ఏడాది కిందట, ఎంతటి మృత్యువు?

ABN , First Publish Date - 2022-05-12T09:29:37+05:30 IST

ఇప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నవాళ్లు, రేపు తమ మనవళ్లకి మనవరాళ్లకి చెబుతారు, ఉన్నట్టుండి మనుషులు ముడుచుకుపోవడం గురించి, ఒక నిశ్శబ్దం పరుచుకోవడం గురించి, ఏదో తెలియని భయం...

ఏడాది కిందట, ఎంతటి మృత్యువు?

ఇప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నవాళ్లు, రేపు తమ మనవళ్లకి మనవరాళ్లకి చెబుతారు, ఉన్నట్టుండి మనుషులు ముడుచుకుపోవడం గురించి, ఒక నిశ్శబ్దం పరుచుకోవడం గురించి, ఏదో తెలియని భయం ముసురు పట్టడం గురించి, బూచాడు కూడా భయపడే రోడ్ల గురించి. ఆస్పత్రుల నుంచి ఇంటికి రాని ఆత్మీయుల గురించి కథలు కథలుగా చెబుతారు.


నిర్దాక్షిణ్యంగా జ్ఞాపకాలను తోసేసి, మళ్లీ సందడి జీవితంలోకి పరిగెత్తుతున్నాం కానీ, ఎటువంటి కాలాన్ని దాటి వచ్చాము? ముక్కులు బంధించి మూతులు బిగించి ఆసాంతం కవచాలు ధరించి స్పర్శలు నిషేధించి ఒంటిస్తంభం మేడలో దాక్కున్న పరీక్షిత్తులాగా స్వచ్ఛంద ప్రవాసం విధించుకుని, ఎన్ని సత్యాలు తెలుసుకున్నాము, ఎంత తాత్వికతను నింపుకున్నాము? కొమ్ములు విప్పుకుని, శ్వాసల కొసలలో ప్రసరించి, ఒక పురుగు మరణమై ముంచెత్తినప్పుడు, ఎన్ని చివరిచూపులను కోల్పోయాము, ఎన్ని కన్నీళ్లను అప్పుపడ్డాము?


చావుబతుకుల సరిహద్దులపై తచ్చాడినప్పుడు, బుద్బుదత్వాన్ని, క్షణభంగురత్వాన్ని, పిపీలకత్వాన్ని అన్నీ తెలుసుకున్నట్టే అనిపించింది. ఈ గండం గడిస్తే, ఇక నుంచి మనిషితనాన్ని, మంచితనాన్ని నిలబెట్టుకోవాలని అందరూ మొక్కుకున్నట్టే అనిపించింది. కానీ, అబద్ధం, దుర్మార్గం, పక్షపాతం, దోపిడి, స్వార్థం, ద్వేషం.. అన్నీ చావుల ఋతువులోనూ విర్రవీగాయి, పిశాచాల వలె కేరింతలు కొట్టాయి. ప్రాణాలకు విలువ కట్టాయి, ప్రాణవాయువును గుప్పిటపట్టాయి.


ఆత్మలను తీర్చిదిద్దుకున్నవారు కొద్దిమందే అయినా, ఎప్పుడూ ఉంటారు. నిప్పుల్లో నడుస్తారు. అరణ్యరోదనలను వింటారు. ఆకలి తీర్చి, ఇల్లు చేరుస్తారు. భూతం తరుముతుంటే, ప్రాణభీతి దహిస్తుంటే కూడా, మనుషులు ఒక్కొక్కళ్లు కాదు, ఒకరికొకరు అని నమ్మకం కలిగిస్తారు.


విసిగి విసిగి కొవిడ్ చల్లారిపోతున్నది. జన్యుపరివర్తనాలు చిలవలు పలవలై పలచబడిపోతున్నాయి. దాటి వచ్చిన భయోత్పాతం మరపున పడుతున్నది. మనుషుల ఉత్పాతాలూ, పోరాటాలు ఇక యథాతథం. అర్థక్రిమి కూడా అపహసించే కీటకం మానవద్వేషం.


మరణాలను ఎట్లా లెక్కించగలం? దగ్గరివారో దూరం వారో బంధువులను, స్నేహితులను పోగొట్టుకోనిది ఎవరు? ఏడాది కిందట ఇదే నెలలో, ఎన్ని రహస్యపు చితులు మండాయో, ఎన్ని చావులు లెక్కల నుంచి జారిపోయాయో ఎవరు లెక్కించారు? గంగలో కొట్టుకుపోయిన శవాలు కాదు, మౌనంలో నిరాకరణలో కొట్టుకుపోయిన శవాలు ఎన్నో ఎట్లా తెలియాలి?


అంకెలు, సంఖ్యల గురించి మాట్లాడుతున్నాము కానీ, అవన్నీ మనుషులకు సంకేతాలు. అవన్నీ అకాలంలో ముగిసిన జీవితాలు. వాటిలో, నివారించగలిగి, నివారించలేని మరణాలన్నీ మరింత విషాదాలు కదా!


