ఆధార్ తికమక!

ABN , First Publish Date - 2022-06-02T06:44:18+05:30 IST

హోటళ్ళు, సినిమాహాళ్ళు తదితర నియంత్రణల్లేని చోట్లలో మీ ఆధార్ కార్డు ఫోటో కాపీలు ఇవ్వకండి, దుర్వినియోగం జరిగే ప్రమాదం ఉంది అంటూ ఆధార్ ప్రాంతీయ కార్యాలయం ఇటీవల చేసిన హెచ్చరిక కంటే...

ఆధార్ తికమక!

హోటళ్ళు, సినిమాహాళ్ళు తదితర నియంత్రణల్లేని చోట్లలో మీ ఆధార్ కార్డు ఫోటో కాపీలు ఇవ్వకండి, దుర్వినియోగం జరిగే ప్రమాదం ఉంది అంటూ ఆధార్ ప్రాంతీయ కార్యాలయం ఇటీవల చేసిన హెచ్చరిక కంటే, కేంద్రప్రభుత్వం ఆ ప్రకటనను ఆదరాబాదరాగా ఉపసంహరించుకోవడం మరింత ఆశ్చర్యం కలిగిస్తున్నది. ఆధార్ వివరాలు అందించే విషయంలో కాస్తంత ఆచితూచి వ్యవహరించమని సంబంధిత సంస్థ హెచ్చరించడం సముచితం, ప్రజాశ్రేయస్సు దృష్ట్యా అవసరం. యూఐడీఏఐ బెంగుళూరు ప్రాంతీయ కార్యాలయం ఈ పనిచేసినప్పుడు ఈ మాట ఎప్పుడో చెప్పాలి కదా అంటూ అనేకులు వెనువెంటనే విరుచుకుపడటమూ సహజమే. పప్పూ ఉప్పూ సహా ప్రతీదానినీ ఆధార్‌తో ముడివేసి, అది లేనిదే బతుకుగడవని పరిస్థితిని సృష్టించిన నేపథ్యంలో, దుర్వినియోగం గురించి ఇంత తాపీగా చెబుతారేమిటని జనం ఆగ్రహించడంలో తప్పేమీ లేదు. ఇంతలోనే, యూఐడీఏఐ ప్రకటన అపార్థాలకు దారితీసే అవకాశం ఉన్నందున దానిని తక్షణమే ఉపసంహరించుకుంటున్నట్టు దీని మాతృసంస్థ అయిన ఐటీ మంత్రిత్వశాఖ ప్రకటించింది. అంతటితో ఆగకుండా, ఆధార్ వినియోగంలో పౌరులు పరిస్థితులను బట్టి సాధారణ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని కూడా అన్నది. ప్రమాదం సుమా అని అంతగట్టిగా హెచ్చరించిన వెనువెంటనే మాటమార్చేయడం, సవరణలూ వివరణలూ కూడా తేలికగా ఉండటం ఆశ్చర్యం కలిగించకమానవు. 


ఆధార్ కార్యాలయం ఇచ్చిన మార్గదర్శకాల్లో మంచి అంశాలున్నాయి. యూఐడీఏఐ నుంచి యూజర్ లైసెన్సు పొందిన సంస్థలకు మాత్రమే ఆధార్ వివరాలను వినియోగించే అధికారం ఉంటుందని అది మరోమారు స్పష్టంచేస్తోంది. ఈ తరహా లైసెన్సులేని హోటళ్ళు, సినిమాహాళ్ళ వంటి సంస్థలకు ప్రజలనుంచి ఆధార్ కాపీలు సేకరించే అధికారం లేదనీ, ఆ పనిచేస్తే అది నేరమూ, శిక్షార్హమూ అవుతుందని సదరు సంస్థలను కూడా హెచ్చరిస్తున్నది. ఇక, ఎక్కడైనా ఆధార్ కార్డు నకలు ఇవ్వాల్సి వస్తే చివరి నాలుగు నంబర్లు మాత్రమే కనిపించే మాస్క్‌డ్ ఆధార్ ఇవ్వమన్న సూచన మంచిదే. ఈ ప్రకటనతో మాస్క్‌డ్ ఆధార్ డౌన్‌లోడ్ చేసుకున్నవారి సంఖ్య బాగా పెరిగింది కూడా. ఎక్కడపడితే  అక్కడ ఆధార్ ఫోటోకాపీని ఇచ్చి అవసరం తీరాక తిరిగి తీసుకోగలిగే వీలున్నా అత్యధికులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న నేపథ్యంలో ఇది మంచి సూచనే. ఆధార్ పూర్తి సంఖ్యతో నిమిత్తం లేకుండా, కేవలం ఒక గుర్తింపు పత్రంలాగా దానిని వాడదల్చుకున్న చోట్ల ఈ మాస్క్‌డ్ ఆధార్ సరిపోతుంది. ఆధార్ ఆధారిత మోసాలు, కెవైసీ పేరిట అక్రమాలు పెరిగిపోతున్న నేపథ్యంలో పూర్తి ఆధార్ సంఖ్య అవసరంలేని చాలాచోట్ల దీనినే వాడుకొనే సౌలభ్యం నాలుగేళ్లక్రితమే ఏర్పరిచారు.


