ఒక బహుముఖ సారాంశం

ABN , First Publish Date - 2022-07-04T06:46:52+05:30 IST

మన సాహిత్యకారులు నెత్తికెత్తుకున్న భావజాలం మూలాన కాబోలు తెలుగులో దోస్తయెవ్‌స్కీ, ముఖ్యమైన రచనలు చాలా కాలంపాటు అనువాదం కాకుండా ఉండిపోయాయి...

ఒక బహుముఖ సారాంశం

మన సాహిత్యకారులు నెత్తికెత్తుకున్న భావజాలం మూలాన కాబోలు తెలుగులో దోస్తయెవ్‌స్కీ, ముఖ్యమైన రచనలు చాలా కాలంపాటు అనువాదం కాకుండా ఉండిపోయాయి. తెలుగువాళ్ళకి టాల్‌స్టాయ్‌ తెలిసినంత బాగా దోస్తయెవ్‌స్కీ తెలియడు.


టాల్‌స్టాయ్‌ రచనల్లో నిర్దిష్టమైన శైలీశిల్పాలతో ఒక విస్తృత సంపూర్ణ కళారూపం కనిపిస్తే, దోస్తయెవ్‌స్కీ రచనలు మానవుడి మనస్తత్వంలోని అవకతవకలతోపాటు వాటి మూలంగా సంభవించిన వ్యక్తి విచ్ఛిన్నత, నేరం, శిక్ష, మనుషుల బలహీనతలు, చంచలత్వం వీటి మూలంగా ఛిద్రమైన ఒక విధ్వంస మనిషి అంతరంగాన్ని మన ముందుంచుతాయి. ఆయన రచనల్లో మనుషుల భావోద్వేగాలు, instincts, అనుకోని ఆవేశంలో వచ్చే అసంధర్భ ప్రేలాపనలు నేరాలకూ, సంఘటలనకూ కారణాలవుతాయి. అందుచేతనే కావచ్చు దోస్తయెవ్‌స్కీ రచనల్ని మనస్తత్వశాస్త్ర రచనలంటారు.


దోస్తయెవ్‌స్కీ రచనల్లో పెద్దదీ చివరిదీ అయిన The Karamazov Brothers నవల మహా అయితే కరమజోవ్‌ కుటుంబం మొదటిసారి కలవడం మొదలుకుని ద్మీత్రి కరమజోవ్‌ అరెస్టయ్యేదాకా రెండుమూడు రోజుల వ్యవధిలో మాత్రమే జరుగు తుంది. ఈ రెండు మూడు రోజుల కాల నిడివిలో జరిగే కథ మొత్తం కలుపుకొని- పాత్రల పూర్వాపరాలు, కలయికలు, కథతో సంబంధం లేనట్లు అనిపించే ఫాదర్‌ జోసిమా జీవితం, ఆయన ఆధ్యాత్మిక ప్రసంగాలు, కోల్యా, ఇల్యూష ఉదంతాలు, అన్నదమ్ముల సుదీర్ఘ సంభాషణలు, ఫ్యోదోర్‌ పావ్లోవిచ్‌ కరమజోవ్‌ హత్య, చివరి కోర్టు సీనులు- ఇవన్నీ కలుపుకుని సుమారు వెయ్యి పేజీల బృహత్‌ నవల అయింది. దేనికదే ప్రధానాంశం అనిపిస్తూ, ప్రత్యేకించి ఏ ఒక్కదాని గురించీ చెప్పనట్లనిపిస్తూ, ఒకదానితో ఒకటి సంబంధం ఉందనేట్లు అనిపిస్తూ, చదవడం పూర్తయ్యాక హృదయం బరువవు తుంది. అనేక క్రైస్తవ ఆధ్యాత్మిక చర్చలు, పాత్రల చేత దోస్తయెవ్‌స్కీనే చెప్పించినట్లుండే తాత్విక ప్రతిపాదనలు, వాటిని నిరూపిస్తున్న ట్లుండే సంఘటనలు... మొత్తంగా రచయిత దేని గురించి చెబుతు న్నాడా అన్నది అర్థం చేసుకోవడం సంక్లిష్టమైన విషయం. ఇన్ని పొరలను దాచుకున్న ఈ నవల సాధించిన విజయం ఇదే అనిపి స్తుంది. దోస్తయెవ్‌స్కీ మిగతా రచనల్లాగా ఈ కరమజోవ్‌ బ్రదర్స్‌ నవల సారాంశం సులువుగా అర్థం కాదు. నవలలోని సంఘట లన్నింటినీ ఒక చట్రంలోంచి చూడ్డానికి అనువుగా ఉండదు.


