ఆగని వాన

ABN , First Publish Date - 2022-06-29T05:29:06+05:30 IST

మన్యంలో నాలుగు రోజులుగా ముసురు వాతావరణం కొనసాగుతున్నది.

ఆగని వాన
పాడేరు మెయిన్‌రోడ్డుపై వర్షం

- నాలుగు రోజులుగా జిల్లాలో వర్షాలు

- రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయం


పాడేరు, జూన్‌ 28(ఆంధ్రజ్యోతి): మన్యంలో నాలుగు రోజులుగా ముసురు వాతావరణం కొనసాగుతున్నది. మంగళవారం ఏజెన్సీలోని పలు మండలాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. జిల్లా కేంద్రంలో మంగళవారం ఉదయం భారీ వర్షం కురిసింది. సోమవారం తరహాలోనే ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు తెరిపి ఇచ్చి ఎండ కాసింది. ఆ తరువాత ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. ముసురును తలపించేలా జల్లులతో కూడిన వర్షం కొనసాగుతున్నది. తాజా వర్షానికి రోడ్లన్నీ చిత్తడిగా మారాయి. వర్షానికి జన జీవనానికి అంతరాయం ఏర్పడింది.  

అనంతగిరి: అనంతగిరి మండల పరిధిలో పలు చోట్ల మంగళవారం భారీ వర్షం కురిసింది. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు మంగళవారం కూడా కొనసాగాయి. మండలంలో అనంతగిరి, బొర్రా, గుమ్మకోట, కాశీపట్నం పరిసర ప్రాంతాల్లో మధ్యాహ్నం ఒంటిగంట నుంచి మూడున్నర గంటల వరకు వర్షం కురిసింది. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో మండలంలోని పెదబిడ్డ, ఎగువశోభ, అనంతగిరి, కొండిభ పరిసర గ్రామాల్లో గిరిజనులు పొలం పనులు ప్రారంభించారు.  

ముంచంగిపుట్టు:  మండలంలో మంగళవారం ఉదయం  నుంచి సాయంత్రం వరకు వర్షం కురిసింది. లక్ష్మీపురం, బూసిపుట్టు, రంగబయలు, బరడ తదితర పంచాయతీల్లోని పలు గ్రామాల్లో ప్రవహిస్తున్న మత్స్యగెడ్డ పాయల్లోకి వరదనీరు వచ్చి చేరుతోంది. 

సీలేరు : జీకేవీధి మండలం సీలేరులో మంగళవారం ఉదయం ఒక మోస్తరు వర్షం కురిసింది. 

అరకు రూరల్‌: మండలంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం  ఒంటి గంట నుంచి గంటన్నర పాటు ఏకధాటిగా కురిసింది. రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.


Updated Date - 2022-06-29T05:29:06+05:30 IST