ఇక, ఆధార్ డౌన్‌లోడ్‌కు ఇంటర్నెట్ సెంటర్లను వాడవద్దనీ, అవసరార్థం వాడినా ఆ తరువాత సదరు కాపీలను పూర్తిగా డిలీట్ చేయాలన్న సలహా కూడా మంచిదే. ఇక ఆధార్ దుర్వినియోగం విషయంలో సదరు సంస్థకే స్పష్టత లేనట్టుగా కనిపిస్తున్నది. ఒకపక్కన దానిని ఓ సాధారణ గుర్తింపుకార్డుగా మార్చివేసి, ప్రతి అవసరంతోనూ దానిని అనుసంధానిస్తున్నప్పుడు ఏ ప్రమాదమూ ఉండబోదని హామీ ఇస్తూంటుంది. మరోపక్కన అడపాదడపా ఇలా హెచ్చరికలు జారీ చేస్తూ జనాన్ని భయపెడుతూంటుంది. యూఐడీఏఐ నుంచి లైసెన్సు పొందిన సంస్థలకు మాత్రమే ఆధార్ ఇవ్వాలన్న సూచన బాగున్నది కానీ, ఒక కంపెనీ మన వివరాలు అడిగినప్పుడు దానికి లైసెన్సు ఉన్నదో లేదో ఎలా ధ్రువీకరించుకోవాలన్నది ప్రశ్న. అలాగే, ఎవరితోనైనా ఆధార్ వివరాలు పంచుకుంటున్నప్పుడు కాస్తంత విచక్షణతో వ్యవహరిస్తే చాలని ప్రభుత్వం మాటమాత్రంగా అన్నది కానీ, అది ఏ స్థాయిలో ఉండాలో వివరించలేదు. ఆధార్ ప్రైవసీ గురించి ఎంతో కాలంగా చర్చ, వివాదం నడుస్తున్నాయి. నాలుగేళ్ళక్రితం ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ తన ఆధార్ నెంబరు ట్విట్టర్‌లో పెట్టి ఓ సవాల్ విసిరితే, దాని ఆధారంగా అనేకమంది యూజర్లు ఆయన వ్యక్తిగత వివరాలు బహిర్గతపరిచిన విషయం తెలిసిందే. మాస్క్‌డ్ ఆధార్ మాత్రమే వినియోగించాలన్న నిబంధనలను కఠినతరం చేసి, పూర్తి సంఖ్య తెలియచెప్పాల్సిన సందర్భాలను బాగా పరిమితం చేయగలిగినప్పుడు దుర్వినియోగానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. డేటా లీకేజీపైనా, ఆధార్ వివరాలను బహిరంగంగా ప్రదర్శించే వెబ్ సైట్లపై మరింత బలంగా పోరాడటం అవసరం. డేటా సెక్యూరిటీ మీద ప్రభుత్వం కచ్చితంగా దృష్టిపెట్టాల్సిన అవసరం ఉన్నది.

Updated Date - 2022-06-02T06:44:18+05:30 IST