జడ్పీలో బదిలీల రభస

ABN , First Publish Date - 2022-07-02T11:56:42+05:30 IST

జడ్పీ కార్యాలయంలో శుక్రవారం బదిలీల రభస చోటుచేసుకుంది. అడ్డగోలుగా బదిలీలు చేశారంటూ ఏఓ అనంతప్రకాష్‌ గగ్గోలు పెట్టారు. జడ్పీ సీఈఓపై మండిపడ్డారు. అయిన వారిని అందలం ఎక్కించి కానివారిని సుదూర ప్రాంతాలకు విసిరివేశారని ఆక్రోశించారు.

జడ్పీలో బదిలీల రభస

అడ్డగోలుగా బదిలీలు చేశారంటూ ఏవో అనంత ప్రకాష్‌ గగ్గోలు

సీఈవో తీరుపై మండిపాటు

మొత్తం 302 మందికి స్ధాన చలనం

డీపీవోలో 158 మంది బదిలీ

కడప (రూరల్‌), జూలై 1:  జడ్పీ కార్యాలయంలో శుక్రవారం బదిలీల రభస చోటుచేసుకుంది. అడ్డగోలుగా బదిలీలు చేశారంటూ ఏఓ అనంతప్రకాష్‌ గగ్గోలు పెట్టారు. జడ్పీ సీఈఓపై మండిపడ్డారు. అయిన వారిని అందలం ఎక్కించి కానివారిని సుదూర ప్రాంతాలకు విసిరివేశారని ఆక్రోశించారు. జడ్పీ పరిధిలో బదిలీ అయిన ఉద్యోగులకు శుక్రవారం జడ్పీ సమావేశ హాలులో పోస్టింగ్‌ ఆర్డర్స్‌ ఇచ్చారు. వల్లూరు మండల పరిషత్‌ కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌(ఏఓ)గా పనిచేస్తున్న పి.అనంతప్రకా్‌షను పోరుమామిళ్ల మండల ఏఓగా బదిలీచేశారు. ఈయన ఆర్డర్స్‌ కాపీ తీసుకుని ప్లేస్‌ పోస్టింగ్‌ చూడగానే ఆవేదనకు లోనయ్యారు. అడ్మినిస్ట్రేటివ్‌ గ్రౌండ్‌ పేరుతో దూర ప్రాంతానికి పంపించడం ఏ పాటి న్యాయమని సీఈఓను నిలదీశారు. జడ్పీశాఖలో తమ కంటే ఎక్కువ కాలం పనిచేస్తున్న వారు చాలామంది ఉన్నారని వారిని ఎందుకు బదిలీ చేయలేదని ప్రశ్నించారు. రాచమర్యాదలు చేస్తున్న వారిని అందలం ఎక్కిస్తున్నారని, కానివారిని తొక్కిపడేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బదిలీల పేరుతో తమకు తీరని అన్యాయం చేశారని ఏఓ ప్రకాష్‌ లాగానే పెద్దల అండలేని మరికొందరు ఉద్యోగులు కూడా ఆరోపిస్తున్నారు.


302 మంది బదిలీలు 

జడ్పీ పరిధిలోని వివిధ క్యాడర్లకు సంబంధించి మొత్తం 302 మందిని సాధారణ, రిక్వెస్ట్‌, అడ్మినిస్ట్రేటివ్‌ గ్రౌండ్స్‌ కింద బదిలీచేశారు. వీరిలో ఎంపీడీఓలు ఆరుగురు, ఆడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్లు(ఏఓ) 20 మంది, సీనియర్‌ సహాయకులు 40 మంది, జూనియర్‌ సహాయకులు 103 మంది, రికార్డు అసిస్టెంట్స్‌ 65 మంది, ఆఫీస్‌ సబార్డినేట్స్‌ 31 మంది, వాచ్‌మెన్‌లు 9 మంది, టైపిస్టులు 28 మంది ఉన్నారు. వీరందరికీ జడ్పీ సీఈఓ ఎం.సుధాకర్‌రెడ్డి, జడ్పీ వైస్‌ చైర్మన్‌ పిట్టు బాలయ్య, డిప్యూటీ సీఈఓ రమణారెడ్డి ఆర్డర్స్‌ అందజేశారు. 