ప్రభుత్వం చెప్పే ఐదులక్షల లెక్కకు, ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పే యాభై లక్షల లెక్కకు చాలా దూరం ఉన్నది. ప్రపంచంలో అన్ని దేశాలలో మరణాలను లెక్కించే ఫార్ములానే ఇండియాకు కూడా వర్తింపజేశామని వాళ్లు చెబుతున్నారు. పోనీ, సత్యం పదిరెట్ల తేడా ఉన్న ఆ రెండు సంఖ్యల మధ్య ఉన్నదని అనుకుందాం. డబ్ల్యుహెచ్‌వో వారి లెక్కను ఒప్పుకోవడానికి కానీ, తప్పనడానికి కానీ, ఆధారాలు లేవు. కానీ, ప్రభుత్వాల లెక్కలు వాస్తవానికి చాలా దిగువన ఉన్నాయని చెప్పడానికి కొవిడ్ ఉధృత కాలంలో మీడియాలో వచ్చిన వార్తలే సాక్ష్యం. కొవిడ్ సోకిన కేసులను, మరణాలను తగ్గించి చెప్పడం జాతీయ విధానమో, ఎక్కడికక్కడ రాష్ట్ర ప్రభుత్వాలే అట్లా నిర్ణయం తీసుకున్నాయో తెలియదు కానీ, అదొక అనధికార వాస్తవం. అది కేంద్రం సూచనే అయి ఉంటే, దాన్ని పెద్దగా పాటించని రాష్ట్రప్రభుత్వాలు కూడా ఉన్నాయి. కానీ, అధికారిక సత్యానికీ, వాస్తవ సత్యానికీ మధ్య తేడాను పట్టి చూపించే సాక్ష్యాలు కూడా ఆ ఆపద కాలంలోనే రూపొందాయి. పత్రికావార్తలు, ఫోటోలు, వార్తాఛానెళ్ల ఫుటేజి, మరణ ధ్రువపత్రాలు, సగటు మరణాలతో ఉన్న వ్యత్యాసం, శ్మశానాలలో నమోదులు...


మొదటి విడత కొవిడ్ వ్యాప్తి సందర్భంలో, సన్నద్ధత ఒక ప్రశ్న. అకస్మాత్తుగా వైద్య ఆరోగ్య వ్యవస్థ మీద అంత ఒత్తిడి పడినప్పుడు, దానిని ఎదుర్కొనలేకపోవడాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆక్సిజన్, కొన్ని రకాల మందుల లభ్యత మీద పడిన ఒత్తిడి, ఆ సమయంలో హెచ్చరిక లాంటిది. రెండో విడత కొవిడ్ వెల్లువ వచ్చినప్పుడు, ప్రభుత్వం సన్నద్ధంగా ఉండి ఉండాలి. వైద్య నిపుణుల హెచ్చరికను అలక్ష్యం చేయడం, ఆ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చడానికి జాతీయ స్థాయి వైద్య ఆరోగ్య నిపుణుల వ్యవస్థను కూడా ఉపయోగించడం గురించి పత్రికలలో కథనాలు వచ్చాయి. ప్రభుత్వం కనుక మొదటి విడత నుంచి పాఠాలు తీసుకుని ఉంటే, గత ఏడాది ఏప్రిల్, మే మాసాలలో అంత ప్రాణనష్టం జరిగి ఉండేది కాదు.


ప్రాణనష్టమే కాదు, కొవిడ్ కల్లోలంలో అతలాకుతలం అయిన వివిధ జీవనరంగాలు, ప్రజాశ్రేణులు, ఉపాధులు ఉద్యోగాలు వ్యాపారాలు అన్నీ నాశనమయ్యాయి. కొవిడ్ స్పృశించిన కుటుంబాలు అప్పులపాలయ్యాయి. ప్రైవేటు వైద్యరంగం పరమ స్వార్థంతో వ్యవహరించింది. పేదల చదువులు దెబ్బతిన్నాయి. ఈ నష్టాన్ని భర్తీ చేయడానికి, సాయం అందించడానికి కనీసంగా ఎంత చేయాలో అంత మన ప్రభుత్వాలు చేయలేదు. ఇది దేవుడి చర్యగా చెప్పి, బాధ్యత దులుపుకున్నారు. 


