రేషన్‌కు.. మెలిక!

ABN , First Publish Date - 2021-08-18T05:30:00+05:30 IST

రేషన్‌ లబ్ధిదారులు ఈకేవైసీ చేయించుకోవాలంటూ గత రెండు, మూడు రోజుల నుంచి వలంటీర్లు తమ పరిధిలోని నివాసాలకు వెళ్లి నోటీసులు జారీ చేస్తున్నారు.

రేషన్‌కు.. మెలిక!
రేపల్లె ఇండియన్‌ బ్యాంక్‌ వద్ద ఆధార్‌ కార్డు లింకేజి కోసం బారులు తీరిన ప్రజలు

నెలాఖరు లోపు ఈకేవైసీ చేయించుకోకుంటే రేషన్‌ రాదట!

జిల్లాలో మొత్తంగా ఈ-కైవైసీ జరిగిన శాతం 16.53

మిగిలినవారికి సరకుల నిలిపివేతకు ప్రభుత్వం ఆదేశాలు..

ఈకేవైసీ కోసం లబ్ధిదారుల అవస్థలు

పిల్లల వేలిముద్రల అప్‌డేట్‌ కోసం ఆధార్‌ సెంటర్ల వద్దకు..

తెల్లవారుజామునుంచే పడిగాపులు 

సంక్షేమ పథకాల్లో కోతపెట్టేందుకేనని పలువురి ఆరోపణ


జిల్లావ్యాప్తంగా లక్షల సంఖ్యలో రేషన్‌కార్డుదారుల మెడపై ఈ-కేవైసీ కత్తి వేలాడుతోంది. ఎవరైతే ఈ-కేవైసీ చేయించుకోలేదో వారికి సెప్టెంబరు నెల నుంచే రేషన్‌ సరుకుల పంపిణీని నిలిపేయాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ-కేవైసీతో తమ కార్డులుంటాయో, పోతాయోనన్న భయం ప్రజల్లో నెలకొంది. గతంలో చిన్నపిల్లల ఆధార్‌ నమోదు చేసేటప్పుడు తల్లిదండ్రుల వేలిముద్రలు ఎన్‌రోల్‌ చేశారు. ఇప్పుడు వారు తమ పిల్లలను తీసుకొని ఆధార్‌ కేంద్రాలకు వెళ్లి వేలిముద్రల అప్‌డేట్‌ చేయించాలి. ఇందుకోసం ఆధార్‌ సెంటర్లకు క్యూ కడుతున్నారు. అక్కడ గంటల కొద్దీ పడిగాపులు కాస్తున్నారు. 

 


ఈ-కేవైసీ పెండింగ్‌ ఉన్న మొత్తం కార్డులు 5,39,578

డౌన్‌ లోడింగ్‌ చేసిన కార్డుల సంఖ్య 5,39,578

ఇప్పటివరకు ఈ-కేవైసీ పూర్తి అయిన సభ్యులు89,178

బ్యాలెన్స్‌ మొత్తం 4,50,400

మొత్తంగా ఈ-కైవైసీ జరిగిన శాతం 16.53


గుంటూరు, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): రేషన్‌ లబ్ధిదారులు ఈకేవైసీ చేయించుకోవాలంటూ గత రెండు, మూడు రోజుల నుంచి వలంటీర్లు తమ పరిధిలోని నివాసాలకు వెళ్లి నోటీసులు జారీ చేస్తున్నారు. మీ కుటుంబంలో ఫలానా వ్యక్తి/ సభ్యులు ఈ-కేవైసీ నమోదు కాలేదని, తక్షణమే చేయించుకోకపోతే సరుకుల పంపిణీ నిలిచిపోతుందని చెబుతున్నారు. దీంతో ఎక్కడ తమ కార్డులను తొలగిస్తారోనన్న భయం ప్రజల్లో నెలకొంది. గతంలోనే తాము ఈ-కేవైసీ చేయించుకొన్నామని, అయినప్పటికీ మళ్లీ నోటీసులు ఇస్తున్నారని కొంతమంది వాపోతున్నారు. సంక్షేమ పథకాల్లో కోత పెట్టేందుకు ఈ విధంగా ఈ-కేవైసీ పేరుతో దఫదఫాలుగా ఇబ్బంది పెడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. 


ఏటా ఇదే తంతు..

ఆధార్‌ డేటాతో ఏఈపీడీఎస్‌ని ఎప్పుడో అనుసంధానం చేశారు. అయినప్పటికీ ఈ-కేవైసీ అంటూ ఏటా ఒకసారి ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అవుతున్నాయి. గతంలో ఎవరివైనా వేలిముద్రలు పడకపోతే కనుపాపలను స్కానింగ్‌ చేసి రేషన్‌ ఇచ్చేవారు. కనుపాపలు కూడా స్కానింగ్‌ జరగకపోతే వీఆర్‌వో ద్వారా వేలిముద్ర వేయించే ఇబ్బంది లేకుండా చూసేవారు. వ్యవసాయం, గ్యారేజ్‌లు, భవన నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికుల చేతి వేలిముద్రలు అరిగిపోతుంటాయి. ఈ కారణంగా వారి వేలిముద్రలు ఈ-పోస్‌ యంత్రంపై అధీకరణ కావు. వీటికి ప్రత్యామ్నాయాలు గురించి ఆలోచన చేయకుండా ఈ-కేవైసీ పేరుతో రేషన్‌షాపులు, ఆధార్‌ కేంద్రాల చుట్టూ తిప్పుతుండడంపై విమర్శలు వ్యక్తమౌతున్నాయి. 