ఒకరకంగా The Karamazov Brothers కూడా దోస్తయెవ్‌స్కీ అంతకుముందు రాసిన Crime & Punishment లాంటిదే. ‘క్రైమ్‌ అండ్‌ పనిష్మెంట్‌’లో ఒక హత్య, దాని తరవాత జరిగే నేరస్తుడి మానసిక స్థితిగతులు, అతడు పడే పశ్చాత్తాప ప్రతిఫలనా లను చూపిస్తే, ఇందులో ఒక హత్యకి కారణమైన అనేక పాత్రల మానసిక స్థితిగతులు మన ముందుంచుతాడు. ఫాదర్‌ జోసిమా చనిపోయిన అన్నయ్య మార్కెల్‌ ‘‘మనమంతా అందరికీ బాధ్యు లమే’’ అని చెప్పినట్లుగా, నవలలో పావ్లోవిచ్‌ కరమజోవ్‌ హత్యకి ఇందులోని ప్రధాన పాత్రలన్నీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో బాధ్యులని ఋజువు చేస్తున్నట్టుగా కథనం సాగుతుంది. తన అన్న మార్కెల్‌ మాటల్ని ఫాదర్‌ జోసిమా ఇలా విడమర్చి చెబుతాడు. ‘‘అతడు తనను క్షమించమని పక్షులను అడిగేవాడు. అది అర్థం లేనిదిగా అనిపించవచ్చు. కానీ అది సత్యమే. ఎందుకంటే సమస్త విశ్వం ఒక సముద్రం వంటిది. అన్నీ తేలుతూ ఒకదానితో ఒకటి కలుస్తూ ఉంటాయి. ఒకచోట మనం తాకితే అది భూమిపై మరొకచోట కదలిక తీసుకువస్తుంది.’’ (ఈ వ్యాసంలోని కొటేషన్స్‌ అన్నీ ఈ నవలకు అరుణా ప్రసాద్‌ చేసిన తెలుగు అనువాదం నుంచి తీసుకున్నవి.)


దోస్తయెవ్‌స్కీ మానవుడి ఆత్మసాక్షిని, భగవంతుడి ముందు అతడి ఒప్పుకోలునీ నమ్ముకున్నాడు. ఆయన సృష్టించిన పాత్రలన్నీ నేరం జరిగాక అపరాధభావంతో పశ్చాత్తాపపడుతుంటాయి. నేరం జరగ డానికి కారణమైన తమ అసహాయత, ఆత్మన్యూనత వాళ్ళను దహించివేస్తుంటాయి. వాళ్ళ మానసిక ప్రపంచంలో విపరీతమైన మార్పులు చోటుచేసుకుంటాయి. నేరానికి ముందు నేరం జరిగిన తరవాత వాళ్ళ ప్రవర్తనలో చెప్పలేనంత తేడా ఉంటుంది. నేరస్థుడు తన అంతరంగాన్ని తప్పించుకోలేడు. అందుచేతనే ఈ నవలనిండా మనుషుల మానసిక కల్లోలాలు, పాప చింతనలు, పశ్చాత్తాపాలు.


