మహోద్యమ మెరుపు మహేష్

ABN , First Publish Date - 2022-01-01T06:17:04+05:30 IST

మలిదశ తెలంగాణ ఉద్యమం పురుడు పోసుకున్న కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థి జేఏసీ వ్యవస్థాపక సభ్యుడిగా కీలక పాత్ర పోషించిన డాక్టర్ దబ్బేటి మహేష్ అకాల మరణం కేయూ విద్యార్థి లోకానికి, యావత్ తెలంగాణ.....

మహోద్యమ మెరుపు మహేష్

మలిదశ తెలంగాణ ఉద్యమం పురుడు పోసుకున్న కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థి జేఏసీ వ్యవస్థాపక సభ్యుడిగా కీలక పాత్ర పోషించిన డాక్టర్ దబ్బేటి మహేష్ అకాల మరణం కేయూ విద్యార్థి లోకానికి, యావత్ తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులకు తీవ్ర దుఃఖాన్ని కలిగించింది. తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన రాయినిగూడెం విద్యార్థుల నిరసనలో, మిలియన్ మార్చ్‌లో, మానుకోట ప్రతిఘటనలో కీలక పాత్ర పోషించి ప్రజాస్వామిక తెలంగాణను కలగన్న మహేష్.. ఆ కల పూర్తిగా సాకారం కాకముందే కరోనా మహమ్మారికి బలై అర్ధాంతరంగా డిసెంబర్ 23న అందరిని విడిచి వెళ్లాడు. కుటుంబ సభ్యులకే కాక, సహచర ఉద్యమకారులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు తీరని లోటు ఇది.


మలిదశ ఉద్యమానికి కాకతీయ యూనివర్సిటీ అనేక మంది విద్యార్థి నేతలను అందించింది. కేవలం యూనివర్సిటీకి మాత్రమే పరిమితం కాకుండా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులను నిలదీయడంలోనూ, ప్రశ్నించడంలోనూ, ఉద్యమంలో కలుపుకుపోవడంలోనూ కేయూ విద్యార్థి జేఏసీ కీలకపాత్ర పోషించింది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆమరణ దీక్షకు దిగడానికి ముందు కాకతీయ యూనివర్సిటీలో నవంబర్ 29, 2009న దివంగత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్‌తో కలిసి నిర్వహించిన విద్యార్థి సంఘాల సమావేశం మొదలు.. తెలంగాణ ఆవిర్భావం వరకూ జరిగిన అన్ని ఆందోళనలు, నిరసనల్లో ముందుండి నడిచిన కేయూ విద్యార్థి అగ్రనాయకులలో మహేష్ ఒకరు. 


విద్యార్థి నాయకుల్లో ఇప్పుడు కొందరు ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగుతుండగా.. మరికొందరు బతుకుదెరువు కోసం చిన్నాచితక ఉద్యోగాలు చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కురవి మండల కేంద్రానికి చెందిన మహేష్ ఉద్యమ సమయంలో విద్యార్థులంతా ఆశించినట్లుగానే తమ భవిష్యత్ జీవితానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పరిష్కారం చూపుతుందని కలలుగన్నాడు. కేయూ విద్యార్థి జేఏసీ నాయకుడిగా దబ్బేటి మహేష్ చేసిన ఆందోళనలు, తోటి విద్యార్థులతో ఆయన కలిసిపోయే తీరు, రాయినిగూడెం, మిలియన్ మార్చ్, సాగరహారం, మానుకోట ప్రతిఘటనలాంటి మిలిటెన్సీ పోరాటాల్లో ఆయన అనుసరించిన వ్యూహాలు, చేసిన సూచనలు ఇప్పటికీ మదిలో మెదులుతూనే ఉన్నాయి. కేయూ విద్యార్థి నాయకత్వంలో తెగింపును, ధైర్యాన్ని నూరిపోయడంలో మహేష్ పాత్ర మరువలేనిది. తెలంగాణ సమాజం పట్ల అర్థవంతమైన అవగాహన, ఆలోచనా దృక్పథం కలిగిన ఒక నికార్సైన ఉద్యమకారుడిగా ఆయన నిలిచాడు. తెలంగాణ యూనివర్సిటీ జేఏసీల నాయకత్వంలో ఉస్మానియా నుంచి కాకతీయ వరకు సాగిన 450 కిలోమీటర్ల దక్షిణ తెలంగాణ పాదయాత్రలో కేయూ తరఫున దేవోజీ నాయక్, అనపురం లింగన్నతో కలిసి మహేష్ కూడా నడిచాడు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను గ్రామగ్రామాన వివరించి చెప్పాడు. 


