విస్తరణకు నోచుకోని కణితి రోడ్డు

ABN , First Publish Date - 2022-08-17T05:51:46+05:30 IST

ఏళ్లు గడుస్తున్నా.. ప్రభుత్వాలు మారుతున్నా పారిశ్రామిక ప్రాంతంలోని కీలకమైన కణితి రోడ్డు మాత్రం విస్తరణకు నోచుకోవడం లేదు.

విస్తరణకు నోచుకోని కణితి రోడ్డు
వాహనాల అస్తవ్యస్త పార్కింగ్‌తో ఇరుకుగా ఉన్న కణితి రోడ్డు

శంకుస్థాపన దశలోనే ఆగిపోయిన పనులు

నిత్యం ట్రాఫిక్‌ సమస్యలతో సతమతమవుతున్న ప్రజలు

పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు

గాజువాక, ఆగస్టు 16: ఏళ్లు గడుస్తున్నా.. ప్రభుత్వాలు మారుతున్నా పారిశ్రామిక ప్రాంతంలోని కీలకమైన కణితి రోడ్డు మాత్రం విస్తరణకు నోచుకోవడం లేదు. పాలకులు, అధికారుల తీవ్ర నిర్లక్ష్యం కారణంగా ఈ రోడ్డు విస్తరణకు నోచుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త గాజువాక ప్రధాన కూరగాయల మార్కెట్‌తో పాటు అన్ని రకాల వస్తు సామగ్రికి సంబంధించిన హోల్‌సేల్‌ దుకాణాలన్నీ ఈ రోడ్డులోనే ఉన్నాయి. అన్ని రకాల వస్తువులు ఇక్కడ లభ్యమవుతుండడంతో పారిశ్రామిక ప్రాంత ప్రజలంతా అధిక సంఖ్యలో రోజూ ఇక్కడకు వివిధ అవసరాల నిమిత్తం వస్తుంటారు. ఒకపక్క కొనుగోలుదారులు, మరోపక్క వాహనదారులతో నిత్యం ఈ రోడ్డు రద్దీగా ఉంటుంది. దీంతో తీవ్ర ట్రాఫిక్‌ ఇబ్బందులతో ప్రజలు సతమతం అవుతుండడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలో కొత్త గాజువాక ప్రధాన కూరగాయల మార్కెట్‌కు అనుసంధానమై వున్న కణితి రోడ్డును విస్తరించాల్సిన అవసరం వుందని 2012లో డబుల్‌ రోడ్డుగా విస్తరించేందుకు అప్పటి ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య శంకుస్థాపన చేశారు. తొలుత వందడుగులకు విస్తరించాలని అధికారులు ప్రతిపాదించారు. ఇందుకు సంబంధించి మార్కింగ్‌ కూడా చేశారు.  అయితే రోడ్డు విస్తరణలో భాగంగా అధిక శాతం భవనాలను తొలగించాల్సి వుండడంతో  భవన యజమానుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో 80 అడుగులకు కుదించారు. అయినప్పటికీ  భవన యజమానులు ససేమిరా అనడంతో చివరకు 70 అడుగులకు కుదించారు. వర్క్‌ ఆర్డర్‌ తీసుకున్నాక ఆలస్యంగా విస్తరణ పనులు ప్రారభించారు. ఇలా జాప్యం జరగడం.. వ్యయం పెరగడంతో పాత ధరలకు పనులు చేయలేనంటూ సంబంధిత కాంట్రాక్టర్‌ చేతులెత్తేశాడు. దీంతో రహదారి విస్తరణ పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు విస్తరణ పనులకు ఎస్టిమేషన్లు వేయించారే తప్ప పనులు ప్రారంభించే దిశగా ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ఈ కారణంగా విస్తరణ పనులకు మోక్షం లభించలేదు. ప్రస్తుతం ఈ రోడ్డులో వాహనాల తాకిడి మరింతగా పెరగడంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించేందుకు వాహనదారులు నరకయాతన పడుతున్నారు. పండగ సమయాల్లో అయితే ఈ మార్గంలో రాకపోకలు సాగించడం మరింత కష్టతరంగా ఉంటుంది. ఇప్పటికైనా కణితి రోడ్డు విస్తరణపై ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టిసారించాలని ప్రజలు కోరుతున్నారు. 


Updated Date - 2022-08-17T05:51:46+05:30 IST