కంచన్ గుప్తాకు కోపం వచ్చింది. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలకు సీనియర్ సలహాదారుడైన పాత్రికేయుడు ఆయన. మునుపటి ప్రధాని కీర్తిశేషులు అటల్ బిహారీ వాజపేయికి కూడా ఆయన సలహాదారుడిగా ఉన్నారు. భారతీయ ఫోటోగ్రాఫర్లకు పులిట్జర్ బహుమతులు రావడం మీద ఆయనకు దేశభక్తియుతమైన, సామ్రాజ్యవాద వ్యతిరేకతతో కూడిన కోపం వచ్చింది. భారతదేశంలోని కొవిడ్ మృతులను అవమానించడమే ఈ పురస్కారాల ఉద్దేశమని, తెల్లవారికి సాగిలబడడానికి, దేశాన్ని తెగనమ్మడానికి మనలో కొందరు సిద్ధపడడమే దీనికంతటికీ కారణమని ఆయన ఆవేదన చెందారు. అనేక ఇతర దేశాలలో కూడా కొవిడ్ కాలం దయనీయ దృశ్యాలను సృష్టించినప్పటికీ, వాటిని కాక భారతీయ దృశ్యాలనే బహుమతులకు ఎంపిక చేయడం వెనుక కుట్ర ఉన్నదన్నట్టుగా కంచన్ గుప్తా మాట్లాడుతున్నారు.


విదేశీ వార్తాసంస్థకు పనిచేసేవారే అయినప్పటికీ, నలుగురు భారతీయులకు ఒకేసారి పులిట్జర్ బహుమతి రావడం విశేషం. మీడియా రంగంలో ఆ బహుమతికి ఎంతో గౌరవం ఉన్నది. లెక్కప్రకారం ఆ గౌరవం దక్కినవారిని ప్రభుత్వం అభినందించాలి. బహుశా, కంచన్ గుప్తా ట్వీట్ ప్రభుత్వ వైఖరినే తెలియజేస్తున్నది.


పాశ్చాత్య ప్రపంచం ఇచ్చే పురస్కారాల మీద అనుమానాలు విమర్శలు లేకపోలేదు. ఎంపికలు చేసే సంస్థలు కానీ, కమిటీలు కానీ స్పష్టమైన రాజకీయ పక్షపాతాలు కలిగి ఉన్నట్టు కనిపించకపోయినా, అసంకల్పితమైన, పరంపరాగతమైన సామాజిక, సాంస్కృతిక పక్షపాతాలు వ్యక్తమవుతాయని తరచు వింటుంటాము. అనేక చితులు ఏకకాలంలో మండుతున్న విహంగ దృశ్యం, ఉపద్రవం తీవ్రతను సూచిస్తుంది. మన దేశంలో అంత్యక్రియలు జరిగే తీరు, శ్మశానాలలో కిక్కిరిసిన మృతదేహాలు, మృతులను ప్లాస్టిక్ కవర్లలో చుట్టిన తీరు... ప్రపంచానికి మరింత ఆదిమంగా, అనాగరికంగా కనిపిస్తుండవచ్చు. ప్రపంచమంతా ఆవరించిన కరోనా కల్లోలంలో భారతీయ ఛాయాచిత్రాలను మాత్రమే పులిట్జర్ ఎంపిక కమిటీ గుర్తించిందంటే, ఫోటో జర్నలిజం ప్రమాణాలు కూడా అందులో పనిచేసి ఉంటాయి. భారతీయ ఫోటోగ్రాఫర్లకు ఫీచర్ ఫోటోగ్రఫీలో బహుమతులు రాగా, వార్తాఫోటోగ్రఫీలో అమెరికన్ కేపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారులు చేసిన దాడి ఫోటోలు బహుమతి గెల్చుకున్నాయి. అమెరికన్ ప్రజాస్వామ్యం తనను తాను అవమానించుకున్నదని ఎవరైనా విమర్శించారో లేదో తెలియదు.


భారతీయ జీవితాలను కానీ, మరణాలను కానీ పాశ్చాత్య ప్రపంచం చిన్నచూపు చూసినా, హేళనచేసినా కంచన్ గుప్తాతో పాటు అందరం బాధపడవలసిందే. భారతీయులను తక్కువ చేయడానికే ఆ ఫోటోగ్రాఫర్‌కు పులిట్జర్ బహుమతి ఇచ్చి ఉండవచ్చు. ఒప్పుకుందాం, అయితే, మన దేశపు వాస్తవికతను మనం దాచిపెట్టుకోవాలా? సత్యానికి కట్టుబడడం పరులకు దాసోహం అనడమా? పాత్రికేయుల, ఛాయాచిత్రకారుల బాధ్యత ఏమిటి? మన దేశవాస్తవికతను చిత్రించి, ప్రపంచంలో మన పరువు తీస్తున్నారని సత్యజిత్‌రేను, మృణాళ్‌సేన్‌ను కూడా తప్పు పట్టిన ఘనులున్నారు. అంతర్గత సమస్యలను కప్పిపుచ్చడమే దేశభక్తి కాబోలు.


విదేశాల వారు భారతీయ మృతులను గౌరవించారా లేదా అన్నది కాదు, భారతీయ మృతులను మన ప్రభుత్వం ఎంత మేరకు గౌరవించింది అన్నది ముఖ్యం. మరణాలను గుర్తిస్తే, వారి స్మృతికి గౌరవం. కొవిడ్ విధ్వంసాన్ని, దాని బాధితులను గుర్తిస్తే, భవిష్యత్తుకు ఆరోగ్యం.


కె. శ్రీనివాస్

Read more