మీ పథకాలకో దండం..!

ABN , First Publish Date - 2022-05-21T08:44:51+05:30 IST

మా గడపలోకి వద్దు.. మా ఇంటికి రావొద్దు.. అయ్యా.. ఊర్లోకి అడుగుపెట్టొద్దు!.. సమస్యలు వింటాం.. స్కీమ్‌లు చెబుతాం అంటూ బయలుదేరిన వైసీపీ ప్రజాప్రతినిధులకు తప్పని చేదు అనుభవాలివీ.

మీ పథకాలకో దండం..!

అయ్యా..మా ఇంటికి రావొద్దు

ప్రకాశంలో ఓ మహిళ ఆగ్రహం

కనిగిరి ఎమ్మెల్యే బుర్రాకు నమస్కారం

శ్రీకాకుళంలో ఎమ్మెల్యే ఘెరావ్‌

గ్రామంలోకి రావొద్దంటూ నినాదాలు

‘గడప’లో తప్పని చేదు అనుభవాలు


(ఆంధ్రజ్యోతి, న్యూస్‌నెట్‌వర్క్‌)

మా గడపలోకి వద్దు.. మా ఇంటికి రావొద్దు.. అయ్యా.. ఊర్లోకి అడుగుపెట్టొద్దు!.. సమస్యలు వింటాం.. స్కీమ్‌లు చెబుతాం అంటూ బయలుదేరిన వైసీపీ ప్రజాప్రతినిధులకు తప్పని చేదు అనుభవాలివీ. వరుసగా శుక్రవారమూ ‘గడప గడపకు మన ప్రభుత్వం’లో నేతలకు చుక్కలు కనిపించాయి. ‘‘ఇక్కడ పెత్తనం చేసే వైసీపీ నాయకుల తీరుతో విసుగెత్తిపోయాం. మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం. మా ఇంటికి రావొద్దు.. మాకు మీ పఽథకాలు వద్దు... మీకో నమస్కారం’’ అంటూ ఓ మహిళ... ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌యాదవ్‌కి షాక్‌ ఇచ్చింది. ప్రకాశం జిల్లా కనిగిరి మండలంలోని గుడిపాడు గ్రామంలో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. ‘‘మీకు ఓట్లేసి కూడా ఇక్కడ ఓ వర్గానికి చెందిన వైసీపీ నాయకులవైఖరితో నానా ఇబ్బందులు పడుతున్నాం’’ అని ఎమ్మెల్యే ముఖం మీదే ఆమె అనేసింది.


అలా అనకూడదని.. జగన్‌పాలనలో రూ.1.5లక్షల లబ్ధి ప్రతి మహిళకు చేకూరిందని ఆమెకు ఎమ్మెల్యే సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. తమ గడపలోకి వచ్చిన ఎమ్మెల్యేను ఓ వృద్ధుడు నిలేశాడు. 30సెంట్ల భూమి ఆన్‌లైన్‌ చేసుకోవటానికి అధికారులు తిప్పించుకుంటున్నారని వాపోయాడు. సచివాలయాలకు టన్నులు టన్నులు కంకరు, సిమెంట్‌ వేస్తున్నారు... ఎందుకవి? ఆ కంకరు వాడి రోడ్లేసినా, ఇతర అభివృద్ధి పనులు చేసినా ఉపయోగంగా ఉంటుంది కదా! అని ఆ వృద్ధుడు అనడంతో ఎమ్మెల్యే కంగుతిన్నాడు.


ఊళ్లోకి వస్తే ఊరుకోం..

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌కు చేదు అనుభవం ఎదురైంది. జి.సిగడాం మండలం విజయరాంపురంలో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం పెట్టుకుని అక్కడకు వెళ్లారు. అయితే.. ఆయనను ‘గో బ్యాక్‌’ నినాదాలతో ఆ గ్రామ ప్రజలు అడ్డుకున్నారు. గ్రామంలోకి రావొద్దంటూ కారుకు అడ్డంగా నిలబడ్డారు. ఊళ్లోకి అడుగుపెడితే ఊరుకోబోమని హెచ్చరించారు. ‘ఏం ఉద్ధరించారని గ్రామంలో అడుగుపెడతారు? హామీలను విస్మరించారు. ఎన్నికల్లో గెలిపించినందుకు మా గ్రామాన్ని మీరేమి అభివృద్ధి చేశారు?’ అంటూ కిరణ్‌కుమార్‌ను నిలదీశారు. గ్రామస్థులతో పాటు వైసీపీకి చెందిన కొందరు కార్యకర్తలు కూడా ఎమ్మెల్యేపై ఆగ్రహం ప్రదర్శించారు. ఎమ్మెల్యే పోలీసుల సమక్షంలో రెండు మూడు ఇళ్లు సందర్శించి తన రెండోరోజు కార్యక్రమం హడావుడిగా ముగించారు. కాగా, జి. సిగడాం మండలం ఆనందపురంలో గురువారం జరిపిన కార్యక్రమంలోనూ కిరణ్‌కుమార్‌కు స్థానికులు చుక్కలు చూపించారు. 




పింఛను చాలడం లేదు..

‘‘అయ్యా పింఛన్‌ రూ. 3 వేలు ఇప్పించండీ. ఇప్పుడు ఇచ్చేది సరిపోవడం లేదు’’ అని పల్నాడు జిల్లాలో వృద్ధులు కోరుతున్నారు. ‘గడప గడప..’ కోసం తమ వద్దకు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడును ఈపూరు మండలంలోని బొమ్మరాజుపల్లి తండా, నాగార్జున తండా, భద్రుపాలెం గ్రామాల్లో ఈ సమస్యపై వృద్ధులు ఎమ్మెల్యేను నిలదీశారు. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలను పరిచయం చూస్తూ.. కరపత్రాలు పంచారు. 

Updated Date - 2022-05-21T08:44:51+05:30 IST