Abn logo
Sep 7 2021 @ 01:37AM

కృష్ణా జలాల పంపిణీకి ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేయాల్సిందే

  • పిటిషన్‌ ఉపసంహరించుకుంటున్నాం.. గెజిట్‌ అమలుకు మేం సహకరిస్తాం
  • కానీ, అభ్యంతరాలను పరిష్కరించాలి.. గెజిట్‌ అమలును వాయిదా వేయండి
  • గోదావరిపై 11 ప్రాజెక్టులు కొత్తవి కావు.. అనుమతులున్న ప్రాజెక్టులుగానే పరిగణించాలి
  • కాళేశ్వరం నుంచి రోజుకు ఒక టీఎంసీ అదనంగా తీసుకోవడం కొత్త ప్రాజెక్టు కాదు
  • కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో సీఎం కేసీఆర్‌.. దాదాపు గంటన్నరకు పైగా సమావేశం


న్యూఢిల్లీ/హైదరాబాద్‌, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): కృష్ణా జలాల పంపిణీకి కొత్త ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేయాల్సిందేనని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌కు సీఎం కేసీఆర్‌ స్పష్టం చేసినట్లు తెలిసింది. కిందటి సంవత్సరం అక్టోబరులో జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ నిర్ణయం మేరకు కొత్త ట్రైబ్యునల్‌ ఏర్పాటుపై సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నామని, కోర్టులో అప్లికేషన్‌ దాఖలు చేశామని, ఈ విషయంపై కేంద్రానికి ఇప్పటికే లేఖ రాశామని చెప్పినట్లు సమాచారం. కాబట్టి ట్రైబ్యునల్‌ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించాలని కోరినట్లు తెలిసింది.


సోమవారం రాత్రి ఢిల్లీలో షెకావత్‌తో సీఎం కేసీఆర్‌ సుదీర్ఘంగా భేటి అయ్యారు. దాదాపు గంటా నలభై నిమిషాల పాటు వారి సమావేశం జరిగింది. రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌ కుమార్‌, సీఎం సలహాదారు శ్రీధర్‌ రావు దేశ్‌పాండే, ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌లు మురళీధర్‌, హరిరాం, ఎస్‌ఈ కోటేశ్వర్‌ రావుతో పాటు కేంద్ర జలశక్తి శాఖ అధికారులు, జలశక్తి శాఖ సలహాదారు శ్రీరాం వెదిరె ఈ సమావేశంలో పాల్గొన్నారు. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటా గురించి సాక్ష్యాధారాలతో సహా కేంద్ర మంత్రికి కేసీఆర్‌ ఈ భేటీలో వివరించారని సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలోని ఒక్కో ప్రాజెక్టు ఆవశ్యకత.. తెలంగాణ పోరాటం, గోదావరి, కృష్ణా నదుల్లో నీటి లభ్యత, ఆ నదుల చరిత్ర గురించి కేంద్ర మంత్రికి సీఎం కూలంకషంగా వివరించినట్లు తెలిపాయి.


సహకరిస్తాం గానీ..

కృష్ణా, గోదావరి నదుల బోర్డుల పరిధులను ఖరారు చేస్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలుకు సహకరిస్తామని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చినట్లు తెలిసింది. అయితే, దానికి ముందు తాము లేవనెత్తిన అభ్యంతరాలను పరిష్కరించాలని ఆయన ప్రతిపాదించినట్లు సమాచారం. వచ్చే నెల నుంచి గెజిట్లను అమలు చేయాలని నిర్ణయించినందున.. ఇంత తక్కువ సమయంలో అమలు సాధ్యంపై కేసీఆర్‌ అనుమానాలు వ్యక్తం చేశారు. గెజిట్‌ల అమలుకు మరికొంత సమయం పాటు వాయిదా వేయాలని ప్రతిపాదించినట్లు విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. కాగా, ఇటీవల జరిగిన కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ సమావేశాల్లో పాల్గొన్నామని ముఖ్యకార్యదర్శి రజత్‌ కుమార్‌ కేంద్ర మంత్రితో అన్నారు. 


అవి కొత్తవి కావు..

