ప్రతీకాత్మక చిత్రం
అనుకున్న పనులన్నీ అనుకున్న విధంగానే జరిగే క్రమంలో ఒక్కోసారి ఉన్నట్టుండి అనూహ్య ఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. దీంతో కొన్నిసార్లు మొత్తం జీవితాలే తలకిందులవుతుంటాయి. ప్రేమికులు, దంపతుల విషయాల్లో కొన్నిసార్లు ఇలాగే అనూహ్య ఘటనలు చోటు చేసుకుని.. చివరకు ఒకరికి ఒకరు దూరమవ్వడమో, లేదా తనువు చాలించడమో జరుగుతుంటుంది. ఇటీవల ఇలాంటి వార్తలు తరచూ వింటూనే ఉన్నాం. కాగా.. ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల విచిత్ర ఘటన చోటు చేసుకుంది. నిశ్చితార్థం జరిగిన కొన్నాళ్లకు పెళ్లిని రద్దు చేసుకున్నారు. అయితే ఆమే తన భార్యగా కావాలంటూ ఆ యువకుడు చేసిన పని చివరకు చాలా దూరం వెళ్లింది. వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్‌లోని నరోడా ప్రాంతానికి చెందిన వర్షా వంజారా అనే యువతి.. ఆర్కెస్ట్రాలో సింగర్‌గా పని చేస్తోంది. కొంతకాలం క్రితం కిషన్ వంజారా అనే యువకుడితో వర్షాకు నిశ్చితార్థం జరిగింది. కుల వివాహ వేదిక ద్వారా ఈ రెండు కుటుంబాలు కలిశాయి. మంచి ముహూర్తం చూసుకుని పెళ్లి జరిపించేలా మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో వర్ష, కిషన్ రోజూ ఫోన్లలో మాట్లాడుకునేవారు. అయితే ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ.. ఇద్దరి మధ్య మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. దీంతో వివాహం రద్దు చేసుకున్నారు. అయితే ఆ యువకుడు మాత్రం వర్షానే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
ఇదే విషయాన్ని ఆమెకు, తల్లిదండ్రులకు తెలియజేశాడు. దీనికి వారు అంగీకరించకపోవడంతో బెదిరించడం మొదలెట్టాడు. ‘‘ ముందుగా అనుకున్న ముహూర్తానికే పెళ్లి జరగాలి, లేదంటే మీ కూతురిపై యాసిడ్ పోసి.. నేనూ ఆత్మహత్య చేసుకుంటా. దీనికంతా మీరే కారణమని సూసైడ్ నోట్ రాస్తా’’.. అంటూ రోజూ ఫోన్ చేసి బెదిరించేవాడు. కొన్నాళ్లు పోతే తప్పు తెలుసుకుంటాడులే.. అని అనుకున్నా, అతడిలో మాత్రం మార్పు రాలేదు. వేధింపులు ఎక్కువవడంతో చివరకు వర్ష కుటుంబ సభ్యులు.. పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి