పడి లేచిన సాహిత్య కెరటం

ABN , First Publish Date - 2020-12-14T06:48:13+05:30 IST

‘‘జీవితపు అస్థిరత గురించిన ఆలోచనలు ఈ విపత్కర కాలంలో నాలో బాగా బలపడ్డాయి. కానీ సమాజం దాని పోకడలో అది వెళుతూ...

పడి లేచిన సాహిత్య కెరటం

పడి లేచిన సాహిత్య కెరటం : పెరుమాళ్‌ మురుగన్‌

‘‘జీవితపు అస్థిరత గురించిన ఆలోచనలు ఈ విపత్కర కాలంలో నాలో బాగా బలపడ్డాయి. కానీ సమాజం దాని పోకడలో అది వెళుతూ ఉండడం చూసి ఆశ్చర్యంగా వుంది. ‘మాట్లాడడం తెలిసిన మృగం మానవుడు’ అన్నదానికి అతీతంగా ఏదీ లేదని అనిపించింది. ఈ కాలఘట్టంలో తమిళంలోని ప్రాచీన ఇతిహాసమైన ‘తిరుక్కురళ్‌’ని పూర్తిగా అవగాహన చేసుకోవాలనుకొని, అభ్యసిస్తూ ఉన్నా. ఆ ఒక్క పుస్తకమే జీవితమంతా చదువుతూ ఉండవచ్చునని అనిపిస్తోంది.’’


పెరుమాళ్‌ మురుగన్‌ గురించి ప్రత్యేక పరిచయం చేయనక్కరలేదు. కేవలం భారత దేశపు సాహిత్య లోకానికే కాదు ప్రపంచ సాహిత్యానికి కూడా పెరుమాళ్‌ మురుగన్‌ అంటే ఇవాళ ఎవరో తెలుసు. 2015లో పెరుమాళ్‌ మురుగన్‌ పెట్టిన ఫేస్‌బుక్‌ నోట్‌ సాహిత్య లోకాన్ని ఒక్క కుదుపు కుదిపేసింది. ‘‘రచయిత పెరుమాళ్‌ మురుగన్‌ చనిపోయాడు. అతను దేవుడు కాదు కాబట్టి అతని పునరుజ్జీవనం సాధ్యం కాదు. అతనికి పునర్జన్మ మీద విశ్వాసం కూడా లేదు. ఒక సాధారణ ఉపాధ్యా యుడుగా, పి. మురుగన్‌గా అతను జీవిస్తాడు. అతన్ని ఒంటరిగా వదిలేయండి.’’ 


మురుగన్‌ సాహిత్య ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితుల గురించి మళ్ళీ ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పుకోనక్కరలేదు. మురుగన్‌ ఒక బలవంతపు నిశ్శబ్దంలోకి నెట్టబడ్డాడు. స్వయం ప్రకటిత, నిషేధిత నిశ్శబ్దపు ప్రవాసంలో మొదటి కొన్ని నెలల పాటు అక్షరం ముక్క రాయలేకపోయాడు. మద్రాసు హైకోర్టు 2016 వేసవి కాలంలో చెన్నైలో ఇచ్చిన తీర్పు అటు పెరుమాళ్‌ మురుగన్‌కి, ఇటు సాహిత్య లోకానికి ఒక పెద్ద ఓదార్పు. తర్వాత నెమ్మదిగా తన తొలి ప్రేమ అయిన కవిత్వం వైపు మళ్ళాడు. పెరుమాళ్‌ మురుగన్‌ కవితల ఇంగ్లీష్‌ అనువాద పుస్తకం 2016లో బయటకు వచ్చింది. దాని పేరు ‘‘సాంగ్స్‌ ఆఫ్‌ ఏ కవర్డ్‌: పోయమ్స్‌ ఆఫ్‌ ఎక్సయిల్‌’’. ఈ సందర్భంగా పెరుమాళ్‌ మురుగన్‌ ఇలా అన్నాడు. ‘‘వెలుగుని చూసి తట్టుకోలేక, కన్నంలోకి దూరిన ఎలుక లాగా అనిపించిన సందర్భం. నాలో ఒక నిషేధం కూర్చొని ఉంది. అది నాలో పుట్టే ప్రతి పదాన్ని పరీక్షిస్తోంది. డిసెంబర్‌ 2014 నుంచి జూన్‌ 2016 వరకు ఒక్క వాక్యం కూడా రాయలేకపోయాను. నా హృదయపు వేళ్ళు మొద్దు బారి పోయాయి. అక్షరం చదవలేకపోయాను. చివరకు వార్తాపత్రిక కూడా. నా కళ్ళు పత్రికను చూేసవి కానీ ఒక్క పదం కూడా నా బుర్రలోకి ఎక్కలేదు. నిరక్షరాస్యుడి లాగా వార్తా పత్రికను చూసి మడిచి పక్కన పెట్టేేసవాడిని. ఈ ప్రపంచంలో చదవటం, రాయటం కాకుండా వేరే పనులు కూడా ఉన్నాయని నాకు నేను నచ్చ చెప్పుకున్నాను. మిగతా వాటి పట్ల నా దృష్టి మళ్లించటానికి నా ప్రయత్నం నేను చేశాను. కానీ అది విఫలమైంది. అప్పుడు నాకు ‘నడైపినం’ (నడిచే శవం) తమిళ పదం పూర్తిగా అర్థమైంది.’’ 