గోదావరి నదీ బేసిన్‌లో తెలంగాణ ఏర్పడకముందే ప్రారంభించిన 11 ప్రాజెక్టులను కేంద్రం జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌లో అనుమతి లేనివిగా పేర్కొన్నారని సీఎం కేసీఆర్‌ ఈ భేటీలో ఆక్షేపించారు. అవి కొత్త ప్రాజెక్టులు కాదని, పాతవేనని స్పష్టం చేశారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి వినతి పత్రం అందించారు. రాష్ట్రానికి కేటాయించిన 967.94 టీఎంసీల నీటి పరిధిలోనే ఈ ప్రాజెక్టులు ఉన్నాయని, అందులో 758.76 టీఎంసీల వినియోగానికి సంబంధించిన ప్రాజెక్టులను కేంద్ర జలసంఘం ఇప్పటికే క్లియర్‌ చేసిందని, మరో 148.82 టీఎంసీలకు సంబంధించి నీటి లభ్యతపై హైడ్రాలజీ డైరెక్టరేట్‌ క్లియర్‌ చేసిందని అందులో పేర్కొన్నారు. భవిష్యత్తు ప్రాజెక్టులు, ఎవాపరేషన్‌ నష్టాలకు మిగతా 60.26 టీఎంసీలను రిజర్వు చేశామని తెలిపారు.


ఇచ్చంపల్లి, ఇందిర సాగర్‌, రాజీవ్‌ సాగర్‌, దేవాదుల ఎత్తిపోతల పథకాలకు అన్ని అనుమతులూ ఉన్నాయని వివరించారు. ఈ నాలుగు ప్రాజెక్టులకూ 155 టీఎంసీల కేటాయింపులు కేంద్ర జల సంఘం నుంచి లభించాయని స్పష్టం చేశారు. ‘‘తెలంగాణ ఏర్పడిన తర్వాత 70 టీఎంసీల కేటాయింపులతో సీతారామ ప్రాజెక్టు, 60 టీఎంసీలతో దేవాదుల (తుపాకులగూడెం వద్ద బ్యారేజీతో), 4.5 టీఎంసీలతో ముక్తేశ్వర్‌ (చిన్న కాళేశ్వరం) ఎత్తిపోతల పథకం, 3 టీఎంసీలతో రామప్ప - పాకాల లింక్‌, 2.14 టీఎంసీలతో మొడికుంట వాగు, 0.8 టీఎంసీలతో చౌటుపల్లి హనుమంత రెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టులను చేపట్టాలని నిర్ణయించాము. 14.56 టీఎంసీలను రిజర్వుగా వదిలేస్తే ఈ ప్రాజెక్టులకు 140.44 టీఎంసీలు ఉంటాయి. కేంద్ర జలసంఘం ఇప్పటికే ఆమోదించిన నీటి కేటాయింపుల మేరకు ఈ ప్రాజెక్టులను చేపడుతున్నాం. ఈ ప్రాజెక్టుల వివరణాత్మక ప్రాజెక్టు నివేదికలను త్వరగా ఆమోదించండి’’ అని విజ్ఞప్తి చేశారు.


కాళేశ్వరం కొత్త ప్రాజెక్టు కాదు 

కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రోజుకు ఒక టీఎంసీ అదనంగా తీసుకోవడం అదనపు ప్రాజెక్టు లేదా కొత్త ప్రాజెక్టు కాదని కేంద్ర మంత్రికి సీఎం తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులకు కేంద్ర జలసంఘం చేసిన 240 టీఎంసీల నీటి కేటాయింపులను వినియోగించుకోడానికి రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే అదనపు టీఎంసీని తోడుకునే పనులు చేపడుతున్నామని, అందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి అవసరం లేదని స్పష్టం చేశారు.


అలాగే.. ‘‘చిన్న నీటిపారుదల పథకమైన కందకుర్తి ఎత్తిపోతల పథకం 3300 ఎకరాల ఆయకట్టుకు నీళ్లు అందిస్తున్నది. దీనికి అనుమతులు అవసరం లేదు. రామప్ప పాకాల లింక్‌, తుపాకులగూడెం బ్యారేజీ దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగం కాబట్టి కొత్తగా అనుమతులు అవసరం లేదు. గూడెం ఎత్తిపోతల పథకం ఇప్పటికే ఆమోదించిన కడెం ప్రాజెక్టులో భాగం కాబట్టి దీనికీ అనుమతులు అవసరం లేదు. కంతానపల్లి ప్రాజెక్టును కూడా అనుమతి లేని ప్రాజెక్టుల జాబితా నుంచి తీసివేయాలి’’ అని కేసీఆర్‌ ప్రతిపాదించారు.


ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు, కేంద్ర జల సంఘానికి ఆదేశాలివ్వాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. అయితే, కృష్ణాజలాలపై ప్రతిపాదించిన ప్రాజెక్టులకు సంబంధించి మాత్రం సీఎం వినతిపత్రం ఇవ్వలేదు.  కృష్ణాజలాలకు సంబంధించిన అంతరాష్ట్ర ప్రాజెక్టులనే బోర్డు పరిధిలోకి తీసుకోవాలని ఈసందర్భంగా విజ్ఞప్తి చేశారు.