ఇసుకే బంగారమాయెనే..!

ABN , First Publish Date - 2021-06-18T06:03:00+05:30 IST

జిల్లాలో ఇసుక దొరకక.. దొరికినా చుక్కల్లోకి చేరిన ధరలతో నిర్మాణదారులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. సామాన్యులకు సొంతిల్లు కలగా మారుతోంది. జగన ప్రభుత్వం కొలువుదీరాక గత చంద్రబాబు సర్కారు చేపట్టిన ఉచిత ఇసుక పాలసీ రద్దు చేసి నూతన ఇసుక పాలసీ తీసుకొచ్చారు.

ఇసుకే బంగారమాయెనే..!
నందలూరు మండలం ఆడపూరు ఇసుక రీచ

కడపకు చేరాలంటే ట్రిప్పు రూ.25-30 వేల పైమాటే

టిప్పరు యజమానులు, దళారులదే పెత్తనం 

ఎద్దుల బండ్లపై ఆధార పడుతున్న గ్రామస్తులు

ఆగిపోయిన భవన నిర్మాణాలు


(కడప- ఆంధ్రజ్యోతి): 

- కడప నగరానికి చెందిన బిల్డరు కృష్ణారెడ్డి (పేరు మార్చాం) నెలలో సరాసరి పది టిప్పర్ల ఇసుక కొనుగోలు చేస్తారు. ఏపీఎండీసీ ఆనలైన అమ్మకాల సమయంలో ఒక ట్రిప్పు (18 టన్నులు) రూ.15 వేలకు మించేది కాదు. ప్రైవేటు సంస్థకు ఇవ్వడంతో మళ్లీ ఇసుక కష్టాలు మొదలయ్యాయి. తాజాగా ట్రిప్పు ఇసుక రూ.25 వేలు పడుతోంది. నెల్లూరు జిల్లా నుంచి తెప్పిస్తే రూ.30 వేల పైమాటే. నెలకు సగటున రూ.లక్ష అదనపు భారం పడుతోందని వాపోయారు. 

- తొండూరుకు చెందిన జయరాంరెడ్డి (పేరు మార్చాం) రూ.15-20 లక్షల అంచనా వ్యయంతో ఇంటి నిర్మాణం చేపట్టారు. గురువారం కొండాపురం మండలం పొట్టిపాడు ఇసుక రీచ నుంచి ఒక ట్రాక్టరు (4.5 టన్నులు) కొనుగోలు చేశారు. కాంట్రాక్ట్‌ సంస్థకు రూ.2,150, ఇసుక లోడ్‌ చేసిన ఎక్స్‌కవేటర్‌కు రూ.100, విలేజ్‌ గేట్‌ పాస్‌ రూ.800, ట్రాక్టరు బాడుగ రూ.1800 కలిపి రూ.4,850 అయింది. అంటే.. టన్ను రూ.1,077 అవుతుంది. గత నెలలో టన్ను రూ.710లకే కొనుగోలు చేశాం.. ప్రైవేటుకు ఇవ్వడంతో టన్నుపై రూ300-400 అదనపు భారం తప్పడం లేదని ఆయన వాపోయారు.

- భవన నిర్మాణదారులు ఎవరిని కదిపినా ఇసుక కష్టాలపై ఏకరువు పెడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో కడప నగరానికి ఒక టిప్పర్‌ ఇసుక రూ.10-12 వేలకే వచ్చేది. జగన సర్కారు తెచ్చిన నూతన ఇసుక పాలసీ వల్ల మొదట్లో ఇసుక దొరకడమే కష్టమైంది. ట్రిప్పు రూ.30 వేలకు పైగా చేరింది. ఆనలైన బుకింగ్‌ విధానంలో కొన్ని మార్పులు వల్ల రూ.15-20 వేలకు దొరికేది. ప్రైవేటు సంస్థకు అప్పగించడంతో మళ్లీ ఇసుక కష్టాలు మొదలై, ఒక ట్రిప్పు దూరాన్ని బట్టి రూ.25-30 వేలకు కొనాల్సి వస్తోందని.. డబ్బు పెడితేనైనా ఇసుక దొరుకుతుందా..? అంటే అదీలేదని నిర్మాణదారులు ఆరోపిస్తున్నారు. కడప నగరంలో మాత్రమే కాదు.. జిల్లా అంతటా ఇదే పరిస్థితి.