మహేష్ నాయకత్వ పటిమకు, తెలివితేటలకు, తెగువకు మిలియన్ మార్చ్, రాయినిగూడెం ఆందోళనలు నిదర్శనంగా నిలుస్తాయి. మిలియన్ మార్చ్‌కు వెళ్లకుండా పోలీసులు నిర్బంధం కొనసాగిస్తూ ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్న నేపథ్యంలో, ఎట్టకేలకు మా ఆరుగురు విద్యార్థి నాయకులు ఎంజీఎం హాస్పిటల్‌కు చేరుకొని అక్కడే ఓ అంబులెన్స్ మాట్లాడుకుని పేషెంట్ లా ఒకరిని పడుకోబెట్టి సైరన్ వేసుకుని నేరుగా ఉస్మానియా యూనివర్సిటీకి, అక్కడి నుంచి ట్యాంక్ బండ్‌కు చేరుకుని మిలియన్ మార్చ్‌లో పాల్గొన్నాం. ఈ చారిత్రక సందర్భంలో మహేష్ చూపిన చొరవ, ధైర్యం మరిచిపోలేనిది.


అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ములుగు సమీపంలోని రాయినిగూడెంలో రచ్చబండ కార్యక్రమానికి వస్తున్నారని తెలిసి ములుగు ఏరియాలోని గ్రామాల్లో విస్తృతమైన సంబంధాలు, స్నేహితులను కలిగి ఉన్న మహేష్ మా బృందం మూడు రోజులు అక్కడ ఉండడానికి సాయపడ్డాడు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కావడంతో అప్పటికే వేలాది పోలీసుల పహారాతో ఉన్నప్పటికీ విద్యార్థి నాయకత్వం అక్కడికి చేరుకోగలిగింది.


సరిగ్గా రచ్చబండ కార్యక్రమానికి రెండు గంటల ముందు పత్తి చేలల్లో దాగిన ఒకరిని, గడ్డివాములో దాగిన ఇంకొకరిని, వ్యవసాయ బావి వద్ద ఉన్న మరొకరిని పోలీసులు అరెస్టు చేశారు. కానీ సాధారణ ఆదివాసీ యువకుడిలాగా లుంగీ కట్టుకుని మా చుట్టూనే తిరుగుతున్న మహేష్‌ను పోలీసులు కనిపెట్టలేకపోయారు. కానీ, ముగ్గురు విద్యార్థి నాయకులను పక్కకు తీసుకెళ్లి పోలీసులు బెదిరిస్తూ మహేష్ గురించి ప్రశ్నిస్తుండడంతో వాళ్లకు ఏదైనా హాని జరుగుతుందన్న ఉద్దేశంతో ‘నేనే మహేష్’ అని ముందుకొచ్చి అరెస్ట్ కావడం జరిగింది. అలాంటి ఉద్యమకారుడిని కోల్పోవడం విద్యార్థి లోకానికి తీరని లోటు. మూడేళ్ల క్రితమే మహేష్ తమ్ముడు రోడ్డు యాక్సిడెంట్‌లో చనిపోగా, ఏడాది క్రితమే ఆయన తండ్రి సీతయ్యకు బైపాస్ సర్జరీ జరిగింది. మహేష్ మరణంతో భార్య రోహిణి, ఇద్దరు పిల్లలు, వృద్ధులైన తల్లిదండ్రులు అనాథలుగా మిగలకుండా వారిని ఆదుకునే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని ఆశిద్దాం.


సాదు రాజేష్ 

కేయూ విద్యార్థి జేఏసీ మాజీ చైర్మన్ 

(నేడు కురవిలో మహేష్ సంస్మరణ సభ)

Updated Date - 2022-01-01T06:17:04+05:30 IST