కష్టజీవికై కదం తొక్కిన పదం

ABN , First Publish Date - 2022-04-04T06:57:50+05:30 IST

భారతీయ సాహిత్య రంగానికి సంబంధించి జాతీయ అంతర్జాతీయ ప్రశస్తి ఉన్న కవి, సంగీతకారుడు గద్దర్‌. తొలుత బాపూజీ బుర్రకథ దళం, తర్వాత ప్రజా పోరాటాల నేపథ్యంలో 1972 నుంచి...

కష్టజీవికై కదం తొక్కిన పదం

భారతీయ సాహిత్య రంగానికి సంబంధించి జాతీయ అంతర్జాతీయ ప్రశస్తి ఉన్న కవి, సంగీతకారుడు గద్దర్‌. తొలుత బాపూజీ బుర్రకథ దళం, తర్వాత ప్రజా పోరాటాల నేపథ్యంలో 1972 నుంచి జననాట్యమండలి, దళిత కళామండలి, అఖిలభారత విప్లవ సాంస్కృతిక సమాఖ్య, తెలంగాణ సాంస్కృతిక సమాఖ్య వంటి సంస్థల పక్షాన ఆయన నిర్వహిం చిన సాహిత్య, సంగీత, సాంస్కృతిక ఉద్యమం చరిత్రాత్మక మైంది. మొత్తం ఆరు దశాబ్దాల పాటు సాగిన ఉద్యమమిది. శ్రీకాకుళపోరాటంలో అమరుడు సుబ్బారావు పాణిగ్రాహి, నక్సల్బరీ పోరాటానికి మద్దతుదారు సరోజ్‌దత్తా వంటివారు పెట్టిన ఒరవడిలో పనిచేసి నిర్బంధాలు ఎదుర్కొన్న కళాకారుడు గద్దర్‌. అటు తర్వాత బి. నర్సింగ్‌ రావు పూనికతో స్థాపితమైన సంస్థ ‘ఆర్ట్‌ లవర్స్‌’ మూతపడడానికి చివరిరోజుల్లో అందులో చేరాడు. 1972లో జననాట్యమండలి స్థాపనలో భాగమై ఆ సంస్థ పక్షాన సాంస్కృతికోద్యమ నిర్మాణానికి భాద్యతలు తీసుకో వడంతో ఆయన జీవితం పూర్తిగా మలుపుతిరిగింది. 


ఈ క్రమంలో ఆయన బెంగాల్‌ లోని సుందర్‌బన్స్‌ నుంచి పంజాబ్‌ వరకు, ఢిల్లీ నుంచి కన్యాకుమారి వరకు విస్తారంగా పర్యటనలు చేసి కష్టజీవులు, అణగారిన వర్గాలకోసం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. స్వతంత్ర భారతాన ఒక తిరుగుబాటు, అసమ్మతికవిగా గద్దర్‌ చేసిన ఈ పర్యటనలు వాటికవే గొప్ప చరిత్ర. గద్దర్‌ పాటలు, కళారూపాలు సాంతం మధ్య భారతదేశంలోని దాదాపు అన్ని ఆదివాసీ భాషలసహా 15 నుంచి 20 దాక భారతీయ భాషలలోకి అనువాదమైన చరిత్ర కూడ గద్దర్‌దే. ఆయనపై 1997 ఏప్రిల్‌ 6న జరిగిన కాల్పులు, హత్యా ప్రయత్నానికి దేశవ్యాప్తంగా నిరసన వెల్లువెత్తింది. ఈ సంఘటనపై జాతీయ పత్రికలు కూడ స్పందిచాయి. తెలుగు సాహితీలోకం సాంతం కదిలి వచ్చి ఉరేగింపు జరిపి నిరసన వ్యక్తం చేసింది. 


ప్రేమ్‌చంద్‌ వలే గద్దర్‌ వ్యవసాయ కూలీలు, రైతులు, కార్మికులు, ఆదివాసులు అణగారిన మహిళల జీవిత వాస్తవికతపై వందలాది పాటలు, కళారూపాలు, బ్యాలేలు రాశారు. ఇది ఆషామాషీగా జరిగిందేమీ కాదు. డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ ఆలోచన, మార్క్సిస్టు తత్వశాస్త్రం అధ్యయనం చేయడంతో- కులంతో పాటు వర్గం కూడ ఈ దేశ ప్రజలను పీడిస్తున్నాయన్నది ఆయనకు స్పష్టమైంది. తొలుత వర్గశత్రు నిర్మూలన ప్రేరణతో పాటలు, కళారూపాలు రాసినప్పటికీ ఎమర్జెన్సీ తర్వాత ప్రజాపంథా ముందుకు రావడంతో గద్దర్‌ సాహిత్య దృక్పథంలో మౌలికమైన మార్పు వచ్చింది. జననాట్యమండలి స్థాపనతో అందులో భాగమై గద్దర్‌ చేసిన రచనలతో ఇక్కడ ప్రగతిశీల సాహిత్యోద్యమం ప్రాణం పోసుకున్నది. కెవిఆర్‌, గద్దర్‌, చెరబండరాజు, వరవరరావు భాగస్వాములుగా జాతీయస్థాయిలో ఏఐఎల్‌ఆర్‌సి స్థాపనతో ఆయా రాష్ట్రాల భాషల్లో గద్దర్‌ నిర్వహించిన సాహిత్య, సాంస్కృతిక ఉద్యమం స్థిరరూపం దాల్చింది. 