భగవంతుడి ముందు నేరం ఒప్పుకోలుకి (Confession) దోస్త యెవ్‌స్కీ చాలా ప్రాముఖ్యత ఇస్తాడు. ఉదాహరణకి యవ్వనంలో సైన్యంలో ఉన్నప్పుడు ఫాదర్‌ జోసిమా (ఎల్డర్‌) ఒకరిని ద్వంద యుద్ధానికి ఉసిగొల్పి, ఆ యుద్ధానికి ముందురోజు తన ఆర్డర్లీనీ కొట్టి, తెల్లవారేసరికి జరిగినదానికి పశ్చాత్తాపపడి, ఆ రోజు జరగ బోయే ద్వందయుద్ధం నుంచి విరమించుకుని, ఉద్యోగానికి రాజీ నామా చేసి ఒక సన్యాసిగా మారిపోవడం కూడా దేవుడి ముందు ఒక ఒప్పుకోలు లాంటిదే. అది చూసి ఫాదర్‌ జోసిమాతో స్నేహం పెంచుకుని గతంలో తను చేసిన హత్యానేరాన్ని ఒప్పుకుంటాడు ‘రహస్య అతిథి’. ఒకరి ఒప్పుకోలు అలా మరొకరి ఒప్పుకోలుకి కారణమవుతుంది. అందుచేతనే ‘‘గోధుమ కంకి నేల రాలి మరణించనంతవరకు అది ఒక్కటే జీవిస్తుంది. కానీ నేల రాలి మరణించిన తరవాత యింకా ఎక్కువ ఫలాలకు జీవాన్నిస్తుంది’’ అనే బైబిల్‌ వాక్యాన్ని ‘రహస్య అతిథి’కి చెబుతాడు ఫాదర్‌ జోసిమా.


ఇదంతా ఎలా సాధ్యం? ‘‘నీకు నువ్వు అబద్ధం చెప్పుకోకు. తనకు తాను అబద్ధం చెప్పుకునే వ్యక్తి అసత్యాలు వినీ వినీ చివరికి తన లోనూ, తన చుట్టూతా ఉన్న సత్యమేమిటో తెలుసుకోలేని స్థితికి వస్తాడు. అలా చెప్పుకుంటే నీలో ఉన్న సత్యాన్ని, నీ చుట్టూ ఉన్న సత్యాన్ని నువ్వు చూడలేవు. నీ మీద నీవు గౌరవాన్ని కోల్పోతావు, తద్వారా ప్రేమరాహిత్యం ఏర్పడుతుంది’’ అంటాడు ఫాదర్‌ జోసిమా.


దోస్తయెవ్‌స్కీ ఏ ఇతర రచనల్లో కనిపించనట్లు ఈ కరమజోవ్‌ బ్రదర్స్‌లో లోతైన ఆధ్యాత్మిక చర్చలు, బైబిల్‌ వాక్యాలూ ఉంటాయి. దీంతో ఆయన Religious Writerగా కూడా పిలవబడ్డాడు. అయితే ఈ నవలలో ఆయన ఆస్తికుడా, నాస్తికుడా- ఏ వైపు ఉన్నాడన్నది కనిపించదు. మానవుడి అంతరంగంలోని అపరాధభావం తాలూకు ఆటుపోట్లని, తనను తాను ప్రక్షాళన చేసుకోడానికి అంతరాత్మ పడే సంఘర్షణని మనముందు పెడతాడు. ఈ రకమైన పెనుగులాటలో సగటు మానవుడికి నిజమైన ఆసరా అయ్యేది మతం మాత్రమే అని ఆయన సంపూర్ణంగా నమ్మినట్లు మనకు అర్థమవుతుంది.


దోస్తయెవ్‌స్కీ మతపరమైన ఆలోచనలను ఫాదర్‌ జోసిమా గురించి చెప్పిన అధ్యాయంలో చూడొచ్చు. ఫాదర్‌ జోసిమా రష్యన్‌ క్రైస్తవ సన్యాసుల గురించి చెబుతూ ‘క్రైస్తవ సన్యాసుల వలనే రష్యాకి విముక్తి లభించబోతుంది’ అంటాడు:


‘‘ప్రస్తుత సమాజంలో సన్యాసి అంటే ఎగతాళిగానూ నిందగానూ వాడబడుతుంది. వాళ్ళంటే అసహ్యం పెరుగుతూ ఉంది. సన్యాసుల్లో సోమరిపోతులు, తిరుగుబోతులు ఉన్నమాట నిజమే. కానీ ఏకాంతాన్ని, శాంతినీ కోరుకునే సన్యాసులు ఎంతమంది లేరు? వీరిని సమాజం పట్టించుకోదు. మానవుడి ఔన్నత్యానికి చెందిన ఆధ్యాత్మిక ప్రపంచం ఈనాడు పూర్తిగా తిరస్కరింపబడింది. ఇప్పుడు ఇదొక విజయంగా భావిస్తున్నారు. 