జిల్లాలో ఇసుక దొరకక.. దొరికినా చుక్కల్లోకి చేరిన ధరలతో నిర్మాణదారులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. సామాన్యులకు సొంతిల్లు కలగా మారుతోంది. జగన ప్రభుత్వం కొలువుదీరాక గత చంద్రబాబు సర్కారు చేపట్టిన ఉచిత ఇసుక పాలసీ రద్దు చేసి నూతన ఇసుక పాలసీ తీసుకొచ్చారు. రీచల నిర్వహణ, బుకింగ్‌, రవాణా బాధ్యతలు ఏపీ మైనింగ్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన (ఏపీఎండీసీ)కి అప్పగించారు. తిరిగి మే 14 నుంచి ఇసుక అమ్మకాలు జేపీ గ్రూపు ప్రైవేటు సంస్థకు స్వాధీనం చేశారు. ప్రస్తుతం ఆ సంస్థ పర్యవేక్షణలో అమ్మకాలు సాగుతున్నాయి. జిల్లాలో చెయ్యేరు, పాపాఘ్ని, పెన్నా నదుల్లో గనులు, భూగర్భ వనరుల శాఖ 12 రీచులకు అనుమతులు ఇచ్చారు. నందలూరు మండలం ఆడపూరు-2, 3, కొమరంపల్లి, కొండాపురం మండలం పొట్టిపాడు, ఏటూరు, ఎనుములచింతల, ఎర్రగుడి, ప్రొద్దుటూరు మండలం తిప్పిరెడ్డిపల్లి, రేగులపల్లి, కల్లూరు, వీఎనపల్లి మండలం తాటిమేకలపల్లి, వేంపల్లి మండలం ఇడుపులపాయలో ఇసుక రీచులు ఉన్నాయి. ఏపీఎండీసీ టన్ను రూ.375లకు ఇస్తే.. ప్రస్తుతం రూ.475లకు పెంచారు. ఇసుక రవాణా అస్తవ్యస్థంగా మారడంతో ధరలు చుక్కల్లో చేరాయి. ఒక ట్రిప్పు (18 టన్నులు)పై దూరాన్ని బట్టి రూ.10 వేలకు పైగా అదనపు భారం తప్పడం లేదని.. ఇసుక కూడా బ్లాక్‌లో కొనాల్సి వస్తోందని నిర్మాణదారులు వాపోతున్నారు.


నెల్లూరు నుంచి కడపకు

కడప నగరానికి నందలూరు మండలం ఆడపూరు దగ్గర చెయ్యేరు నదిలోని రీచుల నుంచి ఇసుక రవాణా చేస్తున్నారు. ఆడపూరు-2, 3 రీచుల నుంచి రోజుకు 150-200 టిప్పర్లు, 80కి పైగా ట్రాక్టర్ల ఇసుకను కడప, రాజంపేట, బద్వేలు, తిరుపతి తదితర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. కడపకు 18 టన్నుల ట్రిప్పు రూ.25 వేలకు పైగా పడుతోంది.  అయినా.. సకాలంలో అందడం లేదు. దీంతో నెల్లూరు జిల్లా సంగం, సోమశిల నుంచి తెప్పించుకుంటున్నారు. ఇది దూరాన్ని బట్టి ట్రిప్పు రూ.30 వేలకు పైగానే పడుతోంది. విచిత్రమేమింటే నందలూరుకు ఆరేడు కి.మీలలో చెయ్యేరు నది ఉన్నా బాడుగ గిట్టుబాటు కాదని ఆ పల్లెకు ఇసుక రవాణా చేసేందుకు టిప్పర్‌ యాజమానులు ఆసక్తి చూపడం లేదు. దీంతో రూ.14-15 వేలకు కొంటున్నామని గ్రామస్థులు వాపోతున్నారు. ఆడపూరు రీచకు 18 కి.మీల దూరంలో ఉన్న రాజంపేటలో రూ.18-20 వేలు పైమాటే. అది కూడా బ్లాక్‌లో కొనాల్సిందే. డబ్బులిచ్చిన 10-20 రోజులకైనా వస్తుందని నమ్మకం లేదు. బద్వేలుకు నెల్లూరు జిల్లా సంగం, సోమశిల నుంచి ఇసుక ఒక టిప్పరు రూ.20 వేలు.. ట్రాక్టరు రూ.5,500తో తెప్పించుకుంటున్నారు.


