తిరుమల అగ్ని ప్రమాదం కేసులో మలుపు!

ABN , First Publish Date - 2021-05-06T09:33:20+05:30 IST

తిరుమల అగ్ని ప్రమాదం కేసు అనూహ్యమైన మలుపు తిరిగిందని విశ్వసనీయ సమాచారం. సజీవ దహనమైన వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు

తిరుమల అగ్ని ప్రమాదం కేసులో మలుపు!

సజీవ దహనమైన వ్యక్తి ఆత్మహత్య?

కీలకంగా మారిన సెల్ఫీ వీడియో


తిరుమల, మే 5(ఆంధ్రజ్యోతి): తిరుమల అగ్ని ప్రమాదం కేసు అనూహ్యమైన మలుపు తిరిగిందని విశ్వసనీయ సమాచారం. సజీవ దహనమైన వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. శ్రీవారి ఆలయం ముందున్న ఆస్థాన మండపంలో మంగళవారం జరిగిన అగ్నిప్రమాదంలో సుమారు 20 దుకాణాలు కాలిపోవడం, ఓ వ్యక్తి సజీవ దహనమవడం కలకలం రేపింది. కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టిన పోలీసులకు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలిశాయి. మృతుడు మలిరెడ్డి తన సెల్‌ఫోను, పర్స్‌ మరో దుకాణంలో ఉంచాడు. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. మృతుడి భార్య శోభ సహాయంతో లాక్‌ తీసి సెల్‌ ఫోన్‌ను పరిశీలించారు. మంగళవారం వేకువజామున 5 గంటల సమయంలో మలిరెడ్డి ఓ సెల్ఫీ వీడియో రికార్డు చేసినట్టు గుర్తించారు. కీలకంగా మారిన ఆ వీడియోలోని విషయం ఏమన్నదే ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మరింది. మరోవైపు ఇప్పటికే పలువురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. మలిరెడ్డి ఎలా చనిపోయాడు? అతని ద్వారానే అగ్నిప్రమాదం జరిగిందా? లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అనే కోణాల్లో పోలీసులు విచారణను వేగవంతం చేశారు.

Updated Date - 2021-05-06T09:33:20+05:30 IST