ఆధార్‌ కష్టాలు

ABN , First Publish Date - 2021-10-17T06:07:18+05:30 IST

ప్రజలను ఆధార్‌ కష్టాలు వెంటాడుతున్నాయి. చిన్నపిల్లల నుంచి ముసలివాళ్ల వరకూ ఆధార్‌ విషయంలో బాధితులుగానే ఉంటున్నారు.

ఆధార్‌ కష్టాలు
లాలాచెరువు యూనియన్‌ బ్యాంకు వద్ద ఆధార్‌ నమోదు కేంద్రం

  • రెండు, మూడు నెలలపాటు టోకెన్లు లేవంటూ బోర్డులు
  • ఆందోళన చెందుతున్న ప్రజలు

రాజమహేంద్రవరం అర్బన్‌, అక్టోబరు 16: ప్రజలను ఆధార్‌ కష్టాలు వెంటాడుతున్నాయి. చిన్నపిల్లల నుంచి ముసలివాళ్ల వరకూ ఆధార్‌ విషయంలో బాధితులుగానే ఉంటున్నారు. వేలిముద్రలు పడలేదని, ఈకేవైసీ కాలేదని, సాధికారిత సర్వేలో నమోదు కాలేదని.. ఇలా అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రేషన్‌కార్డులోని ఒక కుటుంబ సభ్యుడికి ఆధార్‌ ఈకేవైసీ కాలేదని అక్టోబరు నెలలో మొత్తం రేషన్‌ కట్‌ చేస్తున్నారనే ఆరోపణలు ఆధార్‌ సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. దీనికితోడు ఆధార్‌ నమోదు కేంద్రాల్లో పూర్తిస్థాయిలో సేవలు అందకపోవడం మరిన్ని సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. రాజమహేంద్రవరం సిటీలో ఆధార్‌కార్డుల్లో కుటుంబ సభ్యుల మా ర్పులు, చేర్పులు, ఫోన్‌ నెంబరు లింకేజీ, ఈకేవైసీ చేయించుకోవడం వంటివి ప్రజలకు కష్టతరంగా మారింది. రోజంతా ఆధార్‌కేంద్రాల వద్ద పడిగాపులు పడుతున్నా కొద్దిమందికి మాత్ర మే సేవలు అందుతున్నాయి. కొన్ని ఆధార్‌ కేంద్రాల వద్ద రెం డు నెలలకు సరిపడా టోకెన్లు ఇచ్చేశా మంటూ బోర్డులు పెట్టేశారు. లాలాచెరువు యూనియన్‌ బ్యాంకు ఆధార్‌ సేవా కేంద్రం వద్ద డిసెంబరు 14వ తేదీ వరకూ టోకెన్లు అయిపోయాయంటూ బోర్డు పెట్టారు. మరికొన్ని ఆధార్‌  సేవా కేంద్రాల్లో సంక్రాంతి తర్వాత కనిపించండని  నిర్వాహకులు చెబుతుండడం గమనార్హం. దీంతో అత్యవసరమై ఆధార్‌కార్డులో పేర్లు, ఫోన్‌ నెంబర్లు లింక్‌, ఇతరత్రా నమోదు, మార్పులు చేసుకోవాలనుకునేవారు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మీ సేవా కేంద్రాల్లో ఆధార్‌ సేవలను ప్రభుత్వం పూర్తిగా నిలిపివేసింది. సచివాలయాల్లోనూ ఆధార్‌ సేవలు అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం కొన్ని ఎంపిక చేసిన బ్యాంకులు, ప్రధాన పోస్టాఫీసుల్లో మాత్రమే ఆధార్‌ సేవా కేంద్రాలు నిర్వహిస్తున్నారు. దీంతో పెద్ద సంఖ్యలో ప్రజలు ఆధార్‌ సమస్యలతో సతమతమవుతున్నారు. ప్రభుత్వం నుంచి ప్రజలకు లభించే వివిధ పథకాలు, పింఛన్లు, రేషన్‌ వంటివాటికి ఆధార్‌ లింకు తప్పనిసరి కావడం, ఈకేవైసీ పూర్తి చేసుకోవాల్సి రావడంతో కొద్దిరోజులుగా ప్రజలు పెద్ద సంఖ్యలో ఆధార్‌కేంద్రాలకు పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా రేషన్‌కార్డుల్లోని చిన్నారులకు ఆధార్‌ ఈకేవైసీ చేయలేదనే సాకుతో అక్టోబరు నెల రేషన్‌ నిలిపివేశారు. దీంతో తల్లిదండ్రులు అన్ని పనులు మానుకుని ఆధార్‌ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం కనిపించడంలేదు. ఆధార్‌ ఇబ్బందులు లేవంటూ ప్రభుత్వం పదే పదే చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఆధార్‌ కష్టాలు తప్పడంలేదని ప్రజలు వాపోతున్నారు.

Updated Date - 2021-10-17T06:07:18+05:30 IST