ఎందుకీ పరిస్థితి..?

ఏపీఎండీసీ నుంచి జేపీ గ్రూపునకు 12 ఇసుక రీచులు అప్పగించారు. అందులో 8 రీచుల్లో మాత్రమే తవ్వకాలు చేపట్టారు. వినియోగదారులకు రవాణా చేయకుండా వేంపల్లి మండలం నందిపల్లి, నందలూరు మండలం ఆడపూరు, కొండాపురం మండలం పీఏ నందవరం వద్ద స్టాక్‌ పాయింట్లలో ఇసుక నిల్వచేస్తున్నారు. రోజుకు సగటున 7-8 వేల మెట్రిక్‌ టన్నుల ఇసుక డిమాండ్‌ ఉంది. ప్రస్తుతం 3-4 వేల టన్నులు కూడా సరఫరా చేయడం లేదు. దీంతో డిమాండ్‌ను సొమ్ము చేసుకోవడానికి టిప్పరు యజమానులు, రాజకీయ అండతో నల్లబజారులో అధిక రేట్లకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కావాలనే కృత్రిమ కొరత సృష్టించి ఇసుక ధరలు పెంచారని సమాచారం. దీని వెనుక అధికార పార్టీకి చెందిన ఇద్దరు ముగ్గురు ప్రజాప్రతినిధుల పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 


నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు

నది పరివాహక ప్రాంతంలో భూగర్భ జలాలు, వ్యవసాయ బోర్లు, తాగునీటి పథకాలను పరిగణలోకి తీసుకొని నదిలో ఎంతలోతు వరకు ఇసుక తవ్వకాలు చేయాలో నిర్ణయిస్తారు. ఆ మేరకే తవ్వకాలు చేయాలి. ఎంత ఎక్కువ ఉన్నప్పటికీ 3 మీటర్ల లోతుకు మించి తవ్వకూడదని గనులు, భూగర్భ వనరులు, నీటిపారుదల అధికారులు చెబుతున్నారు. ఇందేకు విరుద్ధగా నందలూరు మండలం ఆడపూరు రీచులో ఎక్స్‌కవేటర్లతో 10-12 అడుగుల లోతుకు పైగా ఇసుక తవ్వకాలు చేస్తున్నారని, భూగర్భ జలాలు అడుగంటి వ్యవసాయ బోర్లు, తాగునీటి పథకాలు ఒట్టిపోతాయని ఇటీవల రైతులు ఆందోళనకు దిగారు. అన్ని చోట్ల ఇదే పరిస్థితి ఉందనే ఆరోపణలు ఉన్నాయి.


త్వరలో ఇసుక సమస్య తీరుతుంది

- ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, జేపీ గ్రూపు జిల్లా మేనేజరు

వర్షాలు మొదలు కావడంతో నదిలోని రీచుల నుంచి స్టాక్‌ పాయింట్లలో ఇసుక డంప్‌ చేస్తున్నాం. నాలుగు రీచులు ఇంకా ప్రారంభం కాలేదు. జిల్లాలో రోజుకు 7 వేల టన్నుల వరకు డిమాండ్‌ ఉంటే.. ప్రస్తుతం 3-4 వేల టన్నులు మాత్రమే సరఫరా చేస్తున్నాం. రెండు రోజుల్లో ఈ సమస్య పరిష్కారం అవుతుంది. బయట మార్కెట్‌ ఇసుక రేట్లతో మాకు సబంధం లేదు. రీచలల్లో ప్రభుత్వం నిర్ణయించిన రేటు టన్ను రూ.475లకే ఇస్తున్నాం.

Updated Date - 2021-06-18T06:03:00+05:30 IST