ఏ1, ఏ2లు నాపై లేఖ రాయడమా?

ABN , First Publish Date - 2021-07-25T07:48:27+05:30 IST

‘‘నేను బ్యాంకు రుణాలు ఎగవేశానని, చర్యలు తీసుకోవాలని..

ఏ1, ఏ2లు నాపై లేఖ రాయడమా?

జగన్‌, సాయిరెడ్డిలపై ఎంపీ రఘురామ ధ్వజం

న్యూఢిల్లీ, జూలై 24(ఆంధ్రజ్యోతి): ‘‘నేను బ్యాంకు రుణాలు ఎగవేశానని, చర్యలు తీసుకోవాలని.. ఏ1, ఏ2లు ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు లేఖరాయడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది’’ అని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శించారు. ప్రధాని, రాష్ట్రపతికి వైసీపీ ఎంపీలు రాసిన లేఖపై శనివారం ఆయన ఢిల్లీలో మాట్లాడారు. ‘‘సుమారు 17 కేసుల్లో ఉండి ఏ1, ఏ2గా పేరుపొందిన వారి గురించి చర్చించుకుందాం. ఇలాంటి నేరచరిత్ర కలిగిన వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి, విజయసాయిరెడ్డి మీద చార్జిషీట్లు కూడా నమోదయ్యాయి. నా కంపెనీ.. బ్యాంకుకు సొమ్ములు ఎగ్గొట్టాయని, త్వరగా చర్యలు తీసుకోవాలని ఈ ఇద్దరు నిందితులు ప్రధాని, రాష్ట్రపతికి లేఖ రాశారు. సాక్షాత్తు రూ.43 వేల కోట్లు దోచారన్న అభియోగాలతో చార్జిషీట్లు ఉన్న నిందితులు ఇలా లేక రాయడం దయ్యాలు వేదాలు వల్లించడమే’’ అని దుయ్యబట్టారు. ఏ నిందితుడైతే ముఖ్యమంత్రిగా మారి పనికిమాలిన కేసులు పెట్టి వేధిస్తూ ఎంతో మంది చావుకు కారణమయ్యాడో.. ఆయన తన గురించి లేఖ రాయడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్‌ కేసులకు సంబంధించి అప్పటి సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ దర్యాప్తు చేసింది చాలా తక్కువనని, పూర్తి వివరాలను కోర్టుకు అందించానని చెప్పారు. ప్రధాని, రాష్ట్రపతికి చెబితే న్యాయం జరుగుతుందని తన సహచరులు భావిస్తున్నారు కాబట్టి వారు చేసిన లూటి గురించి ప్రధాని, రాష్ట్రపతికే వివరిస్తానని అన్నారు. 


అనర్హత కోసమే నాటకాలు

తనపై అనర్హత వేటు వేయిం చడానికే పార్లమెంటులో వైసీపీ ఎంపీలు ఆందోళనలు చేస్తున్నారని, రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదని ఆరోపించారు. తాను ఎటువంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని, తన పార్టీని, పార్టీ అధ్యక్షుడిని ప్రేమిస్తున్నానని, తాను ఏ పార్టీలోనూ చేరలేదని వివరించారు. వివేకా హత్య కేసుకు సంబంధించి వాచ్‌మెన్‌ రంగయ్య ఏవో పేర్లు చెప్పారని, కొందరి పెద్దల పేర్లు కూడా చెప్పారని వార్తలు వచ్చాయన్నారు.

Updated Date - 2021-07-25T07:48:27+05:30 IST