చివరి బంతికి గట్టెక్కారు

ABN , First Publish Date - 2020-10-16T10:11:16+05:30 IST

ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో పంజాబ్‌ మేల్కొంది. ఏడు మ్యాచ్‌ల్లో ఆరు ఓటములతో రేసు

చివరి బంతికి గట్టెక్కారు

పంజాబ్‌కు ఓ విజయం

 రాణించిన రాహుల్‌, మయాంక్‌


12 బంతుల్లో పంజాబ్‌కు 7 పరుగులు కావాల్సిన వేళ.. బెంగళూరు బౌలర్లు పట్టు బిగిస్తూ మ్యాచ్‌ ఫలితాన్ని చివరి బంతి వరకు తీసుకెళ్లారు. అయితే పూరన్‌ సిక్సర్‌తో జట్టుకు ఊపిరిలూదాడు. మరోవైపు లేటుగా ఎంట్రీ ఇచ్చినా క్రిస్‌ గేల్‌ అభిమానులను మురిపించే ఇన్నింగ్స్‌ ఆడాడు. క్రీజులో నిలదొక్కుకునేందుకు కాస్త ఓపిక పట్టిన ఈ యూనివర్సల్‌ బాస్‌.. ఆ తర్వాత భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. అటు కెప్టెన్‌ రాహుల్‌, మయాంక్‌ కీలక ఇన్నింగ్స్‌ ఆడడంతో పంజాబ్‌ కూడా ప్లేఆఫ్స్‌ రేసులో నిలిచింది. ఇక ఆర్‌సీబీ బ్యాటింగ్‌, బౌలింగ్‌ ఈసారి ఆశించిన స్థాయిలోలేదు..


షార్జా: ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో పంజాబ్‌ మేల్కొంది. ఏడు మ్యాచ్‌ల్లో ఆరు ఓటములతో రేసు నుంచి వైదొలిగే స్థితిలో ఉన్న వేళ.. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుపై 8 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. రాహుల్‌ (49 బంతుల్లో 1 ఫోర్‌, 5 సిక్సర్లతో 61 నాటౌట్‌), గేల్‌ (45 బంతుల్లో 1 ఫోర్‌, 5 సిక్సర్లతో 53) అదరగొట్టారు. గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్లకు 171 పరుగులు సాధించింది. విరాట్‌ (39 బంతుల్లో 3 ఫోర్లతో 48) ఫర్వాలేదనిపించగా చివర్లో మోరిస్‌ (8 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్సర్లతో 25 నాటౌట్‌) వేగం చూపాడు. ఎం.అశ్విన్‌, షమిలకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో పంజాబ్‌ 20 ఓవర్లలో 2 వికెట్లకు 177 పరుగులు చేసి నెగ్గింది. మయాంక్‌ (25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 45) ఆకట్టుకున్నాడు. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా కేఎల్‌ రాహుల్‌ నిలిచాడు. 

ఎలాంటి ఒత్తిడి లేకుండా..

తొలి రెండు ఓవర్లలో నాలుగు పరుగులే చేసిన పంజాబ్‌ ఆ తర్వాత రాహుల్‌, మయాంక్‌ల జోరుకు భారీగా పరుగులు రాబట్టింది. కావాల్సిన రన్‌రేట్‌ను దృష్టిలో ఉంచుకుంటూ ఈ జోడీ సమన్వయంతో ఆడి తొలి వికెట్‌కు 78 పరుగులు అందించింది. నాలుగో ఓవర్‌లో ఓ సిక్స్‌, రెండు ఫోర్లతో మయాంక్‌ బ్యాట్‌ ఝుళిపించగా రాహుల్‌ తర్వాతి ఓవర్‌లో సిక్సర్‌ బాదాడు. ఆ తర్వాత కూడా వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీగా మలచడంతో పవర్‌ప్లేలో జట్టు 56 పరుగులు చేసింది. కానీ 8వ ఓవర్‌లో మయాంక్‌ను చాహల్‌ బౌల్డ్‌ చేయడంతో యూనివర్స్‌ బాస్‌ గేల్‌ క్రీజులోకి వచ్చాడు.  ఆ తర్వాత మూడు ఓవర్లపాటు ఇన్నింగ్స్‌లో ఒక్క ఫోర్‌ కూడా రాలేదు. 12వ ఓవర్‌లో రాహుల్‌ రెండు సిక్సర్లతో జట్టు స్కోరు వంద దాటింది. అటు తొలి ఏడు పరుగులు సాధించేందుకు 15 బంతులు ఆడిన గేల్‌ 13వ ఓవర్‌లో ఎట్టకేలకు బ్యాట్‌ ఝుళిపిస్తూ రెండు సిక్సర్లు బాదాడు. అయితే 14వ ఓవర్‌లో గేల్‌ రివ్యూ ద్వారా ఎల్బీ అవుట్‌ నుంచి బతికిపోగా.. రాహుల్‌ 37 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. సిరాజ్‌ వేసిన ఇన్నింగ్స్‌ 16వ ఓవర్‌లో గేల్‌ 4,6.. రాహుల్‌ సిక్సర్‌తో జట్టు 20 రన్స్‌ రాబట్టింది. 

