‘ఆధార్’... ఉల్లంఘనలకు పాల్పడితే...

ABN , First Publish Date - 2022-02-10T00:52:56+05:30 IST

‘ఆధార్ కార్డ్’... ప్రతీ పౌరునికీ తప్పనిసరిగా ఉండాల్సిన కార్డు ఇది. పాన్‌కార్డు, పాస్‌పోర్ట్, రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్‌లకన్నా అధిక ప్రాముఖ్యతను కలిగిన కార్డు ఇది.

‘ఆధార్’... ఉల్లంఘనలకు పాల్పడితే...

* రూ. 10 వేలు-రూ. కోటి వరకు జరిమానా.. 

* మూడేళ్ల జైలు శిక్ష కూడా...

హైదరాబాద్ : ‘ఆధార్ కార్డ్’... ప్రతీ పౌరునికీ తప్పనిసరిగా ఉండాల్సిన కార్డు ఇది. పాన్‌కార్డు, పాస్‌పోర్ట్, రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్‌లకన్నా అధిక ప్రాముఖ్యతను కలిగిన కార్డు ఇది. ఆధార్ ఉంటేనే... దేశ పౌరునిగా ‘గుర్తింపు’ ఉన్నట్లే. అయితే... ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఆధార్‌ కార్డుకు సంబంధించి... కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఆధార్ ఉల్లంఘనలకు పాల్పడితే యూఐడీఏఐకి భారీ జరిమానా విధించే అధికారం ఉంటుంది. 


గతేడాది నవంబరులో కేంద్ర ప్రభుత్వం యూఐడీఏఐకి కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ప్రకారం... యూఐడీఏఐ ఆధార్ చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడానికి న్యాయనిర్ణేత అధికారులను నియమించుకోవచ్చు. వీళ్లు తప్పు చేస్తే జరిమానా విధిస్తారు. అంటే ఎట్టిపరిస్థితుల్లోనూ... తప్పుడు వివరాలు చోటుచేసుకోకుండా జాగ్రత్తపడాలి. లేదంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. 


రూ. కోటి వరకు జరిమానా, మూడేళ్లు జైలు శిక్ష... 

యూఐడీఏఐ ప్రజలకు ఆధార్ కార్డు ద్వారా పలు రకాల సర్వీసులు పొందే అవకాశం కల్పిస్తోంది. యూఐడీఏఐనే ఆధార్ కార్డును జారీ చేస్తుంది. ఆధార్ కార్డు ద్వారా పలు రకాల సేవలను పొందొచ్చు. పాన్ కార్డు, ఓటర్ కార్డు మాదిరి కాదు. అందుకే ఆధార్ చాలా ముఖ్యమైనది. అదేసమయంలో ఎవరైనా ఆధార్ కార్డును తప్పుగా ఉపయోగిస్తే మాత్రం కఠినమైన శిక్షలు అనుభవించాల్సి వస్తుంది.


న్యాయనిర్ణేత అధికారులు ఇచ్చిన తీర్పు విషయంలో అభ్యంతరాలుంటే సదరు సంస్థలు టెలికాం వివాదాల పరిష్కారం, లేదా... అప్పీలేట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించవచ్చు. ఈ నిబంధనలను తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ఆధార్, ఇతర శాసనాల(సవరణ) బిల్లు 2019కి ఆమోదముద్ర వేసింది. ఈ క్రమంలో... ఈ చట్టాలను అమలు చేయడానికి, అవసరమైన చర్యలు తీసుకోవడానికి రెగ్యులేటర్‌తో సమానమైన అధికారాలు లభించాయి. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల యూజర్ల డేటకు మరింత భద్రత చేకూరుతుంది. 


అంతేకాకుండా తప్పుడు డెమొగ్రాఫిక్, బయోమెట్రిక్ వివరాలు అందించడం కూడా ఆధార్ చట్టాలను ఉల్లంఘించడమే అవుతుంది. ఇలాంటి తప్పులకు పాల్పడినపక్షంలో... నేరం చేసినట్లే లెక్క. అటువంటి సందర్భాల్లో మూడు సంవత్సరాల జైలు శిక్ష, రూ. పది వేల వరకు జరిమానాను ఎదుర్కోవలసి వస్తుంది. అందువల్ల ఆధార్ విషయంలో ఎలాంటి మోసాలకు పాల్పడకుండా ఉండటం చాలా మంచిది.

Updated Date - 2022-02-10T00:52:56+05:30 IST