Lokayukta: కర్ణాటకలో లోకాయుక్త రీబర్త్ వేడుకలు జరిపిన ఆప్

ABN , First Publish Date - 2022-08-12T23:24:54+05:30 IST

కర్ణాటకలో అవినీతి నిరోధక విభాగాన్ని రద్దు చేస్తూ, లోకాయుక్త పటిష్టతకు చర్యలు..

Lokayukta: కర్ణాటకలో లోకాయుక్త రీబర్త్ వేడుకలు జరిపిన ఆప్

బెంగళూరు: కర్ణాటకలో అవినీతి నిరోధక విభాగాన్ని (ACB) రద్దు చేస్తూ, లోకాయుక్త (Lokayukta) పటిష్టతకు చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పుపై ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సంబరాలు చేసుకుంది. బెంగళూరులోని లోకాయుక్త కార్యాలయం ముందు ఆప్ నేతలు శుక్రవారంనాడు కేక్ కట్ చేసి వేడుక జరిపారు. 2016లో సిద్ధరామయ్య కాంగ్రెస్ ప్రభుత్వం ఏసీబీని ఏర్పాటు చేసింది. రాష్ట్ర హైకోర్టు తాజా తీర్పులో రాష్ట్ర ఏసీబీని రద్దు చేస్తూ ఏసీబీ వద్ద పెండింగ్‌లో ఉన్న కేసులన్నీ లోకాయుక్తకు బదిలీ చేయాలని ఆదేశాలిచ్చింది. 


ఆప్ రాష్ట్ర కార్యదర్శి పృధ్వీ రెడ్డి శుక్రవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ, 2010-2011 మధ్య సామాజిక కార్యకర్తలు 'బ్రష్ఠాచార్ సకు' అనే ప్రచారం ప్రారంభించారని, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ ఉద్యమంలో పాల్గొన్నారని చెప్పారు. ఆ తర్వాత అది 'ఇండియా ఎగైనెస్ట్ కరప్షన్' ఉద్యమంగా మారి, ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పాటుకు దారితీసిందని అన్నారు. అప్పటి నుంచి అవినీతి బాధితులు ఆప్‌కు సపోర్ట్ చేయడం మొదలైందని తెలిపారు. ఏసీబీ వద్ద చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులపై సాధ్యమైనంత త్వరగా లోకాయుక్త విచారణ జరపాలని ఆయన కోరారు. క్లీన్ చిట్ ఇస్తూ ఏసీబీ క్లోజ్ చేసిన కేసులను కూడా రీఓపెన్ చేయాలన్నారు. శక్తివంతులైన కొందరు పలు కేసుల్లో శిక్షల నుంచి తప్పించుకున్నారని, ఆ విషయం అందరికీ తెలుసునని అన్నారు. లోకాయుక్త పటిష్టతకు పూర్తి అధికారాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.


కాగా, లోకాయుక్త అధికారాలను తాము అధికారంలోకి వచ్చిన 24 గంటల్లోనే పునరుద్ధరిస్తామని మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప కూడా గతంలో వాగ్దానం చేశారని, అయితే ఆ తర్వాత మూడేళ్లు పదవిలో ఉన్నా ఆ మాట నిలబెట్టుకోలేదని ప్రచార కమిటీ కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు ఎం.చంద్రు అన్నారు. జేడీఎస్ కూడా చేసిందేమీ లేదన్నారు. హైకోర్టు తీర్పు ఆ మూడు పార్టీలకు చెంపపెట్టు అయిందని చెప్పారు.


సిద్ధరామయ్య స్పందన ఇదే..

ఏసీబీని రద్దు చేస్తూ లోకాయుక్తకు కేసులు బదలీ చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య ఆచితూచి స్పందించారు. ఏసీబీని రద్దు చేస్తూ ఇచ్చిన హైకోర్టు తీర్పును తాను ఇంకా చూడలేదని చెప్పారు. తీర్పు చదివిన తర్వాతే స్పందిస్తానని చెప్పారు. ఏసీబీ ఒక్క కర్ణాటకాలోనే కాకుండా అన్ని రాష్ట్రాల్లోనూ ఉందన్నారు.

Updated Date - 2022-08-12T23:24:54+05:30 IST