ఆది సాయి కుమార్, నువేక్ష హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘అతిథిదేవోభవ’. పొలిమెర నాగేవ్వర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని శ్రీనివాస సినీ క్రియేషన్స్‌పై రాజబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జనవరి 7న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర హీరో ఆది సాయికుమార్ బుధవారం మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు.
ఆయన మాట్లాడుతూ..‘‘ఎగ్జిక్యూషన్ పార్ట్‌ని దర్శకుడు చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఈ చిత్రంపై ఎంతో నమ్మకంగా ఉన్నా. పాటలు కూడా సినిమాలో బాగా వర్కవుట్ అయ్యాయి. శేఖర్ చంద్ర గారి పాటలు మరియు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా వచ్చాయి. భవిష్యత్తులో మళ్లీ ఆయనతో కలిసి పనిచేయాలనుకుంటున్నాను. స్క్రిప్ట్‌లో అంతర్లీన భావోద్వేగ అంశం ఉంది. అది అందరినీ కంటతడి పెట్టిస్తుంది. నా నటన అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను. నా రాబోయే సినిమాలు డిఫరెంట్ జోనర్లకు చెందినవి. సినిమాలు ప్రేక్షకులకు నచ్చుతాయనే నమ్మకం ఉంటేనే ఒప్పుకుంటున్నాను. నా సినిమాల్లో కొన్ని విడుదల ఆలస్యం కారణంగా నష్టపోయాయి. రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్న సమయంలో ఇప్పుడీ సినిమా వస్తుంది. వచ్చే శనివారం రెండో శనివారం కావడంతో పాటు, సంక్రాంతి సెలవులు కూడా తోడవుతాయి కాబట్టి.. వారాంతంలో కలెక్షన్లు పెరుగుతాయని ఆశిస్తున్నాను. తప్పకుండా ఈ చిత్రం అందరికీ నచ్చే చిత్రం అవుతుందని ఆశిస్తున్నాను.
కొత్త సినిమాలు
ప్రస్తుతం చేస్తున్న ‘తీస్ మార్ ఖాన్’ ఫ్యామిలీ ఎమోషనల్ ప్లాట్ పాయింట్‌తో కూడిన పూర్తి కమర్షియల్ సినిమా. పాయల్ రాజ్‌పుత్ కథానాయికగా నటించింది. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. వీఎఫ్ఎక్స్తో కూడిన ‘అమరన్ ఇన్ ది సిటీ'’ అనే ఫ్రాంచైజీ సినిమా చేస్తున్నాను. అవికా గోర్ కూడా నటించిన కంటెంట్ ఆధారిత సినిమా అది. ‘బ్లాక్’ ఒక థ్రిల్లర్. ఈ చిత్రం షూటింగ్ కూడా పూర్తయింది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ‘సిఎస్ఐ సనాతన్’ షూటింగ్ 10 రోజుల్లో పూర్తవుతుంది. సంక్రాంతికి కొత్త సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అది రొమాంటిక్ సినిమా. ‘జంగిల్’ తెలుగు-తమిళ చిత్రం, దీని అవుట్‌పుట్ అద్భుతంగా వచ్చింది..’’ అని తెలిపారు.