పంజాబ్ శాసన సభ ఎన్నికల్లో లభించిన విజయంతో కర్ణాటకలోని ఆప్ నేతలు, కార్యకర్తలు నూతనోత్తేజంతో దూసుకెళ్తున్నారు. బృహత్ బెంగళూరు మహానగర పాలికే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలవడం ద్వారా శాసన సభ ఎన్నికల్లో తమ బలాన్ని మరింత పెంచుకోవాలనుకుంటున్నారు. 


2014 లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలో ఆప్ అభ్యర్థులు పోటీ చేశారు. కానీ ఊహించిన ఫలితాలను పొందలేకపోయారు. 2015లో జరిగిన నగర పాలక సంస్థ ఎన్నికల్లో ఆప్ పోటీ చేయలేదు. 2018లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో 29 స్థానాల్లో పోటీ చేసి, ఘోర పరాజయాన్ని చవి చూసింది. ఈ ఎన్నికల్లో 0.06 శాతం ఓట్లను మాత్రమే సాధించగలిగింది. 


తాజాగా ఆప్ కర్ణాటక ఇన్‌ఛార్జిగా ఢిల్లీ నేత దిలీప్ పాండేను ఆ పార్టీ నియమించింది. ప్రముఖ నేతలను పార్టీలోకి ఆకర్షించేందుకు ప్రయత్నాలను ప్రారంభించింది. మాజీ ఐపీఎస్ అధికారి భాస్కర్ రావు ఇటీవల ఆ పార్టీలో చేరారు. 


Updated Date - 2022-04-23T22:55:12+05:30 IST