అదానీ అడిగారని!

ABN , First Publish Date - 2022-02-12T07:10:39+05:30 IST

మధురవాడ సర్వే నంబర్‌ 409లో అదానీ సంస్థకు 130 ఎకరాలు కేటాయించారు. ఇందులో డేటా సెంటర్‌, ఐటీ పార్క్‌, స్కిల్‌ డెవల్‌పమెంట్‌ యూనివర్సిటీతోపాటు రిక్రియేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తామని సదరు సంస్థ తెలిపింది.....

అదానీ అడిగారని!

2600 కోట్ల భూమి 130 కోట్లకే సొంతం

అదానీ అడిగారని... కృష్ణపట్నం పోర్టును కట్టబెట్టేశారు.

అదానీ అడిగారని... గంగవరం పోర్టును చుట్టచుట్టి ఇచ్చారు.

మళ్లీ అదానీ అడిగారని... 

నిబంధనలను తోసిరాజని విశాఖలో 130 ఎకరాల 

భూమిని పూర్తిగా అప్పగించేస్తున్నారు!

 విశాఖలో 130 ఎకరాలు పూర్తిగా ధారాదత్తం

 అదానీ అడగ్గానే లీజుడీడ్‌ స్థానంలో సేల్‌డీడ్‌

 సంవత్సరం కిందటే భూకేటాయింపు 

 పనులు మొదలుపెట్టకుండా పేచీ

 బ్యాంకు రుణం కోసం సేల్‌డీడ్‌ ఇవ్వాలని ఒత్తిడి

 సరేనంటూ తల ఊపిన జగన్‌ సర్కారు


ప్రభుత్వ నిబంధనలు ఎవరికైనా ఒకటే! కానీ... అదానీకి మాత్రం వేరు. ఆంధ్రప్రదేశ్‌లో అదానీ సంస్థ ఏది కోరినా సరే... రాష్ట్ర ప్రభుత్వం జీహుజూర్‌ అని చేసేస్తోంది. అడగడమే ఆలస్యం అన్నట్లుగా అడిగినవన్నీ ఇచ్చేస్తోంది. కృష్ణపట్నం, గంగవరం పోర్టులను అదానీ సంస్థ ఇప్పటికే సొంతం చేసేసుకుంది. ఇప్పుడు... విశాఖలోని మధురవాడలో 130 ఎకరాల భూమిని నిబంధనలకు విరుద్ధంగా అదానీకి పూర్తిగా ‘సేల్‌డీడ్‌’తో కట్టబెట్టేందుకు సర్కారు సిద్ధమైంది. 


(విశాఖపట్నం - ఆంధ్రజ్యోతి)

మధురవాడ సర్వే నంబర్‌ 409లో అదానీ సంస్థకు 130 ఎకరాలు కేటాయించారు. ఇందులో డేటా సెంటర్‌, ఐటీ పార్క్‌, స్కిల్‌ డెవల్‌పమెంట్‌ యూనివర్సిటీతోపాటు రిక్రియేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తామని సదరు సంస్థ తెలిపింది. రూ.14,634 కోట్లు పెట్టుబడి పెడతామని, సుమారు 25వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చింది. భారీ పెట్టుబడి... అంతే భారీగా ఉపాధి కల్పనకు ముందుకు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఎకరా కోటి రూపాయలకే ఇచ్చింది. వాస్తవానికి అక్కడ ఇప్పుడు ఎకరా ధర రూ.20 కోట్ల పైనే ఉంది. అంటే దాదాపు రూ.2,600 కోట్ల విలువైన భూమిని రూ.130 కోట్లకే ఇచ్చారు. ‘పరిశ్రమలు రావాలంటే, పెట్టుబడులు కావాలంటే ఈ మాత్రం రాయితీలు ఇవ్వాల్సిందే’ అని సర్దిచెప్పుకోవచ్చు. కానీ... ఈ కథ మరో మలుపు తిరిగింది. పరిశ్రమలకు ఏపీఐఐసీ ద్వారానే భూములు కేటాయించడం ఆనవాయితీ. అక్కడున్న పరిస్థితులు, వచ్చే పెట్టుబడి, కల్పించే ఉద్యోగాల సంఖ్యను బట్టి తక్కువ ధరకే భూములు కేటాయిస్తూ వస్తున్నారు. సదరు సంస్థకు భూమిని రిజిస్టర్‌ చేయించేవారు. కానీ... ప్రభుత్వం దగ్గర భూములు తీసుకోవడం, ఏళ్ల తరబడి పరిశ్రమలు పెట్టకుండా, కొన్నేళ్లకు అవే భూములను ఎక్కువ ధరకు అమ్ముకోవడం వంటి ‘దుర్వినియోగం కేసులు’ ఎక్కువ కావడంతో ఏపీఐఐసీ నిబంధనలను మార్చింది. నిర్దేశిత ధర చెల్లించినా సరే... భూములకు సేల్‌డీడ్‌ కాకుండా, లీజుడీడ్‌ మాత్రమే ఇస్తోంది.