చివర్లో ఉత్కంఠ

నాలుగు ఓవర్లలో లక్ష్యం 26 పరుగులుండగా గేల్‌ విశ్వరూపమే చూపాడు. సుందర్‌ ఓవర్‌లో రెండు సిక్సర్లు బాదిన తను 37 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. అయితే చివరి 18 బంతుల్లో 11 పరుగులు కావాల్సి ఉండగా రెండు ఓవర్లలో ఆర్‌సీబీ ఒక్క బౌండరీ కూడా ఇవ్వలేదు. ఇక ఆఖరి ఓవర్‌ (చాహల్‌)లో రెండు పరుగుల కోసం పంజాబ్‌ ఐదు బంతులాడి ఒక్క రన్‌ మాత్రమే చేసి గేల్‌ వికెట్‌ను కోల్పోయింది. అయితే ఉత్కంఠను అధిగమిస్తూ పూరన్‌ (6 నాటౌట్‌) సిక్సర్‌ బాది పంజాబ్‌కు రిలీ్‌ఫనిచ్చాడు. 

బౌలర్ల ఆధిపత్యం

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరును పంజాబ్‌ బౌలర్లు భారీ షాట్లు ఆడకుండా నిలువరించారు. దీంతో జట్టు కనీసం 150 స్కోరు కూడా చేయడం కష్టమేననిపించింది. అటు డివిల్లీర్స్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ మార్చిన ఆర్‌సీబీ వ్యూహం పూర్తిగా బెడిసికొట్టింది. కానీ చివరి ఓవర్‌లో మోరిస్‌ విధ్వంసంతో జట్టు సవాల్‌ విసిరే స్కోరును అందుకుంది.  అంతకుముందు ఓపెనర్లు ఫించ్‌ (20), దేవ్‌దత్‌ (18) ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. ఇక కోహ్లీ వచ్చీ రావడంతోనే ఫోర్లతో జవాబిచ్చాడు. దీంతో పవర్‌ప్లేలో జట్టు 57 పరుగులు సాధించింది. కానీ ఏడో ఓవర్‌లో ఫించ్‌ను స్పిన్నర్‌ మురుగన్‌ అశ్విన్‌ క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. ఈ దశలో లెగ్‌ స్పిన్‌ను ఎదుర్కోవడంలో పేలవ రికార్డున్న డివిల్లీర్స్‌ను కాకుండా వాషింగ్టన్‌ సుందర్‌ (13)ను బ్యాటింగ్‌కు దించారు. కానీ తను 11వ ఓవర్‌లో క్యాచ్‌ అవుటయ్యాడు. దీనికి తోడు ఎప్పటిలాగే మధ్య ఓవర్లలో ఆర్‌సీబీ తడబడడంతో పరుగులు నెమ్మదించాయి. 6-14 ఓవర్ల మధ్య  రెండు ఫోర్లు మాత్రమే నమోదయ్యాయి. ఈ ఒత్తిడిని తగ్గించేలా 15వ ఓవర్‌లో శివమ్‌ దూబే రెండు భారీ సిక్సర్లతో 19 రన్స్‌ రాబట్టాడు. అయితే తర్వాతి ఓవర్‌లోనే జోర్డాన్‌ అతడిని పెవిలియన్‌కు చేర్చాడు. 