‘‘నాకు ఒక స్వతంత్ర పోరాటయోధుడు తెలుసు. అతను ఖైదులో ఉన్నప్పుడు పొగాకు అందలేదు. పొగాకు లేక అతను ఎంతటి వ్యధకు గురయ్యాడంటే అధికారులవద్దకు వెళ్ళి తన విషయం అంతా ఒప్పేసుకున్నాడు. కేవలం పొగాకు కోసం. అతనంటాడు - ‘నేను మానవాళికోసం పోరాటం చేస్తున్నాను’ అని.


‘‘ఇటువంటివారు ఏం పోరాటం చేస్తారు? అతనసలు దేనికి పనికొస్తాడు? ఏదో తాత్కాలికమైన త్వరగా ముగిసిపోయే ఆవేశ పూరితమైన పని అతడు చేయగలడేమో, కాని దానిని ఎక్కువ కాలం నిలబెట్టలేడు. వారు స్వాతంత్య్రం పొందడానికి బదులు బానిసత్వంలో కూరుకుపోయారు. వినమ్రత, ఉపవాసం అనే విషయాలను చూసి ప్రజలు నవ్వొచ్చుగాక. కానీ వాటిద్వారానే మానవునికి నిజమైన స్వాతంత్య్రం సిద్ధిస్తుంది. సౌమ్యులు, వినమ్రులు అయిన సాధువులే పైకి లేచి గొప్ప కార్యం కోసం పనిచేస్తారు.’’


ఈ పుస్తకంలో తారసిల్లే అనేక తాత్విక ప్రతిపాదనలు ఆయా పాత్రలవే అనుకోవాల్సిన పనిలేదు. కొన్నిసార్లు రచయిత అభిప్రా యాలు కూడా కావచ్చు. అటువంటి ప్రతిపాదనలకి విరుద్ధంగా కూడా సంఘటనలు జరుగుతాయి. కరమజోవ్‌ల కుటుంబం ఫాదర్‌ జోసిమాని  క్రైస్తవ మఠంలో కలిసినప్పుడు పత్రికలో వచ్చిన ఇవాన్‌ రాసిన రచన ‘మతపరమైన న్యాయస్థానాల’ గురించి ‘చర్చి రాజ్యంగా మారడం కాక రాజ్యమే క్రమంగా చర్చిగా ఎదగడం’ గురించిన చర్చ ఆసక్తికరంగా ఉంటుంది. సమాజమంతా చర్చిగా మారినపుడు అంటే భవిష్యత్తులో నేరాన్ని, నేరస్థుడ్ని చర్చి విచారించే తీరులో తప్పకుండా మార్పు ఉంటుంది. నేరస్థులను సంస్కరించడంలోనూ, నేరం చేయాలనే వాంఛను నిరోధించడంలోనూ చర్చి గొప్ప విజయం సాధిస్తుంది.


ఒకరకంగా కరమజోవ్‌ బ్రదర్స్‌ నవలలో నేరస్థుడి ఆచూకిని పట్టుకోవడంలో సాంప్రదాయ న్యాయస్థానాల వైఫల్యాన్ని కూడా రచయిత మనకి ఎత్తిచూపిస్తాడు. అసలు ఈవైఫల్యాన్ని ఎత్తిచూప డానికే మతపరమైన న్యాయస్థానాల చర్చని లేవదీసాడని అని పిస్తుంది. కానీ ఇదే సందర్భంలో అతడికి అంతగా పరిచయంలేని విషయం మీద ఇవాన్‌ వ్యాసం రాసాడని కూడా రచయిత చెప్తాడు.