వివాదం తర్వాత పెరుమాళ్‌ మురుగన్‌ రాసిన నవల ‘పూనాచ్చి’ చదవటం పూర్తి కాగానే ఆయనతో మాట్లాడ కుండా ఉండలేకపోయాను. పూనాచ్చి ఎవరో చెప్పకుండానే చెప్పిన పెరుమాళ్‌ మురుగన్‌ నైపుణ్యానికి మరోసారి అభి నందించాలనిపించింది. కానీ అభినందనలు, మెచ్చుకోళ్ళు ఇవన్నీ పెరుమాళ్‌ మురుగన్‌ ముందు కృతకంగా అనిపిం చాయి. చివరకు ఈ ఇంటర్వ్యూ ప్రశ్నలు కూడా. కొత్తగా ఏం అడగాలి? పెరుమాళ్‌ మురుగన్‌ లాంటి రచయిత నుంచి ఆయన రచనలు కాకుండా కొత్త సమాధానాలు ఏం రాబట్టుకోవాలి? అయినా ఒక ప్రయత్నం ఇది. ఈ ముఖాముఖీ ఈ-మైల్‌ ద్వారా జరిగింది. 

కల్పనా రెంటాల

kalpana.rentala@gmail.com


రెండేళ్ల మౌనం తరవాత మళ్ళీ సాహిత్య రంగంలోకి అడుగుపెట్టడం ఎట్లా అనిపిస్తోంది మీకు? ఈ మధ్యలో మీ ఆలోచనల్లో గానీ, రచనా శైలిలో గానీ యేమైనా మార్పులు గమనిస్తున్నారా?

మళ్ళీ రచనా వ్యాసంగంలో అడుగు పెడతానని అనుకో లేదు. రచయితగా మళ్ళీ రాయవచ్చునని ప్రకటించినప్పుడు చేజారిపోయిన సొంత గూటికి తిరిగి వచ్చినట్లు అనిపిం చింది. కానీ ఆ సొంతిల్లు పాడుబడిపోయి, దుమ్ముధూళితో నిండి ఉంది. దానిని సరిచెయ్యడం కుదురుతుందా అన్న ఆందోళన. ప్రయత్నించాను. పాత ఇంటిని దక్కించుకోడం సాధ్యం కాలేదు. కానీ, ఇంకో కొత్త ఇల్లు దొరికింది. అది కూడా సంతోషంగానే ఉంది. 


