Maharashtra politics: వచ్చారొచ్చారు..ద్రోహులు వచ్చారు..

ABN , First Publish Date - 2022-08-17T23:04:24+05:30 IST

ఏక్‌నాథ్ షిండే-దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికార బదలాయింపు జరిగిన తర్వాత తొలి అసెంబ్లీ..

Maharashtra politics: వచ్చారొచ్చారు..ద్రోహులు వచ్చారు..

ముంబై: ఏక్‌నాథ్ షిండే-దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికార బదలాయింపు జరిగిన తర్వాత తొలి అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమైంది. బుధవారం అసెంబ్లీ సమావేశాలకు వచ్చిన షిండే వర్గానికి శివసేన నేతలు, విపక్ష  పార్టీల నేతల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. విధాన్ భవన్‌కు షిండే వర్గం ఎమ్మెల్యేలు వస్తుండగా, అసెంబ్లీ వెలుపల మెట్ల వద్ద శివసేన సహా విపక్ష నేతలు వారికి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. 'వచ్చారొచ్చారు...విద్రోహులు వచ్చారు' అంటూ నినాదాలిచ్చారు. ఆదిత్య థాకరే కూడా ఈ నిరసనల్లో పాల్గొన్నారు.


ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన వారికి వ్యతిరేకంగా తాము నిలబడతామని ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆదిత్య థాకరే అన్నారు. ''ఇది విద్రోహ ప్రభుత్వం, కుప్పకూలక తప్పదు. ఇది రాజ్యాంగేతర ప్రభుత్వం, చట్టవిరుద్ధ ప్రభుత్వం, నిజాయితీ లోపించిన వారి ప్రభుత్వం'' అని ఆయన విమర్శలు గుప్పించారు. తమతో కలిసి మంత్రులుగా ఉన్న వారు అక్కడికి వెళ్లి మంత్రి పదవులు తెచ్చుకున్నారని, కొందరికి తక్కువ గతంలో కంటే తక్కువ ప్రాధాన్యం ఉన్న శాఖలు వచ్చాయని చెప్పారు. షిండేకు విధేయులుగా వెళ్లిన మొదటి గ్రూపునకు ఒరిగిందేమీ లేదని, విధేయతకు చోటు లేదనడానికి ఇదే నిదర్శనమని అన్నారు. ఇండిపెండెంట్లు, మహిళలకు కేబినెట్‌లో చోటే కల్పించలేదని ఆయన విమర్శించారు. 

Updated Date - 2022-08-17T23:04:24+05:30 IST