ఈ నవలలో ముఖ్యమైనదని భావించే Grand Inquisitor అధ్యాయం నాస్తికుడైన ఇవాన్‌ బైబిల్‌లోని ఒక భాగాన్ని ఆధారంగా చేసుకుని కవితగా రాసుకున్నది. ఇది మిడిమిడి జ్ఞానంతో రాసిన ఒక ‘మహాకథనం’. నిర్జన ప్రాంతంలో ఆ ఆత్మ (సైతాన్‌) అడిగిన మూడు అద్భుతాలను (three temptations of God) ఇవ్వడా నికి తిరస్కరించిన దేవుడితో Grand Inquisitor  (మహా ధర్మాధి కారి) చేసే సంవాదం. ఈ అద్భుతాలను చేయడానికి నిరాకరిం చడంద్వారా క్రీస్తు మానవ స్వభావాన్ని తప్పుగా అంచనా వేశాడని నిందిస్తాడు ధర్మాధికారి. ఈ అధ్యాయాన్ని అర్థం చేసుకోడానికి నవల చివర్లో ఇవాన్‌ దెయ్యంతో చేసిన సంభాషణ కూడా చదవాలి. సర్రియలిస్టిక్‌ కలలా సాగే ఈ సన్నివేశంలోని దెయ్యం ఇవాన్‌ ఊహా జనితం కావచ్చు లేక అది అతడి అంతరాత్మే కావొచ్చు. ఇక్కడ విశ్వాసానికీ అవిశ్వాసానికీ మధ్య అతడి తాత్విక గందరగోళాన్ని రచయిత ఎత్తిచూపుతూ, విశ్వాసం లేని మానవుడి స్వాతంత్య్రం ఎంత అగమ్యగోచరమో ముసుగుతీసి చూపిస్తాడు. ఆనాటి రష్యాలో పొడచూపుతున్న హేతువాదాన్ని, ఆధునికతని దాస్తోయెవ్‌స్కీ ఎంత గాఢంగా వ్యతిరేకించాడో స్పష్టంగా అర్థమవుతుంది.


ఈ నవలలో ప్రధాన ఘటన అయిన పావ్లోవిచ్‌ మరణం ఎంత ముఖ్యమో అతడి అక్రమ సంతానం స్మెర్ద్యకోవ్‌ ఆత్మహత్య కూడా అంతే ముఖ్యం. అలానే తన తండ్రి కెప్టెన్‌ స్వెగిర్యోవ్‌ని ద్మీత్రి కరమజోవ్‌  కొట్టడం చూసి కలతచెంది జబ్బుపడి చనిపోయిన చిన్నారి ఇల్యూష కథ కూడా ఈ నవలలో ముఖ్యమైన భాగమే. ప్రధాన కథనంతో ఏ సంబంధం లేదనిపించే ఫాదర్‌ జోసిమా గత జీవిత చరిత్ర, ఆయన ఆధ్యాత్మిక ప్రసంగాలు లేకున్నా ఇదొక అసంపూర్ణ నవలే!


1870ల నాటికి నేరపరిశోధనలో ఫోర్సెనిక్‌, ఫింగర్‌ప్రింట్‌ టెక్నాలజీ రాలేదు. వచ్చుంటే ఈ నవలతోపాటు ‘క్రైమ్‌ అండ్‌ పనిష్మెంట్‌’ కూడా లేదు. పద్దెనిమిదవ శతాబ్దంనాటి శాస్త్ర ప్రగతి ఎలా ఉన్నా దోస్తయెవ్‌స్కీ రేషనలిస్ట్‌, మెటీరియలిస్ట్‌, నిహిలిస్టు ధోరణుల్ని వ్యతి రేకించగలిగాడు గాని తనకు తాను అబద్ధం చెప్పుకునే ఆధునిక మానవుడి విశ్వరూపాన్ని ఏమాత్రం ఊహించలేకపోయాడు.


ప్రపంచం నిండా పాపాలు జరుగుతున్నాయి. ప్రతి మనిషి పక్క వాడితో పాపం చేస్తున్నాడు. ఆత్మసాక్షి వేసే కేకలకు మానవ సమాజం ఏనాడో చాలా దూరంగా జరిగిపోయింది. అందుచేత ఈ నవల ఎంత గతించిపోయిన చరిత్రనో సర్వకాలాలకీ అంత సమకాలీనం కూడా.

బి. అజయ్‌ ప్రసాద్‌

92477 33602

Updated Date - 2022-07-04T06:46:52+05:30 IST