ఉక్రెయిన్‌పై యుద్ధం ఫలితం: ప్రపంచ ప్రఖ్యాత రచయిత దోస్తోవ్‌స్కీని రష్యాకే పరిమితం చేసే యత్నం

ABN , First Publish Date - 2022-03-04T00:42:32+05:30 IST

ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ నేపథ్యంలో ఇటలీలోని మిలన్ విశ్వవిద్యాలయం తీసుకున్న నిర్ణయం

ఉక్రెయిన్‌పై యుద్ధం ఫలితం: ప్రపంచ ప్రఖ్యాత రచయిత దోస్తోవ్‌స్కీని రష్యాకే పరిమితం చేసే యత్నం

ఇటలీ: ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ నేపథ్యంలో ఇటలీలోని మిలన్‌ విశ్వవిద్యాలయం తీసుకున్న నిర్ణయం తీవ్ర వివాదాస్పదమైంది. ప్రపంచ మహా రచయితగా కీర్తినందుకున్న దోస్తోవ్‌స్కీ (Fyodor Dostoyevsky)ని రష్యాకు మాత్రమే పరిమితం చేసే యత్నం చేసింది. 1821–1881 కాలానికి చెందిన ఫ్యోదర్ రాసిన ‘క్రైమ్ అండ్ పనిష్మెంట్’ ( Crime and Punishment ) ‘బ్రదర్స్ కరమొజొవ్’ ( The Brothers Karamazov ) వంటి రచనలు రష్యాకు ఆవల కూడా జేజేలు అందుకున్నాయి. సరిహద్దుల అంతరాలను చెరిపేశాయి. చెకోవ్, హెమింగ్వే వంటి మహా రచయితలను నీషే, సార్త్రే, సిగ్మండ్ ఫ్రాయిడ్ వంటి తత్వవేత్తలను విశేషంగా ప్రభావితం చేసిన  దోస్తోవ్‌స్కీ.. ఉక్రెయిన్‌పై యుద్ధం పుణ్యమా అని ఇప్పుడు ఒక్క రష్యాకే పరిమితమైపోయాడు. రష్యన్ దేశస్థుడిగా పేర్కొంటూ ఆయన రచనలను నిషేధించాలని యూనివర్సిటీ చూసింది.  


 మిలానో-బికోకా విశ్వవిద్యాలయంలో ఫ్యోదర్‌పై గెస్ట్ లెక్చర్ ఇచ్చేందుకు ఆహ్వానించిన ఇటాలియన్ రచయిత పాలో నోరి.. ఆ తర్వాత అది వాయిదా పడినట్టు సమాచారం అందడంతో తన చిరాకును ఇన్‌స్టాగ్రామ్ ద్వారా బయటపెట్టారు. పాలో నోరికి పంపిన ఈ-మెయిల్‌లో  లెక్చర్ వాయిదాపై కారణాన్ని వివరిస్తూ.. బలమైన ఉద్రిక్తతలు ఉన్న ప్రస్తుత సమయంలో అంతర్గత వివాదాలను నివారించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. 


‘‘ఉక్రెయిన్‌లో ఏం జరుగుతుందో నాకు తెలుసు. అది చాలా భయంకరంగా ఉంది. తలచుకుంటే ఏడుపొస్తున్నట్టుగా ఉంది. కానీ ఇప్పుడు ఇటలీలో జరుగుతున్నది హాస్యాస్పదంగా ఉంది. నేడు ఇటలీలో రష్యన్‌గా జీవించడం ఉండడం మాత్రమే తప్పు కాదు, చనిపోయిన రష్యన్‌గా ఉండడం కూడా తప్పే’’ అని నోరి తన ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో పేర్కొన్నారు. దోస్తోవ్‌స్కీ వంటి రచయితపై ఒక కోర్సును నిషేధించారంటే నమ్మశక్యం కావడం లేదన్నారు. ‘పెట్రాషెవ్‌స్కీ సర్కిల్’ అనే ‘రాడికల్ ఇంటెలెక్చువల్ డిస్కషన్ గ్రూప్’ తో తన కార్యకలాపాల కోసం 1849లో నిషేధిత పుస్తకాలు చదివినందుకు గాను దోస్తోవ్‌స్కీ మరణశిక్ష విధించారు. అయితే, ఆ శిక్ష చివరి నిమిషంలో రద్దు చేశారు. ఆ తర్వాత ఆయన తన మేధోపరమైన స్వేచ్ఛ కోసం సైబీరియన్ కార్మిక శిబిరంలో నాలుగేళ్లపాటు పనిచేశారు. 


పాలో నోరి పోస్టు చేసిన వీడియో వైరల్ కావడంతో మిలన్‌లోని యూనివర్సిటీపై విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాదు, ట్విట్టర్‌లో ‘దోస్తోవ్‌స్కీ’ ట్రెండింగ్‌ అయింది. దీనిపై ఇటలీ మాజీ ప్రధాని  మాటియో రెంజీ స్పందిస్తూ.. ఈ సమయంలో మనం ఎక్కువగా చదువుకోవాలి కానీ తక్కువ కాదంటూ ట్వీట్ చేశారు. యూనివర్సిటీలో మనకు ఉపాధ్యాయులు కావాలి కానీ, అసమర్థులైన బ్యూరోక్రాట్లు కాదని దుమ్మెత్తి పోశారు. పుతిన్ ప్రస్తుత మరకలను తుడిచేందుకు రష్యన్ సంస్కృతిని, ప్రత్యేకించి దాని లోతైన తాత్విక చరిత్రను తుడిచివేయాలని చూడడం తగదని దుయ్యబట్టారు. నిజాయతీగా ఉంటారో, ఇప్పటికీ మూర్ఖులుగానే ఉంటారో తేల్చుకోవాలన్నారు. దోస్తోవ్‌స్కీ‌పై కోర్సును వాయిదా వేయాలని తీసుకున్ననిర్ణయంపై ఒక్క ఇటలీ నుంచే కాదు.. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన విమర్శలతో ఉక్కిరిబిక్కిరి అయిన మిలన్ యూనివర్సిటీ వెనక్కి తగ్గింది.

Updated Date - 2022-03-04T00:42:32+05:30 IST