గద్దర్‌ సాహిత్య సాంస్కృతిక దృక్పథం, కళావ్యక్తిత్వం రాత్రికి రాత్రి రూపు దిద్దుకున్నవి కాదు. హైస్కూలు విద్యార్థి దశ నుంచి కళా ప్రదర్శనలకు సంబంధించి ఆయన శిక్షణ పొందారు. చిన్ననాటనే తమ గ్రామాన జిల్లాస్థాయి బుర్రకథాగానం పోటీలలో ప్రథమ బహుమతి అందుకున్నారు. ప్రతి పంద్రాగస్టు, చెబ్బీసు జనవరి, ఇతర సందర్భాల్లో కళా ప్రదర్శనలు ఇవ్వడం వల్ల సొంతూరు తూఫ్రాన్‌లో ‘బుర్రకథల విఠల్‌’గా పేరు గాంచాడు. యుక్త వయస్సులో చదువుకుంటూ సమయం దొరికినప్పుడు కార్మికునిగా, కూలీగా ఆయా పనులు చేస్తూనే, వీలైనప్పుడు గుడిసెవాడలు, కార్మికవాడలలో బుర్రకథా ప్రదర్శనలు ఇచ్చేవాడు. జంటనగరాలలోని ఎస్సీలు ఉండే బస్తీలలో ఆయన సుప్రసిద్ధుడు. చిన్ననాటి నుంచి కూలిపని చేయడం వల్ల ఆయనకు సమానత్వ భావన సహజంగానే అబ్బింది. ఈ క్రమంలో ఆనాటి పాలకవర్గాల ప్రలోభాలకు గురికాకుండా, అవకాశవాద సాంస్కృతిక సంస్థలలో భాగం కాకుండా, అణగారిన వర్గాల పక్షం వహించడానికి ఆయనపై ఆయన చేసుకున్న వర్గపోరాటం కనిపిస్తుంది.  


1960వ దశకాన 1967లో నక్సల్బరీ సంఘటన, దానితోపాటు వరుసగా శ్రీకాకుళం ఆదివాసీల తిరుగుబాటు, తెలంగాణ తిరుగుబాటు, బిహార్‌ గుజరాత్‌ విద్యార్థి యువజనుల తిరుగుబాట్లు పుట్టుకొచ్చి సమాజం ముందుకు కొత్త ప్రశ్నలను తెచ్చాయి. స్వాతంత్య్రం సిద్ధించి ప్రజాస్వామిక దేశంగా ఆవిర్భవించిన భారత్‌లో అంతర్గతంగా కొనసాగుతున్న సామాజిక వైరుధ్యాలు ఒక్క ఉదుటున వెలుగులోకి వచ్చాయి. అప్పటికే అభ్యుదయ సాహిత్యోద్యమం బలహీన పడింది. దీంతో ఈ కొత్త పరిస్థితికి గద్దర్‌ స్పందించారు. ఆయన వంటి యువదళిత కళాకారుని ఆగమనానికి నాటి సామాజిక భూమిక సిద్ధంగా ఉన్నది. ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌ నగరాన అంబేడ్కర్‌ బుర్రకథ, అల్లూరి సీతారామరాజు బుర్రకథ ప్రదర్శనలతో గద్దర్‌ ఆధ్వర్యంలో ఒక ‘పొలిటికల్‌ కల్చరల్‌ మూవ్‌మెంటు’ మొదలయ్యింది. ఆనాటి పరిస్థితిని మొత్తంగా చూస్తే- భిన్న ప్రాతిపదికలు రాజుకుని ప్రగతిశీల సాహిత్యోద్యం ప్రచారంలోకి తెచ్చిన సార్వజనీన ఆదర్శాలు తగ్గుముఖం పట్టి స్థానికత కేంద్రంగా మారింది. రచనలలో నిర్దిష్టత పెరిగింది. వ్యక్తి ప్రాధాన్యం పెరిగింది. మహిళల నవలా రచన ఉద్యమ స్థాయిలో రావడం ఈ దశాబ్దపు ప్రత్యేకత. అంటరానితనమనే సంకెలతో కూలితల్లి చేతులమీదుగా పెరిగిన గద్దర్‌, తన చిన్ననాటి స్నేహితులు కృష్ణ, నరహరి, ఆనాటి హైదరాబాద్‌ పెద్దలు రామస్వామి సహాకారంతో, 18-19ఏళ్ల వయస్సులో కవిగా, రచయితగా హైదరాబాద్‌ నగరాన అడుగుపెట్టారు. 


