సోదరుడి మనసు నొప్పించిన యువతి.. ఆ తర్వాత షాకింగ్ నిర్ణయం.. ఏకంగా 434 మీటర్ల పొడవైన లెటర్ రాసి..

ABN , First Publish Date - 2022-06-30T14:09:52+05:30 IST

ఆ యువతికి తన సోదరుడి అంటే ఎనలేని ప్రేమ. ఆ సోదరుడికి కూడా తన సోదరి అంటే చాలా ఇష్టం. ఉద్యోగ రీత్యా వేరే ప్రాంతంలో ఇంటికి దూరంగా ఉంటున్న యువతి.. తాజాగా తన సోదరుడి మనసు నొప్పించింది. ఆ తర్వాత

సోదరుడి మనసు నొప్పించిన యువతి.. ఆ తర్వాత షాకింగ్ నిర్ణయం.. ఏకంగా 434 మీటర్ల పొడవైన లెటర్ రాసి..

ఇంటర్నెట్ డెస్క్: ఆ యువతికి తన సోదరుడి అంటే ఎనలేని ప్రేమ. ఆ సోదరుడికి కూడా తన సోదరి అంటే చాలా ఇష్టం. ఉద్యోగ రీత్యా వేరే ప్రాంతంలో ఇంటికి దూరంగా ఉంటున్న యువతి.. తాజాగా తన సోదరుడి మనసు నొప్పించింది. ఆ తర్వాత తాను చేసిన పొరపాటును గుర్తించింది. ఈ క్రమంలోనే ఆమె అనూహ్య నిర్ణయం తీసుకుంది. సోదరుడికి ఏకంగా 434 మీటర్ల పొడవైన లెటర్ రాసి పోస్ట్ చేసింది. దీంతో ఆమె చేసిన పని ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ అయింది. అయితే ఆమె సోషల్ మీడియాను ఉపయోగించకుండా.. తన తమ్ముడికి పాత పద్ధతిలో లెటర్ ఎందుకు రాసినట్టు అని ఆలోచిస్తున్నారా? అందుకు ఓ పెద్ద కారణమే ఉందడీ.. అదేంటో తెలియాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే.. 




కేరళలోని ఇడుక్కి జిల్లాకు చెందిన కృష్ణప్రియ అనే యువతి.. ఇంజినీరింగ్ పూర్తి చేసింది. ఆ తర్వాత ఆమె ఓ సంస్థలో ఉద్యోగం లభించింది. ఈ నేపథ్యంలో ఆమె తన ఇంటికి దూరంగా నివసిస్తోంది. ఆమెకు కృష్ణప్రసాద్ అనే 21ఏళ్ల సోదరుడు కూడా ఉన్నాడు. ఆమెకు అతడంటే  చాలా ఇష్టం. అతడికి కూడా తన సోదరి అంటే ఎనలేని ప్రేమ. ఇంటికి దూరంగా ఉంటున్న కృష్ణప్రియ.. వీలుదొరికినప్పుడల్లా తన సోదరుడికి ఫోన్ చేసి మాట్లాడేది. ప్రతి ఏటా ప్రపంచ సోదరుల దినోత్సవం రోజు కృష్ణ ప్రసాద్‌ను విష్ చేసేది. అయితే గత మే 24న పని ఒత్తిడి కారణంగా ఆమె తన సోదరుడికి శుభాకాంక్షలు చెప్పలేకపోయింది. అంతేకాకుండా కృష్ణప్రసాద్ ఫోన్ చేసినా, మెసేజ్ చేసినా.. అతడితో మాట్లాడలేకపోయింది. ఆఫీస్ పని పూర్తైన అనంతరం.. ఆమె తన సోదరుడిని సంప్రదించేందుకు ప్రయత్నించింది. అయితే అతడు అప్పటికే ఆమెను.. బ్లాక్‌లిస్ట్‌లో పెట్టినట్టు గుర్తించి షాకైంది. సోదరుడి మనసు నొచ్చుకున్నట్టు గ్రహించిన ఆమె.. కీలక నిర్ణయం తీసుకుంది.


దగ్గర్లోని స్టేషనరీ దుకాణానికి వెళ్లి, 15రోళ్ల బిల్లింగ్ పేపర్‌ను కొని తీసుకొచ్చింది. అనంతరం అతడికి క్షమాపణలు చెబుతూ.. ప్రేమను వ్యక్తం చేస్తూ 12 గంటలపాటు ఏకంగా 434 మీటర్ల లెటర్‌ను రాసింది. అనంతరం ఆ లెటర్‌ను ఓ బాక్సులో పెట్టుకుని పోస్ట్ ఆఫీస్‌కు వెళ్లింది. ఈ క్రమంలో పోస్ట్ ఆఫీస్ సిబ్బంది.. ఆమె తీసుకెళ్లిన బాక్సు బరువు 5.27 కిలోలు ఉన్నట్టు గుర్తించారు. కాగా.. సోదరి చేతితో రాసిన భారీ లెటర్‌ను అందుకున్న కృష్ణప్రసాద్.. ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టాడు. ఈ సందర్భంగా కృష్ణప్రియ మాట్లాడుతూ.. గిన్నీస్ వరల్డ్ రికార్డు కోసం అప్లై చేసినట్టు చెప్పింది. 


Updated Date - 2022-06-30T14:09:52+05:30 IST