నా ఆలోచనలలో ఎన్నో మార్పులు. ముందు రాయాలని అనుకున్న విషయాలన్నీ కనుమరుగయిపోయాయి. కొత్త విషయాలు, కొత్తగా చెప్పే పద్థతి అని ప్రయాణం చేయ వలసి వచ్చింది. కొత్తగా ఒక విషయంలో అడుగు పెడుతు న్నప్పుడు ఎదుర్కోవడానికి సవాళ్లు నాకోసం ఎదురు చూస్తు న్నాయి. అలా ఎదుర్కొనే ‘పూనాచ్చి’, ‘కళిముఖం’ మొదలైన నవలలను రాశాను.


మీ నవల గురించిన వివాదం- ఇన్నేళ్ల తరవాత ఆ మొత్తం ఎపిసోడ్‌ మీకు ఎట్లా అర్థమవుతోంది?

కొన్ని సాధారణ విషయాల వెనక సామాజిక సూత్రాలు బలీయంగా వుంటాయి అనీ, వాటిని తాకి చూడడానికే మన సమాజానికి ఇంకా కొన్ని శతాబ్దాలు పడుతుంది అనీ అర్థం చేసుకున్నాను. మతపరంగా, కులం ప్రాతిపదికగా కొన్ని భావనలు బలీయంగా పాతుకుపోయి ఉన్న ఈ సమాజాన్ని అర్థం చేసుకోవడంలో నేను పొరబడ్డానని స్వీయవిమర్శన చేసుకుంటున్నాను.


‘పూనాచ్చి’ నవలను ఉద్దేశ పూర్వకంగా allegory గా రాశారా? లేక, ఆ కథ పుట్టడమే అట్లా జరిగిందా?

‘పూనాచ్చి’ నవలను ఒక మేకపిల్ల కథగా మాత్రమే రాయాలని అనుకున్నాను. అలాగే వ్రాశాను. అందులో allegory’ ఉందనుకోవడం పాఠకుల దృక్పథం మాత్రమే. నేను అలా అనుకుని రాయలేదు. 


తమిళ రచయిత షణ్ముగ సుందరం అంటే మీకు చాలా అభిమానంలా వుంది. మీ తొలిదశ రచనల మీద ఆయన ప్రభావం యేమైనా వుందా?  

షణ్ముఖ సుందరం మా ప్రాంతానికి చెందిన రచయిత. ఆయన రచనల ద్వారా నా ముందు తరంవారి జీవితం గురించి తెలుసుకోవడం సాధ్యం అయ్యింది. ఆయన రాసిన జీవితం తాలూకు తదుపరి ఘట్టాన్ని రాయాలని అనిపిం చింది. నా పఠనం, శ్రద్ధ కాస్త పెరిగాయి అనుకున్నప్పుడు ఆయన రాయకుండా వదిలేసిన పూర్వీకుల జీవితం తాలూకు వేరే అంశాలను రాయాలని అనుకున్నాను, ఆ విధంగా ఆయన నా రచనా వ్యాసంగ ప్రయాణాన్ని దిశా నిర్దేశనం చేశారని చెప్పుకుంటాను. మొదట్లో మీరు కథలూ, కవిత్వం రాశారు. ఇప్పుడు నవలా రచయితగానే స్థిరపడినట్టు కనిపిస్తోంది....


ఇప్పుడు కూడా కవిత రాయడమే నాకు చాలా ఇష్టం. కవితలు రాయడం కొనసాగిస్తూనే ఉన్నాను. కథలు రాయడం ఎప్పుడూ ఒక సవాలుగానే ఉంటుంది. కవిత, కథ వీటి కన్నా నవలకు ఎక్కువగా గుర్తింపు ఉంటోంది. నవలను ఎక్కువ చదువుతారు. పాఠకుల దృక్పథమే నన్ను నవలా రచయితగా మార్చింది. ఇప్పటికీ ప్రాథమికంగా నేను కవినే అనుకుంటాను.


మీ నవలల్లో మీకు బాగా నచ్చింది?