1969లో తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కార్యకర్తగా పాల్గొంటూనే అందులో భాగంగా చల్లా నర్సిహ్మతో బృందంతో కలిసి పాటలు, గొల్ల సుద్దులు పాడాడు. అలా ప్రజా ఉద్యమాలకు కళకు ఉన్న సంబంధం గురించి గద్దర్‌కు తెలిసి వచ్చింది. ప్రజల మనసుల్లోకి చేరిన కళాకారునికి ఎటువంటి మన్నన, ఉత్తేజం లభిస్తుందో ఆయనకు అర్థమైంది. ఆయన భారతదేశ కార్మిక వర్గకవిగా మారడంలో ఈ అవగాహన కీలక భూమికగా పనిచేసింది. ఈ మొత్తం క్రమానికి ప్రేరణ అంబేద్కర్‌ జీవిత క్రమమే. అదే గద్దర్‌కు తాను నమ్మిన విలువలకు చిత్తశుద్ధితో నిబద్ధుడై పనిచేయడం నేర్పించింది. 


బుర్ర కథ కళాకారునిగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమం (1969)లో పాల్గొని అరెస్టు కావడం, గుడిసెవాసుల పోరాటంలో పాల్గొని పాటలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం, అటుతర్వాత అంబేడ్కర్‌ విగ్రహ స్థాపన ఉద్యమంలో పాల్గొని లాఠీ దెబ్బలు తినటం... ఈ అనుభవాలతో ఆయనకు రాజ్య హింస గురించి తెలిసి వచ్చింది. తాను ఎంచుకున్న మార్గం కష్టాలు కన్నీళ్లమయమని తెలిసినా ప్రజల నుంచి వచ్చే ఉత్తేజం ఆయనను నిజాయితీగా నిలబెట్టింది. 


భారతీయ అర్ధభూస్వామ్య గ్రామీణ సమాజం, అర్ధవలస పట్టణ జీవితం, సామాజిక వైరుధ్యాలు, దాని కుసంస్కృతిపై పోరాటానికి సంబంధించి గద్దర్‌ ఎన్నో రచనలు చేశారు. తెలుగులో నగర కార్మిక వర్గంపై గద్దర్‌ రాసినన్ని వైవిధ్యమైన పాటలు మరింకెవరూ రాయలేదు. గద్దర్‌ పాటలలో చిత్రితమైన జీవితం అసంఘటిత రంగానికి, సంఘటిత రంగానికి చెందిన కార్మికులకు జీవితం. సామ్యవాద దృక్పథంతో గోండు ఆదివాసుల మీద రాసిన రచయితల్లో గద్దర్‌ ప్రత్యేకంగా నిలుస్తారు. ఆ రచనలలో పాటలు, బ్యాలేలు ఉన్నాయి. దీని తర్వాతే తెలుగులో ఆదివాసి సాహిత్యం ఉద్యమ రూపం ధరించింది. ఆయన 1970లలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సమాచార పౌరసంబంధాల శాఖలో బుర్రకథ కళాకారునిగా కుదురుకున్నాడు. ఆయన తెలంగాణ ఫక్కీలో బుర్రకథాగానం చేయటం చూసి ఆంధ్ర అధికారులు నాజర్‌ ఫక్కీలో పాడాలని ఒత్తిడి చేసేవారు. ఆయన ఎదురుతిరిగాడు. ఈ కారణంగా ఆయనకు రావాల్సిన ప్రోగ్రాం పైసల బిల్లులు ఆపేస్తే నిరసనగా ఉద్యోగం మానేశాడు. ఇది కవిగా, కళాకారునిగా ఆయనను తీవ్రంగా కలిచి వేసింది. 


1970లలో సిపిఐ, సీపిఎంల వర్గ సంకర రాజకీయాలను కాదని ఎంఎల్‌ పార్టీ ఏర్పడ్డట్టే- సాంస్కృతిక రంగంలో నెహ్రూ విధానాలకు వంతపాడిన అరసం, ప్రజాన్యామండలి ల దివాళాకోరుతనాన్ని అధిగమించి సాహిత్యరంగంలో విరసం, జననాట్యమండలి ఏర్పడ్డాయి. దీంతో 1970ల్లో రాజ్యం నుంచి, పోలీసుల నుంచి విప్లవరచయితలు ఎంతో నిర్బంధాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. నిజానికి గద్దర్‌ ఇటువంటి స్థితిని 1968లలోనే ఎదుర్కొన్నాడు. వాస్తవానికి- స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత అరెస్టులు, నిర్బంధం ఎదుర్కొన్న కవులలో సామాజిక ఆదర్శాలున్న కవిగా, ఎస్సీ యువకునిగా ఆయనే ప్రథముడు కావచ్చు. ఈ క్రమం వల్లే కావచ్చు- ఆయన భారతదేశ కష్టజీవులైన ప్రజల కవిగా రూపుదిద్దుకున్నాడు. 

(ఏప్రిల్‌ 6 గద్దర్‌ 75వ పుట్టినరోజు)

సామిడి జగన్‌ రెడ్డి

85006 32551


Updated Date - 2022-04-04T06:57:50+05:30 IST