మోరిస్‌ మోత: డివిల్లీర్స్‌ (2) క్రీజులోకి అడుగుపెట్టే సమయానికి కేవలం 18 బంతులే మిగిలి ఉన్నాయి. అయితేనేం.. కోల్‌కతాపై విరుచుకుపడినట్టుగానే బ్యాట్‌ ఝుళిపిస్తాడనుకున్నా ఏబీలో  ఆ ఆత్మవిశ్వాసం కనిపించలేదు. ఐదు బంతులే ఎదుర్కొన్న అతడు ఇన్నింగ్స్‌ 17వ ఓవర్‌లో షమికి చిక్కడంతో ఆర్‌సీబీ షాక్‌తింది. ఇక అటు నిలకడగా ఆడుతున్న కోహ్లీ కూడా అదే ఓవర్‌లో అవుటయ్యాడు.  చివరి ఆరు బంతుల్లో క్రిస్‌ మోరిస్‌ రెండు సిక్సర్లు, ఓ ఫోర్‌ బాదగా, ఉడాన (10 నాటౌట్‌) ఓ సిక్సర్‌ సహాయంతో ఆ జట్టు 24 రన్స్‌ రాబట్టింది. దీంతో స్కోరు 147 నుంచి ఒక్కసారిగా 171 పరుగులకు చేరడంతో బెంగళూరు ఊపిరిపీల్చుకుంది. 


200 బెంగళూరు తరఫున విరాట్‌ కోహ్లీకిది 200వ మ్యాచ్‌. ఇందులో ఐపీఎల్‌లో 185.. చాంపియన్స్‌ లీగ్‌ టీ20లో 15 మ్యాచ్‌లున్నాయి.


స్కోరు బోర్డు

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు: ఆరోన్‌ ఫించ్‌ (బి) ఎం.అశ్విన్‌ 20; దేవ్‌దత్‌ (సి) పూరన్‌ (బి) అర్ష్‌దీప్‌ సింగ్‌ 18; కోహ్లీ (సి) రాహుల్‌ (బి) షమి 48; సుందర్‌ (సి) జోర్డాన్‌ (బి) ఎం.అశ్విన్‌ 13; దూబే (సి) రాహుల్‌ (బి) జోర్డాన్‌ 23; డివిల్లీర్స్‌ (సి) హూడా (బి) షమి 2; మోరిస్‌ (నాటౌట్‌) 25; ఉడాన (నాటౌట్‌) 10; ఎక్స్‌ట్రాలు: 12; మొత్తం: 20 ఓవర్లలో 171/6; వికెట్ల పతనం: 1-38, 2-62, 3-86, 4-127, 5-134, 6-136; బౌలింగ్‌: మ్యాక్స్‌వెల్‌ 4-0-28-0; షమి 4-0-45-2; అర్ష్‌దీప్‌ సింగ్‌ 2-0-20-1; రవి బిష్ణోయ్‌ 3-0-29-0; ఎం.అశ్విన్‌ 4-0-23-2; జోర్డాన్‌ 3-0-20-1.

కింగ్స్‌ లెవన్‌ పంజాబ్‌: కేఎల్‌ రాహుల్‌ (నాటౌట్‌) 61; మయాంక్‌ అగర్వాల్‌ (బి) చాహల్‌ 45; క్రిస్‌ గేల్‌ (రనౌట్‌/పడిక్కల్‌/డివిల్లీర్స్‌) 53; నికోలస్‌ పూరన్‌ (నాటౌట్‌) 6; ఎక్స్‌ట్రాలు: 12; మొత్తం: 20 ఓవర్లలో 177/2; వికెట్ల పతనం: 1-78, 2-171; బౌలింగ్‌: మోరిస్‌ 4-0-22-0; నవదీప్‌ సైనీ 4-0-21-0; యజ్వేంద్ర చాహల్‌ 3-0-35-1; ఇసురు ఉడాన 2-0-14-0; సిరాజ్‌ 3-0-44-0; సుందర్‌ 4-0-38-0. 

Updated Date - 2020-10-16T10:11:16+05:30 IST