నేను రాసిన ప్రతీ నవల ఒక్కొక్క విధంగా నాకు ఇష్ట మైనదే. అయినా కూడా నా బాల్యం, నా మనసుకు నచ్చిన ప్రదేశం ‘కూళ మాధారి’లో (Seasons of the palm) పూర్తిగా వ్యాపించి ఉన్నందు వల్ల, ఆ నవల నాకు చాలా ఇష్టమని చెబుతాను. ఆ నవలను ఎంతో శ్రద్ధతోనూ, అతీత మైన సృజనాత్మక మనోభావంతోనూ రాశాను. నేలను ఒక పాత్రగా మలిచి ప్రాణం పోయడానికి ప్రయత్నించాను. దానివెనక కొన్ని సంవత్సరాల శ్రమ వుంది. 


తమిళంలో ఇప్పుడు నవల స్థితి ఎట్లాంటిది?

ముందుగా చెప్పాల్సింది- తమిళంలో మంచి నవలలు వస్తున్నాయి. కృంగిపోవడం అనేది లేకుండా బలంగా కొనసాగుతూ ఉన్న తమిళ సాహితీ ప్రక్రియ నవల. ఇంతవరకూ బాహాటంగా తెలియని అనేక రకాలైన జీవన విధానాలు ప్రస్తుతం నవలకి కథలవుతున్నాయి. అనేక రకాల ప్రకృతి భూభాగాలతో నిండిన ప్రదేశం తమిళనాడు. వాటి తాలూకు దృశ్యాలు నవలలో ఇప్పుడు స్పష్టంగా కానవస్తున్నాయి. దళిత వాదం, స్ర్తీ వాదం, ప్రాంతీయ వాదం మొదలైన భావనలు నవలల్లో అంతర్గతంగా కదలాడుతున్నాయి. 


మీ జీవితంలోని కొన్ని భాగాలు మీ రచనల్లో కనిపిం చడం లేదన్న భావం మీకుందా? నేను చదివినంత మటుకు- మీ రచనల్లో ముస్లిం పాత్రలు కనిపించవు?

నిజమే. తక్కువ! ‘పూక్కుళి’ (pyre) నవలలో ముస్లిం కథాపాత్ర వస్తుంది. ‘మాదొరుభాగన్‌’ (One part woman) నవలలో కూడా ఒక చోట ముస్లిం పాత్ర వస్తుంది, ఇస్లాం, క్రైస్తవ మతాలకి చెందినవాళ్ళు నా జీవితంలో అంతగా లేరు. అదే కారణమై ఉంటుంది. నా జీవితంలోని అన్ని అంశా లనూ ఇప్పటికే రాసేశానని అనుకోవడం లేదు. ఇంకా చాలా అంశాలు రాయాల్సి ఉంది. వాటిని ఇప్పుడే బహిరంగం చేయడం ఇష్టం లేదు. వయసు మళ్ళుతున్నకొద్దీ అనుభ వాలు కూడా పెరుగుతాయి కదా! ఆ అనుభవాలను పరి కించిచూసే దృక్పథంలో వేర్వేరు కోణాలు వచ్చి చేరుతాయి. ఇతరుల అనుభవాలను తనదిగా చేసుకోగలిగిన విద్య అల వడుతుంది. అందువల్ల రాతలో మాత్రమే ముగిస్తే జీవితం కాదిది. 


మీ నవల ఎక్కడ మొదలవుతుంది? టైటిల్‌ దగ్గిరా? ఔట్‌లైన్‌తోనా? నేరుగా మొదటి అధ్యాయంతోనా?

నా రచనా వ్యాసంగం ఫలానా పోకడలోనే ఉంటుంది అని ఇతమిత్థంగా చెప్పడం కుదరదు. కొన్ని నవలలకు పేరు మొదట స్ఫురిస్తుంది. కొన్ని నవలలను రాసి ముగించిన తరువాత ప్రింటింగ్‌కి వెళ్ళేదాకా కూడా పేరు పెట్టడం కుదరదు. కొన్నిటికి రాస్తూ ఉండగానే పేరు తానుగా వచ్చి చేరుతుంది. అదే విధంగా ‘కూళ మాదారి’ నవలలో మధ్యలో ఒకచోటు నుంచి ప్రారంభించాను. ‘మాధొరుభాగన్‌’ నవలను మొదటి అధ్యాయం నుంచి ప్రారంభించాను. ‘కళిముఖం’ నవలకు ప్రారంభ వాక్యం కుదరక యాతనపడ్డాను. ఇలా రకరకాలు. అయినా కూడా ఒక నవల రాయడానికి ముందు ఒక చిన్న ప్రణాళిక వేసుకుంటాను. ఆ ప్రణాళికలో మార్పులు జరగవచ్చు. అయినా ప్రణాళిక లేనిదే మొదలు పెట్టను.


