ఆ ఒక్కటీ లేక..కరోనా టెస్టుకు దూరం

ABN , First Publish Date - 2020-07-03T11:30:05+05:30 IST

సర్కారు యంత్రాంగం నిర్లక్ష్య వైఖరికి మెదక్‌ కొవిడ్‌-19 టెస్టింగ్‌ ల్యాబ్‌ నిదర్శనంగా నిలుస్తున్నది రూ.78 లక్షల వ్యయంతో

ఆ ఒక్కటీ లేక..కరోనా టెస్టుకు దూరం

జిల్లా కేంద్రంలో నిరుపయోగంగా ల్యాబ్‌

20 రోజుల క్రితం ప్రారంభం

ఒక్క టెస్టు చేయని వైనం

ముఖ్యమైన పరికరం లేకపోవడమే కారణం

కొవిడ్‌-19 టెస్టుల కోసం తప్పని ఇబ్బందులు

హైదరాబాద్‌కు శాంపిల్స్‌ 

ఫలితాల వెల్లడిలో తీవ్రజాప్యం

చికిత్స, క్వారంటైన్‌లో ఆలస్యం


ఒకే ఒక్క పరికరం లేక రూ.లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన కరోనా పరీక్షల కేంద్రం నిరుపయోగంగా మారింది. రూ.78లక్షలతో జిల్లా కేంద్రంలో కొవిడ్‌-19 టెస్టింగ్‌ ల్యాబ్‌ను 20 రోజుల క్రితం ఆర్భాటంగా ప్రారంభించారు. పరీక్షలు చేయడానికి అవసరమైన ఓ పరికరం రాకపోవడంతో ఇప్పటి వరకు ఒక్క టెస్టు కూడా చేయలేదు.


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మెదక్‌, జూలై 2: సర్కారు యంత్రాంగం నిర్లక్ష్య వైఖరికి మెదక్‌ కొవిడ్‌-19 టెస్టింగ్‌ ల్యాబ్‌ నిదర్శనంగా నిలుస్తున్నది రూ.78 లక్షల వ్యయంతో ల్యాబ్‌ను ప్రారంభించి 20 రోజులు దాటుతున్నా నేటికీ పనిచేయడం లేదు. దీంతో జిల్లా నుంచి శాంపిల్స్‌ సేకరించి పరీక్షల కోసం హైదరాబాద్‌  తీసుకెళ్లాల్సి వస్తున్నది.  అక్కడ రద్దీ దృష్ట్యా ఫలితాలు రావడంలో తీవ్రజాప్యం జరుగుతున్నది. ఫలితంగా బాధితులకు వైద్య సేవలందించడం, కాంటాక్టులను గుర్తించడంలో ఆలస్యం జరిగి వైరస్‌ వ్యాప్తి పెరిగిపోతున్నది. జిల్లాలో పరీక్షా కేంద్రం ఎప్పటికి వినియోగంలోకి వస్తుందో తెలియక అనుమానితులు హైదరాబాద్‌లోని ప్రైవేటు ల్యాబ్‌లను ఆశ్రయించాల్సి వస్తున్నది.


ముఖ్యమైన పరికరం ఏర్పాటులో జాప్యం

జిల్లాలో అనుమానితుల నుంచి నమూనాలను సేకరించి టెస్టుల కోసం హైదరాబాద్‌కు పంపడంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఫలితాలు రావడానికి  ఆలస్యం కావడంతో రోగ నిర్ధారణ, చికిత్స, కాంటాక్ట్‌లను గుర్తించి క్వారంటైన్‌ చేయడంలో తీవ్రజాప్యం జరుగుతున్నది. ఈ ఇబ్బందులను తప్పించేందుకు జిల్లాల్లో ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మెదక్‌ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో గత నెల 12న కరోనా నిర్ధారణ కేంద్రాన్ని కలెక్టర్‌ ధర్మారెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ప్రారంభించారు. రూ.78 లక్షలు వెచ్చించి టెస్టులకు అవసరమైన ట్రూనాట్‌, సీబీనాట్‌ తదితర పరికరాలు ఏర్పాటు చేయడంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించారు.


ఈ కేంద్రంలో పని చేయాల్సిన సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చారు. ల్యాబ్‌లో రెండు షిఫ్టుల్లో కలిపి రోజుకు 32 నమూనాలను పరీక్షించేలా ఏర్పాటు చేశారు. కానీ పరీక్షలు చేయడానికి ముఖ్యమైన డీఫ్రీజర్‌ (మైనస్‌ 80 డిగ్రీలు) రాకపోవడంతో ఇప్పటి వరకు టెస్టులు చేయడం లేదు. కానీ ఐపీఎంఆర్‌ నుంచి ఈ యంత్రాన్ని తెప్పించడం  ఆలస్యమవుతున్నది. ల్యాబ్‌ అందుబాటులోకి రాకపోవడంతో జిల్లాలో సేకరించిన నమూనాలను హైదరాబాద్‌కే పంపాల్సి వస్తున్నది. అక్కడి నుంచి ఫలితాలు రావడానికి మూడు రోజులు పడుతున్నది.


ఇటీవల పలువురు అనుమానితులు శాంపిల్స్‌ ఇచ్చేందుకు జిల్లా ఆస్పత్రికి రాగా అధికారులు రేపుమాపు వెనక్కి పంపుతున్నారు. ఆలస్యమైతే ప్రాణాలకే ముప్పు పొంచిఉండడంతో బాధితులు తప్పనిసరి పరిస్థితుల్లో భారమైనా హైదరాబాద్‌లోని ప్రైవేటు ల్యాబ్‌లను ఆశ్రయించాల్సి వస్తున్నది. వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు త్వరగా స్పందించి డీఫ్రీజర్‌ను త్వరితగతిన తెప్పించాలని జిల్లావాసులు కోరుతున్నారు. ఈ విషయమై జిల్లా వైద్యాధికారిని వివరణ కోరగా అందుబాటులోకి రాలేదు.

Updated Date - 2020-07-03T11:30:05+05:30 IST