33 ఏళ్లు లేదా... 99 సంవత్సరాలు లీజుకు ఇస్తోంది. యాజమాన్య హక్కులు మాత్రం ఇవ్వడంలేదు. అయితే... ఒప్పందం ప్రకారం పరిశ్రమను పూర్తిస్థాయిలో స్థాపించి, ఉద్యోగాలు ఇచ్చిన అతి కొద్ది సంస్థలకు మాత్రం దీని నుంచి మినహాయింపు ఇచ్చారు. అది కూడా... పరిశ్రమ ఏర్పాటు చేసిన పదేళ్ల తర్వాతే  యాజమాన్య హక్కులు దఖలు పరుస్తున్నారు. ఇదీ ఇప్పుడున్న పద్ధతి. ఇవే నిబంధనలు అదానీకి కూడా వర్తించాలి. ప్రభుత్వం తొలుత ఈ నిబంధనల ప్రకారమే అదానీకి భూమి కేటాయించింది. 130 ఎకరాలను రూ.130 కోట్లకు ఇచ్చారు.


బ్యాంకు రుణం కోసం పేచీ...

అదానీ రూ.130 కోట్లు చెల్లించడంతో... ఏపీఐఐసీ ఆ 130 ఎకరాలకు లీజు డీడ్‌ రాసింది. ఇక... అదానీ సంస్థ ఆ భూమిలో డేటా సెంటర్‌, ఐటీ పార్క్‌, స్కిల్‌ డెవల్‌పమెంట్‌ యూనివర్సిటీ, రిక్రియేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలి. కానీ... అక్కడే అదానీ సంస్థ మెలిక పెట్టింది. ‘‘సొంతంగా అన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టలేం. లీజ్‌డీడ్‌పైన బ్యాంకులు రుణాలు ఇవ్వడంలేదు. అందుకే... మొత్తం భూమిని మాకు రాసిచ్చేయండి. సేల్‌డీడ్‌ రాయండి’’ అంటూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచింది. పనులు చేపట్టకుండా తాత్సారం చేస్తోంది. ఇక్కడి ప్రాజెక్టుకు స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ ఏర్పాటు చేసి... ‘వైజాగ్‌ టెక్‌ పార్క్‌ లిమిటెడ్‌’ అని పేరు మార్చేసింది. ఇకపై ఆ పేరుతోనే ప్రాజెక్టు కొనసాగుతుందని స్పష్టం చేసింది. బ్యాంకు రుణం కోసం లీజ్‌ డీడ్‌ సరిపోతుందని, అన్ని కంపెనీలకు అలాగే ఇస్తున్నామని ఏపీఐఐసీ చెప్పినా అదానీ వినిపించుకో లేదు. ‘‘లీజు డీడ్‌ పెడితే తక్కువ రుణం ఇచ్చి ఎక్కువ వడ్డీ వసూలు చేస్తారు. అదే సేల్‌డీడ్‌ అయితే... తక్కువ వడ్డీతో ఎక్కువ రుణం వస్తుంది. మాకు సేల్‌డీడ్‌ కావాల్సిందే’’ అని ఒత్తిడి చేస్తోంది. ఇప్పటికే భూమి కేటాయించి ఏడాది దాటింది. ఒప్పందం ప్రకారం మరో రెండేళ్లలో అక్కడ కార్యకలాపాలు ప్రారంభించాలి. అయినా సరే... అదానీ ఎంతమాత్రం వెనక్కి తగ్గలేదు. మరి... అదానీ అంతటి వారు అడిగారు కదా... అని రాష్ట్ర ప్రభుత్వమే ‘తగ్గింది’! నిబంధనలకు ఒప్పుకోవని తెలిసీ... 130 ఎకరాలను అదానీ సంస్థ పేరిట రిజిస్ట్రేషన్‌ చేసి ఇచ్చేందుకు అంగీకరించినట్లు తెలిసింది.   దీనిపై కొద్దిరోజుల క్రితం జీవో కూడా విడుదలైనట్లు విశ్వసనీయ సమాచారం. దీనిపై ఏపీఐఐసీ అధికారులను ప్రశ్నించగా... ‘సేల్‌ డీడ్‌ కోసం అదానీ సంస్థ దరఖాస్తు చేసుకున్న మాట వాస్తవమే! దీనిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి’’ అని తెలిపారు.


Updated Date - 2022-02-12T07:10:39+05:30 IST