స్వాతంత్ర సమరంలో వెన్ను చూపని యోధుడు

ABN , First Publish Date - 2022-08-10T04:24:56+05:30 IST

స్వాతంత్య్ర పోరాటంలో.. ఓ పక్క బ్రిటీష్‌ వారి నుంచి తీవ్ర నిర్భంధం... మరోపక్క కేసులు.. జైలుశిక్ష.. అయినా.. వెన్ను చూపకుండా పోరాడిన యోధుడు యర్రపురెడ్డి ఆదినారాయణరెడ్డి..

స్వాతంత్ర సమరంలో వెన్ను చూపని యోధుడు
టంగుటూరు ప్రకాశం పంతులు పక్కనే ఉన్న యర్రపురెడ్డి ఆదినారాయణరెడ్డి

ఆదర్శం యర్రపురెడ్డి ఆదినారాయణరెడ్డి


(రాయచోటి - ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర పోరాటంలో.. ఓ పక్క బ్రిటీష్‌ వారి నుంచి తీవ్ర నిర్భంధం... మరోపక్క కేసులు.. జైలుశిక్ష.. అయినా.. వెన్ను చూపకుండా పోరాడిన యోధుడు యర్రపురెడ్డి ఆదినారాయణరెడ్డి.. ఉప్పు సత్యాగ్రహ దీక్ష చేయడంతో.. మూడు నెలల పాటు జైలుశిక్షను అనుభవించారు. 1942 నుంచి 1944 వరకు వేలూరు, తంజావూరు జైళ్లలో బ్రిటీష్‌ వాళ్లు నిర్బంధించారు. అయినా మొక్కవోని దీక్షతో స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్నారు. జిల్లాలో స్వాతంత్య్ర పోరాటం ఉధృతంగా సాగడానికి క్రియాశీలకంగా పనిచేశారు. మహాత్మాగాంధీ, సుభా్‌షచంద్రబోస్‌, లాల్‌బహదూర్‌శాస్త్రిలతో కలిసి స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. స్వాతంత్ర్యానంతరం పార్లమెంటు సభ్యుడిగా, రాష్ట్ర శాసనమండలి సభ్యుడిగా విశేష సేవలందించారు. కాంగ్రెస్‌ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌ గాంధీ మూడు తరాలతోనూ కలిసి పని చేశారు. అన్నమయ్య జిల్లా సుండుపల్లె మండలం రెడి ్డవారిపల్లెలో 1915 అక్టోబరు నెలలో రామలక్షుమ్మ, నాగిరెడ్డిలకు ఆదినారాయణరెడ్డి జన్మించారు. బసమ్మను పెండ్లి చేసుకున్నారు. ఈయనకు నలుగురు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. సుండుపల్లె ప్రాథమిక పాఠశాలలో ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. నందలూరు ఉన్నత పాఠశాలలో ప్రాథమికోన్నత విద్య, మదనపల్లెలో ఇంటర్మీడియట్‌ చదివారు. మద్రాసులోని విశ్వవిద్యాలయంలో డిగ్రీ పట్టా పొందారు. మహాత్మాగాంధీ స్ఫూర్తితో గాంధేయమార్గంలోనే స్వాతంత్య్రం కోసం పోరాడారు. లాఠీదెబ్బలు సైతం తిన్నా.. అజ్ఙాతవాసం గడిపినా.. సత్యాగ్రహం చేసినా.. తాను నమ్ముకున్న అహింసావాదాన్ని చివరికంటా కొనసాగించారు. ఉద్యమంలో భాగంగా విజయవాడ నుంచి రహస్య సర్క్యులర్‌ పంపించి జిల్లా వ్యాప్తంగా పంపగలిచిన మొదటి కార్యకర్తగా పేరుపొందారు. మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డితో పాటు.. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న అనేకమంది జాతీయ, అంతర్జాతీయ స్థాయి నాయకులతో పరిచయాలు ఉన్నాయి. అచార్య ఎన్‌జీ రంగా, టంగుటూరు ప్రకాశం పంతులు, తిమ్మారెడ్డి, సర్థార్‌ గౌతు లచ్చన్నల పరిచయంతో ఉమ్మడి వైఎ్‌సఆర్‌ జిల్లాలో ప్రజల బాగు కోసం కృషి చేశారు. 1940-41 వరకు ఉప్పు సత్యాగ్రహ ఉద్యమాన్ని ఉమ్మడి కడప జిల్లాలో నిర్వహించి.. అప్పట్లో రూ.500 జరిమానా.. మూడు నెలల పాటు వేలూరులో జైలుశిక్షను అనుభవించారు.

