ఈ తరం మరచిన త్రయం

ABN , First Publish Date - 2022-08-15T05:25:32+05:30 IST

దేశ స్వాతంత్ర్యోద్యమంలో చేర్యాల పట్టణానికి చెందిన ఇప్పకాయల నర్సయ్య, అతడి భార్య ఇప్పకాయల సుభద్రతో పాటు దొడ్డి కొమురయ్య పాల్గొని పోరాటం చేసినా వారి త్యాగఫలం వెలుగులోకి రాలేదు.

ఈ తరం మరచిన త్రయం
చేర్యాల అంగడిబజారులో ఏర్పాటుచేసిన స్తూపం

స్వాతంత్య్ర సమరంలో ముగ్గురు చేర్యాలవాసులు 

 వెలుగులోకి రాని ఇప్పకాయల నర్సయ్య, సుభద్ర, దొడ్డి కొమురయ్య జీవితాలు

 స్వాతంత్య్ర రజతోత్సవాల సందర్భంగా స్తూపం... వజ్రోత్సవాల సందర్భంగా మననంలోకి


చేర్యాల, ఆగస్టు 13: దేశ స్వాతంత్ర్యోద్యమంలో చేర్యాల పట్టణానికి చెందిన ఇప్పకాయల నర్సయ్య, అతడి భార్య ఇప్పకాయల సుభద్రతో పాటు దొడ్డి కొమురయ్య పాల్గొని పోరాటం చేసినా వారి త్యాగఫలం వెలుగులోకి రాలేదు. ఒకరు గెరిల్లా దళంలో వీరోచిత పోరాటం చేసి సుభా్‌షచంద్రబోస్‌ మన్ననలు పొందగా, మరొకరు గాంధీ నేతృత్వంలో క్విట్‌ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లారు. స్వాతంత్య్రం వచ్చిన 25 సంవత్సరాల తర్వాత వారిపేరున చేర్యాలలో స్తూపాన్ని ఏర్పాటు చేశారు. తర్వాత ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో వారి గురించి అంతగా తెలియని పరిస్థితి నెలకొంది. 




నర్సయ్య, సుభద్ర దంపతుల ప్రస్థానం


చేర్యాల పట్టణానికి చెందిన ఇప్పకాయల నర్సయ్య జీవనోపాధి నిమిత్తం చిన్నతనంలోనే పుణేకు వెళ్లారు. అక్కడ బీడీ ఫ్యాక్టరీలో పనిచేస్తూ స్వాతంత్ర్యోద్యమం వైపు అడుగు వేశారు. అక్కడే సుభద్రను వివాహమాడాడు. దంపతులిద్దరూ క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొని గాంధీని కూడా కలిశారు. సెప్టెంబరు 22, 1942లో బ్రిటీషు ప్రభుత్వం వారిని అరెస్టు చేసి పుణేలోని యెరవడ సెంట్రల్‌జైల్‌లో వేసింది. నర్సయ్య ఆరునెలల పాటు జైలుశిక్ష అనుభవించాడు. సుభద్ర గర్భిణిగా ఉండడంతో మూడునెలల జైలుశిక్ష అనంతరం విడుదల చేశారు. ఆ తర్వాత కొన్నాళ్లకు అహ్మదాబాద్‌కు వలస వెళ్లారు. స్వాతంత్ర్యానంతరం ఢిల్లీకి వెళ్లి పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకోగా భారత ప్రభుత్వం మంజూరు చేసింది. తామ్రపత్రంతో పాటు 10ఎకరాల భూమిని ప్రభుత్వం అందించింది. దీంతో చేర్యాలకు తిరిగివచ్చారు. స్థానిక చిన్నిమల్లన్న ఆలయంలో నర్సయ్య పూజారిగా కూడా పనిచేశారు. నర్సయ్య, సుభద్ర దంపతులకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కూతుళ్లు సంతానంగా జన్మించారు. కుటుంబ ఆర్థికపరిస్థితుల కారణంగా భూమిని విక్రయించారు. అక్టోబరు 26, 1979న నర్సయ్య, ఏప్రిల్‌ 9, 2011న సుభద్ర మరణించారు.








