వచ్చే దసరాకు సిద్దిపేటకు రైలు కూత

ABN , First Publish Date - 2022-10-07T04:56:18+05:30 IST

వచ్చే దసరా నాటికి ప్రజల కోరిక నెరవేరి సిద్దిపేటలో రైలు కూత వినిపిస్తోందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. దసరా ఉత్సవాల్లో భాగంగా బుధవారం సిద్దిపేట అర్బన్‌ మండలం రంగధాంపల్లి, నర్సాపూర్‌లో జరిగిన రావణ దహన కార్యక్రమంలో పాల్గొని పాలపిట్టను ఎగరవేశారు.

వచ్చే దసరాకు సిద్దిపేటకు రైలు కూత
పాలపిట్టను ఎగురవేస్తున్న మంత్రి హరీశ్‌రావు


జనవరి 1న ఐటీ టవర్‌ ప్రారంభం

రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు


సిద్దిపేట అర్బన్‌, అక్టోబరు 6 : వచ్చే దసరా నాటికి ప్రజల కోరిక నెరవేరి సిద్దిపేటలో రైలు కూత వినిపిస్తోందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. దసరా ఉత్సవాల్లో భాగంగా బుధవారం సిద్దిపేట అర్బన్‌ మండలం రంగధాంపల్లి, నర్సాపూర్‌లో జరిగిన రావణ దహన కార్యక్రమంలో పాల్గొని పాలపిట్టను ఎగరవేశారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ విజయదశమి పండుగ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. సీఎం కేసీఆర్‌ దీవెనలు, సిద్దిపేట ప్రజల ఆశీస్సులతో నియోజకవర్గాన్ని నంబర్‌ వన్‌స్థాయిలో నిలబెట్టామని,  రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచామన్నారు. ఊపిరి ఉన్నంతవరకు సిద్దిపేట ప్రజలకు సేవ చేస్తానని అన్నారు. అందరూ ఆనందంగా ఉండాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తున్నానని మంత్రి తెలిపారు. సిద్దిపేట ఒక విద్యాక్షేత్రంగా అభివృద్ధి చెందుతోందని, సరస్వతి నిలయంగా మార్చుకుంటున్నామని తెలియజేశారు. 1500 మందికి ఉద్యోగాలు కల్పించే ఐటీ టవర్‌ను జనవరి 1న ప్రారంభించుకోబోతున్నామని చెప్పారు. కాళేశ్వరం నీళ్లు తెచ్చుకుని లక్ష ఎకరాలకు సాగు నీరు ఇచ్చుకుంటున్నామని.. సిద్దిపేటను సస్యశ్యామలం చేసుకోవడం ఎంతో ఆనందాన్ని ఇస్తోందన్నారు. వంద కోట్లతో రంగనాయక సాగర్‌ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నామన్నారు. 

సిద్దిపేట అర్బన్‌ మండలం ఎన్సాన్‌పల్లి, పొన్నాల, మిట్టపల్లి గ్రామాల్లో దసరా సందర్భంగా రావణ దహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నవరాత్రుల్లో భాగంగా తెల్లవారుజాము నుంచే అమ్మవారి ఆలయాలకు క్యూ కట్టారు. అమ్మవారిని ప్రార్థించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేకంగా షమీ పూజలు నిర్వహించారు. రంగధాంపల్లిలో  రావణ దహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, స్థానిక కౌన్సిలర్‌ వంగ రేణుకతిరుమలరెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు రంగదాంపల్లి శ్రీనివాస్‌, భాను తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-07T04:56:18+05:30 IST