    1942లో క్విట్‌ ఇండియా ఉద్యమంలో జిల్లాలో ప్రజలందరినీ సమీకరించి పోరాటం ఉధృతం చేశారు. యర్రపురెడ్డి ఆదినారాయణరెడ్డి స్వాతంత్ర్యానంతరం అనేక పదవులను అలంకరించారు. శానసమండలి, పార్లమెంటు సభ్యుడిగా పనిచేశారు. ఐక్యరాజ్యసమితిలో భారతదేశ ప్రతినిధి బృంద సభ్యుడిగా పాల్గొన్నారు.  రాష్ట్రపతి పదవికి ఇందిరాగాంధీ బలపరిచిన వారికి మన రాష్ట్రం నుంచి మద్దతు సాధించిన క్రియాశీలి, రెండు పర్యాయాలు పార్లమెంట్‌ సభ్యునిగా, భారత జాతీయ కాంగ్రెస్‌ సభ్యునిగా, రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించారు. రాయచోటి నుంచి మనుపటి మద్రాసు శాసనసభ, ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ్యుడిగా అలాగే ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి ద్వారా ఎమ్మెల్సీగా కూడా ఎన్నికయ్యారు. అదినారాయణరెడ్డి డీసీసీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఏర్పాటులో ఆయన ప్రధాన పాత్ర పోషించారు.

    కడప ఆజాద్‌హింద్‌ తెలుగు వార పత్రికకు సంపాదకులుగా ఉన్నారు. 1940-49 వరకు కడప జిల్లా కాంగ్రెస్‌  కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1952లో ఆహార సంక్షోభం ఏర్పడినప్పుడు, కరువు సమయంలో సహాయ కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగా రాయచోటికి అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ, సి.రాజగోపాలాచారిలను ఆహ్వానించారు. 1969లో ఏఐసీసీ సభ్యుడిగా ఎంపికయ్యారు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీతో సాన్నిహిత్యం వల్ల ఆయన ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీలో ముఖ్యునిగా ఉన్నారు. 1965-69 జిల్లా సహకార కేంద్ర బ్యాంక్‌ అధ్యక్షుడిగా పనిచేశారు. 1952 నుంచి 1954 వరకు మద్రాసు రాష్ట్రంలోని రాయచోటి నుంచి శాసనసభ్యునిగా, 1954 నుంచి 1962 వరకు ఆంధ్రప్రదేశ్‌లోని రాయచోటి నుంచి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. 1964, 1982లో ఆంధ్రప్రదేశ్‌ నుంచి పార్లమెంట్‌, రాజ్యసభ సభ్యునిగా రెండుసార్లు ఎన్నికయ్యారు. జూన్‌ 1974లో ఆంధ్రప్రదేశ్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ సభ్యుడిగా ఎన్నికయ్యారు. దేశంలోనే కాకుండా ఇతర దేశాలు ఈజిప్ట్‌, సూడాన్‌, అల్జీరియా, ఐరోపా, ఆఫ్రికా దేశాల్లో పర్యటించిన నాయకుడు. నాటి భారత రాష్ట్రపతి డాక్టర్‌ శంకర్‌ దయాల్‌శర్మ నుంచి తామ్రపత్రం అందుకున్నారు. 2002 జూన్‌ 8వ తేదీ ఆయన మరణించారు.



Updated Date - 2022-08-10T04:24:56+05:30 IST