దొడ్డి కొమురయ్య ప్రస్థానం


సికింద్రాబాద్‌కు చెందిన దొడ్డి కొమురయ్యది బ్రిటీష్‌ కాలంలోనే ఎంతో ఆర్థికంగా ఉన్న కుటుంబం. 1924లో జన్మించిన కొమురయ్య అక్కడ ఇస్లామియా హైస్కూల్‌లో ఉర్ధూమీడియంలో పదవ తరగతి చదువుతుండగా స్వాతంత్య్ర ఉద్యమంవైపు మరలాడు. గెరిల్లా దళంలో పాల్గొని సుభా్‌షచంద్రబోస్‌ మన్ననలు పొదాడు. గెరిల్లా దళంలో ఉండి దాడి చేయడంతో అతడిపై అరెస్ట్‌ వారెంట్‌ జారీ అయింది. దీంతో అతడు బొంబాయికి వెళ్లాడు. అక్కడ బ్రిటీష్‌ మూకలపై దాడుల దళంలో సభ్యుడిగా వ్యవహరించాడు. బీహార్‌, పెషావర్‌, కలకత్తా, ఢిల్లీ, బొంబాయి ప్రాంతాల్లో బ్రిటీష్‌ వారిపై జరిపిన దాడుల్లో పాల్గొన్నాడు. కొంతకాలానికి అరెస్టు కావడంతో సికింద్రాబాద్‌లోని ఓల్డ్‌ జైల్‌లో వేశారు. జైల్‌లో ఉండగానే తన తల్లి మృతి చెందడంతో అంత్యక్రియలకు అనుమతి ఇవ్వగా, తప్పించుకుపోయాడు. స్వాతంత్య్రం సిద్ధించిన తరువాత హైదరాబాదులోని పబ్లిక్‌ గార్డెన్స్‌ సమీపంలో పాన్‌షా్‌ప పెట్టుకుని జీవించసాగాడు. స్వాతంత్య్ర సమరయోధుడి పింఛన్‌ కోసం అప్పటి ప్రధాని లాల్‌బహదూర్‌శాస్త్రి హయాంలో దరఖాస్తు చేసుకోగా విచారణానంతరం నెలకు రూ.200చొప్పున మంజూరు చేశారు. అనంతరం చేర్యాలకు వచ్చి ఇక్కడే స్థిరపడి, ఆర్‌ఎంపీగా సేవలందించాడు. జనగామలో ఇందిరాగాంధీ నిర్వహించిన సభకు ఆహ్వానించి తామ్రపత్రం బహుకరించారు. 10ఎకరాల భూమిని కమలాయపల్లి గ్రామంలో కేటాయించారు. కొమురయ్య మొదటి భార్య చాన్నాళ్ల క్రితమే మరణించగా, ఒక కుమారుడు, కూతురున్నారు. రెండోభార్య రాములమ్మ కొన్ని నెలలక్రితం మరణించగా, ఆమెకు ఇద్దరు కుమారులు, ఐదుగురు కూతుళ్లున్నారు. వారు హైదరాబాదుకు వలసవెళ్లారు. 


25ఏళ్ల సందర్భంగా స్తూపం ఏర్పాటు


స్వాతంత్య్రం సిద్ధించిన 25ఏళ్ల తర్వాత సమరయోధులను గుర్తిస్తూ తామ్ర పత్రాలను అందించడంతో పాటు స్తూపాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో చేర్యాల అంగడిబజారులో ఏర్పాటు చేసిన స్తూపం ముందుభాగంలో ఇప్పకాయల నర్సయ్య, దొడ్డి కొమురయ్యల పేర్లు పొందుపరిచి ఉన్నాయి. వెనకభాగంలో స్వాతంత్య్ర ఫలాలను వివరించారు. కాగా ఈ స్తూపం కాలక్రమేణా భూమిలో కూరుకుపోవడంతో స్వాతంత్య్ర సమరయోధులదన్న విషయం తెలియకుండా పోయింది. దొడ్డి కొమురయ్య పేరు ఉండడంతో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు కడవెండికి చెందిన దొడ్డి కొమురయ్య స్మారక స్తూపంగా భావించారు. ఇంటిగ్రెటెడ్‌ వెజ్‌అండ్‌ నాన్‌వెజ్‌ మార్కెట్‌ నిర్మాణ కోసం స్తూపాన్ని వెలికితీయడంతో అసలు విషయం తెలిసింది. 


 



Updated Date - 2022-08-15T05:25:32+05:30 IST