మనదీ, మనతో ఉండేదీ...

ABN , First Publish Date - 2022-02-25T05:30:00+05:30 IST

ఒక ఊరిలో ఒక జెన్‌ సాధువు ఉండేవాడు. అతను ఇంటింటికీ తిరిగి బిచ్చమెత్తి జీవించేవాడు. అతను పొడవాటి అంగీ ధరించేవాడు. అది అక్కడక్కడ చిరుగుల్తో, అతుకులు వేసి ఉండేది. కానీ సాధువు చెప్పే మాటలు వింటే... అతను మహాజ్ఞాని అనిపించేది. రాజ్యంలోని వారు అతని గురించి మాట్లాడుకొనేవారు.

మనదీ, మనతో ఉండేదీ...

ఒక ఊరిలో ఒక జెన్‌ సాధువు ఉండేవాడు. అతను ఇంటింటికీ తిరిగి బిచ్చమెత్తి జీవించేవాడు. అతను పొడవాటి అంగీ ధరించేవాడు. అది అక్కడక్కడ చిరుగుల్తో, అతుకులు వేసి ఉండేది. కానీ సాధువు చెప్పే మాటలు వింటే... అతను మహాజ్ఞాని అనిపించేది. రాజ్యంలోని వారు అతని గురించి మాట్లాడుకొనేవారు. ఈ విషయం రాజుకు చేరింది. ఆయనే స్వయంగా ఆ సాధువు ఉన్న చోటుకు వెళ్ళాడు. కొంతసేపు అతనితో మాట్లాడాడు. ఆ సాధువు గొప్ప మేధావి అని రాజుకు అర్థమయింది. ‘‘ఈ క్షణం నుంచి మా కొలువులో మీరే ప్రధానమంత్రి’’ అని ప్రకటించాడు. దాసదాసీ జనానికి ఆజ్ఞలు జారీ చేశాడు.


వారు ఆ సాధువును రాజమహల్‌కు తీసుకువెళ్ళారు. బస ఏర్పాటు చేసి, పన్నీటి స్నానం చేయించారు. పాత అంగీని తీయించి, విలువైన కొత్త దుస్తులను, ఆభరణాలను ధరింపజేశారు. ఎంతో విశాలమైన గదులున్న భవనం ఆ సాధువుకు నివాసంగా ఉండేది. 

ఆ సాధువు ప్రతిరోజూ ఆ భవనంలోని మారుమూల గదిలోకి వెళ్ళేవాడు. తలుపులు వేసుకొని, కొంతసేపు ఉండేవాడు. చివరకు పనివారిని కూడా రానివ్వకుండా... ఆ గదిని స్వయంగా శుభ్రపరచుకొనేవాడు. ఇలా కొన్ని రోజులు గడిచింది.


‘ఆ గదిలో ఏం ఉంది? ఎందుకు ఎవరినీ రానివ్వడం లేదు? అందులో అతను అంత రహస్యంగా ఏం చేస్తున్నాడు?’ అనే సందేహాలు దాస దాసీ జనానికీ, భటులకూ వచ్చాయి. అయితే, రాజు ఆ సాధువును ప్రత్యేక గౌరవంతో చూస్తూ ఉండడంతో... తమ సందేహాల గురించి అడిగే సాహసం ఎవరూ చెయ్యలేదు. అయితే గుసగుసలాడుకుంటూ ఉండేవారు. ఇది ఆనోటా, ఈనోటా పడి రాజుగారికి చేరింది. ఆయన ఆరా తీయగా... ‘‘మన ప్రధానమంత్రి తన నివాసంలో ఒక ప్రత్యేక గదిలోకి ఆయన మాత్రమే వెళ్తున్నాడు. తలుపులు మూసి, కొంతసేపు అక్కడ ఉన్నాక తిరిగి వస్తున్నాడు. లోపల ఏం చేస్తున్నాడో ఎవరికీ అంతుపట్టడం లేదు’’ అని పరిచారకులు చెప్పారు. అదేమిటో తెలుసుకోవాలనే కోరిక రాజులోనూ అధికమయింది. ఆ ఆలోచనతో ఒక రాత్రంతా నిద్ర పట్టలేదు.

మరుసటిరోజు సాధువు భవనానికి వెళ్ళి, ‘‘ఈ రోజు మీ భవనమంతా చూద్దాం’’ అన్నాడు రాజు.

‘‘రండి మహారాజా!’’ అంటూ అన్ని గదుల్లోకీ తీసుకువెళ్ళాడు సాధువు.. కానీ తన ప్రత్యేక గదిలోకి మాత్రం వెళ్ళనివ్వలేదు.


‘‘ఈ గదినీ చూద్దాం’’ అన్నాడు రాజు.

‘‘వద్దులెండి మహారాజా! మీరు చూడదగినది అందులో ఏదీ లేదు’’ అన్నాడు సాధువు.

‘‘లేదు. నాకేదో అనుమానంగా ఉంది. జరగకూడనిదేదో ఆ గదిలో జరుగుతోంది. తలుపు తీయండి’’ అన్నాడు రాజు.

‘‘సరే మహారాజా! అయితే, ఆ తరువాత నేను మంత్రిగా కొనసాగలేను. మీరు అంగీకరిస్తే లోపలికి పోదాం’’ అని చెప్పాడు సాధువు.

‘అలాగే’నన్నాడు రాజు. ఇద్దరూ గది లోపలికి వెళ్ళాలు. అక్కడ ఏమీ లేదు... గోడ మీద ఒక మేకుకు వేలాడుతున్న, చిరిగి అతుకులు వేసిన పాత అంగీ తప్ప

‘‘రోజూ ఈ గదిలో మీరేం చేస్తారు?’’ అని అడిగాడు రాజు.


‘‘ఆ అంగీని చూస్తూ... ‘బిచ్చగాడినైన నాకు అనుకోకుండా ప్రధానమంత్రి పదవి లభించింది. ఆ పదవిపై మమకారం పెంచుకోకూడదు. అది ఎప్పుడైనా పోవచ్చు. నేను మళ్ళీ బిచ్చగాడినే అవుతాను’ అని గుర్తు చేసుకుంటూ ఉంటాను. ఆ సమయం రానే వచ్చింది. నా మీద విశ్వాసం లేని చోట నేను ఉండలేను’’ అంటూ తన దుస్తులను, ఆభరణాలనూ తీసేసి... ఆ పాత అంగీని ధరించి... నిశ్చింతగా, నిర్వికారంగా బయటికి నడిచాడు ఆ సాధువు.


జీవితంలో ఎన్నో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అది సహజం. మన చైతన్యం మాత్రమే మనది... అదే మనతో ఉండేది. వచ్చీ, పోయే వాటి గురించి సంతోషించడం, దుఃఖించడం తగదు.

రాచమడుగు శ్రీనివాసులు

Updated Date - 2022-02-25T05:30:00+05:30 IST