మొరాయిస్తున్న సర్వర్‌

ఇప్పుడు ఈ-కేవైసీ నమోదు చేసుకోవాలంటే ఈ నెల 31వ తేదీ లోపు వలంటీర్‌ని సంప్రదించాలి. లేకుంటే సమీపంలోని చౌకధరల దుకాణానికి వెళ్లి ఈ-పోస్‌ యంత్రంపై ఈ-కేవైసీ చేయాల్సిందిగా డీలర్‌ని కోరాలి. అయితే ఇదే సమయంలో డీలర్లు కేంద్ర ప్రభుత్వ ఉచిత బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. దీంతో సర్వర్‌ మొరాయిస్తోంది. పోస్టాఫీసుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. 


ఆధార్‌ కేంద్రాల వద్దకు..

ఎవరివైతే వేలిముద్రలు పడటం లేదో వారు ఫ్యూజన్‌ ఫింగర్‌(హైయాక్యురసీ డివైస్‌) ఆప్షన్‌ని వినియోగించి ఆధార్‌ ఈ-కేవైసీ చేయించుకోవాలి. ఈ ఆప్షన్‌ కేవలం రేషన్‌ షాపుల్లో ఉన్న పరికరాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. అది కూడా పనిచేయకపోతే మళ్లీ ఆధార్‌ నమోదు కేంద్రానికి వెళ్లి వేలిముద్రలు తిరిగి నమోదు చేయించాలి. దీంతో ఆధార్‌ కేంద్రాల వద్ద రద్దీ పెరిగింది. చిన్నపిల్లల ఆధార్‌ నమోదు చేసేటప్పుడు తల్లిదండ్రుల వేలిముద్రలు ఎన్‌రోల్‌ చేశారు. ఇప్పుడు వారు తమ పిల్లలను తీసుకొని ఆధార్‌ కేంద్రాలకు వెళ్లి వేలిముద్రల అప్‌డేట్‌ చేయించాలి. ఇది జరగడానికి కొంత సమయం పడుతుంది. ఆ తర్వాత ఈ-కేవైసీకి వెళ్లాలి. వీరికి మాత్రం సెప్టెంబరు నెలాఖరు వరకు సమయం ఇచ్చారు. ఎవరైతే ఈ-కేవైసీ చేయించుకోలేకపోయారో వారిని బోగస్‌ సభ్యులుగా గుర్తిస్తామని అధికారులు చెబుతుండటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతోంది. ఓ వైపు ఆరు అంచెల మూల్యాంకనం, మరోవైపు ఈ-కేవైసీతో తమ కార్డులుంటాయో, పోతాయోనన్న భయం ప్రజల్లో నెలకొంది. 


జిల్లాలో ఇదీ పరిస్థితి.. 

గతంలో మీ-సేవ కేంద్రాల్లో ఉన్న ఆధార్‌ నమోదు కేంద్రాలను తొలగించడంతో ఒత్తిడి అంతా బ్యాంకుల్లోని సెంటర్లపై పడింది.  బుధవారం రేపల్లె పట్టణంలోని పలు బ్యాంకుల్లోని ఆధార్‌ సెంటర్ల వద్ద ఉదయం నుంచే పెద్దసంఖ్యలో మహిళలు, పురుషులు చిన్నారులతో కలిసి బారులు తీరారు. సత్తెనపల్లి పట్టణంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ప్రజలు పట్టణంలోని ఆధార్‌ నమోదు కేంద్రాలకు క్యూ కడుతున్నారు. ప్రతి కేంద్రంలో రోజుకు 60 మందికి మాత్రమే అప్‌డేషన్‌ చేయటానికి వీలవుతుందని అధికారులు చెబుతున్నారు. ఈలోపు సర్వర్‌ సమస్య వస్తే మరిన్ని ఇబ్బందులు ప్రజలకు తప్పటం లేదు. ఆధార్‌ కార్డులలో మార్పులు, చేర్పులు చేయించుకునేందుకు పిడుగురాళ్ల పట్టణంతోపాటు మాచవరం మండలానికి చెందిన వందలాది మంది  ఆధార్‌ కేంద్రాల వద్ద పడిగాపులు పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల్లోని సచివాలయాల్లో ఆధార్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ అక్కడి సిబ్బందికి తగిన శిక్షణ, మరికొన్ని పరికరాలు ఇవ్వకపోవటంతో ఇక్కట్లు తప్పడం లేదు.   


 

Updated Date - 2021-08-18T05:30:00+05:30 IST