డీపీవో శాఖలో 158 మంది..

జిల్లా పంచాయతీ కార్యాలయం (డీపీవో)శాఖలో వివిధ క్యాడర్లకు సంబంధించి 158 మంది అధికారులు, ఉద్యోగులను సాదారణ, రిక్వెస్ట్‌, అడ్మినిస్ట్రేటివ్‌ గౌండ్స్‌ కింద బదిలీచేశారు. ఇందులో భాగంగా కడప డీపీవో కార్యాలయంలో ఏవోగా పనిచేస్తున్న విశ్వనాఽథరెడ్డి అనంతపురం జిల్లాకు బదిలీ అయ్యారు. అక్కడ ఏవోగా పనిచేస్తున్న ఖాదర్‌బాషా ఇక్కడికి వచ్చారు. అలాగే జమ్మలమడుగు డీఎల్‌పీవోతో పాటు గ్రేడ్‌-1 నుంచి గ్రేడ్‌ 4 వరకు పనిచేస్తున్న 142 మంది పంచాయతీ సెక్రటరీలను బదిలీచేశారు. 


9మంది ఏపీపీలు బదిలీ

ఉమ్మడి వైఎస్సార్‌ కడప జిల్లాలోని వివిధ కోర్టుల్లో పనిచేసే అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు సహా సీనియర్‌ అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు తొమ్మిది మందిని బదిలీచేశారు. ఈ మేరకు రాష్ట్ర హైకోర్టు నుంచి శుక్రవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. కడప ఎక్సైజ్‌ కోర్టులో ఏపీపీగా పనిచేసే ఎస్‌.తాజీద్‌బాషాను సిద్దవటంలో అడిషినల్‌ జ్యుడీషియల్‌ మెజిస్ర్టేట్‌ ఆఫ్‌ ఫస్ట్‌ క్లాస్‌(జేఎఫ్‌సీఎం) కోర్టుకు బదిలీచేశారు. రైల్వేకోడూరులోని జేఎఫ్‌సీఎం కోర్టులో ఏపీపీగా పనిచేస్తున్న సి.భానుకిరణ్మయి తిరుపతిలోని మూడో ఏజేఎ్‌ఫసీఎం కోర్టుకు బదిలీ అయ్యారు. రాజంపేటలోని జేఎఫ్‌సీఎం కోర్టులో ఏపీపీగా పనిచేస్తున్న ఎ.ఉమాదేవి బద్వేలులోని జేఎఫ్‌సీఎం కోర్టుకు, జమ్మలమడుగులోని జేఎఫ్‌సీఎం కోర్టులో ఏపీపీగా పనిచేస్తున్న ఎం.జ్యోతి పులివెందులలోని జేఎఫ్‌సీఎం కోర్టుకు, సిద్దవటంలోని జేఎఫ్‌సీఎం కోర్టులో ఏపీపీగా పనిచేస్తున్న వి.శ్రీనివాసులు అనంతపురంలోని మొబైల్‌ కోర్టుకు బదిలీ అయ్యారు. పులివెందులలోని జేఎఫ్‌సీఎం కోర్టులో ఏపీపీగా పనిచేస్తున్న ఎన్‌.శ్రీకాంత్‌ కడపలోని ఎక్సైజ్‌కోర్టుకు, లక్కిరెడ్డిపల్లెలోని జేఎఫ్‌సీఎం కోర్టులో ఏపీపీగా పనిచేస్తున్న జి.మధుసూధనాచారి హిందూపురంలోని జేఎఫ్‌సీఎం కోర్టుకు, బద్వేల్‌లోని జేఎఫ్‌సీఎం కోర్టులో ఏపీపీగా పనిచేస్తున్న డి.చిన్నబాబు రైల్వేకోడూరులోని జేఎఫ్‌సీఎం కోర్టుకు, ప్రొద్దుటూరులోని ఒకటవ ఏజేఎఫ్‌సీఎం కోర్టులో ఏపీపీగా పనిచేస్తున్న ఎం.దుర్గాదేవి అనంతపురంలోని పీడీఎం కోర్టుకు బదిలీ అయ్యారు.

Updated Date - 2022-07-02T11:56:42+05:30 IST