రచయితగా మీ లాక్‌ డౌన్‌ నుంచి ఇప్పటి కోవిడ్‌ లాక్‌డౌన్‌ దాకా ఒక రచయితగా మీకు ఎట్లా అని పిస్తోంది? ఎట్లాంటి పుస్తకాలు చదువుతున్నారు? ఈ కష్టకాలంలో మీ జీవన సరళి ఏమిటి? 

జీవితపు అస్థిరత గురించిన ఆలోచనలు ఈ విపత్కర కాలంలో నాలో బాగా బలపడ్డాయి. కానీ సమాజం దాని పోకడలో అది వెళుతూ ఉండడం చూసి ఆశ్చర్యంగా వుంది. ‘‘మాట్లాడడం తెలిసిన మృగం మానవుడు’’ అన్నదానికి అతీతంగా ఏదీ లేదని అనిపించింది. ఈ కాలఘట్టంలో తమిళంలోని ప్రాచీన ఇతిహాసమైన ‘తిరుక్కురళ్‌’ని పూర్తిగా అవగాహన చేసుకోవాలనుకొని, అభ్యసిస్తూ ఉన్నా. ఆ ఒక్క పుస్తకమే జీవితమంతా చదువుతూ ఉండవచ్చునని అనిపిస్తోంది. 


ప్రస్తుతం కళాశాలకి ప్రిన్సిపాలుగా ఉన్నందువల్ల ఉద్యోగం బరువు బాధ్యతలూ ఎక్కువే! పొరుగూరి ప్రయాణాలు లేనందు వల్ల ప్రశాంతంగా కూడా ఉంది. రోజూ కొంచెం సేపు వ్యవసాయపు పనులు చూసుకుంటాను. అది కూడా సంతోషంగానే ఉంది.

ఇంటర్వ్యూతోపాటు, పై కవితలను 

తమిళం నుంచి తెలుగులోకి అనువాదం చేసినవారు: 

గౌరీ కృపానందన్‌

ఈ విపత్కాలాన్ని ఉద్దేశిస్తూ పెరుమాళ్‌ మురుగన్‌ రాసిన మూడు కవితలు

జాడలు

వాళ్ళు 

ఊళ్ళకి వెళ్లి చేరిపోయారు

నీడలేని జాతీయ రహదారులలో

కాలుతున్న తారు రోడ్డు మీద

ముద్రించబడుతూ వెళ్ళిన అడుగుజాడలు

అలాగే ఉండిపోయాయి

రాక్షస టైరుల వల్ల కూడా చెరగని అడుగుజాడలు


గోడలు

గట్టిగా బిగించబడిన 

ఇంటి గోడలు జరుగుతూ జరుగుతూ

సమాధి గోడలుగా మారిపోయాయి

ఇకపై అంతే

జీవించి ముగించేసావు

అంటోంది అశరీరి


విషం

ఎన్నో రోజులు గడిచిపోయాయి

స్నేహితుల చేయిపట్టుకుని నడిచి

బంధువుల ముఖం చూసి మాట్లాడి 

ఎక్కడో దూరంగా

చెరసాలగా మారిన నగరంలో నివసిస్తున్న

గారాల కుమార్తె గొంతు మాతమే వినిపిస్తోంది

నా శ్వాస చుట్టూ తిరుగుతూ తిరుగుతూ

విషంగా మారి కాటు వేస్తోంది. 

Updated Date - 2020-12-14T06:48:13+05:30 IST