కరోనా.. వణుకు

ABN , First Publish Date - 2020-07-05T11:35:25+05:30 IST

జిల్లా వ్యాప్తంగా కరోనా దూకుడు ఏ మాత్రం తగ్గనేలేదు.ఇప్పటి వరకూ వైరస్‌ ప్రవేశించని మండలాల్లోనూ తొలి సారిగా అడుగులు

కరోనా.. వణుకు

తెలియకుండానే చనిపోతున్నారు

చనిపోయిన ముగ్గురికి పాజిటివ్‌గా నిర్ధారణ

కొత్త ప్రాంతాలకు పాకుతున్న కరోనా వైరస్‌

ప్రతీ రోజూ వందల సంఖ్యలో నమోదు

జిల్లాలో మొత్తం 1698 కేసులు


ఎక్కడి నుంచి వస్తుంది.. ఎలా వస్తుంది.. అయినా మనకెందుకు వస్తుంది.. ఏదో సాధారణ జ్వరం అయిఉంటుందిలే.. ఆసుపత్రికి వెళితే హడావుడి.. ఇదే నిర్లక్ష్యం ప్రస్తుతం పదుల సంఖ్యలో ప్రాణాలను హరిస్తోంది.. కడసారి చూపునకు నోచుకోకుండా తరలిరాని లోకాలకు తీసుకెళ్లిపోతోంది.. బంధువుల్లో వణుకు పుట్టిస్తోంది.. తాజాగా శనివారం జరిగిన సంఘటనలే దీనికి నిదర్శనం..ఆకివీడు, పినకడిమి, నరసాపురంలో శనివారం మృతిచెందిన ముగ్గురిదీ ఇదే పరిస్థితి.. జ్వరమనుకుని ఆసుపత్రిలో చేరారు.. అంతలోనే ప్రాణాలు వదిలారు.. తీరా ముగ్గురి మృతదేహాలకు పరీక్ష చేస్తే కరోనా పాజిటివ్‌.. ఏదో పెద్ద వయసా అంటే అదీ కాదు.. ఇద్దరూ యువతే..మరొకాయనకు 50 ఏళ్లు.. అందుకే కరోనాతో తస్మాత్‌ జాగ్రత్త.. జ్వరం వచ్చిందా.. జాగ్రత్తపడాల్సిందే.. లేదంటే ప్రాణాలనే హరించేస్తుంది.


ఏలూరు,  జూలై 4  (ఆంధ్రజ్యోతి) : జిల్లా వ్యాప్తంగా కరోనా దూకుడు ఏ మాత్రం తగ్గనేలేదు.ఇప్పటి వరకూ వైరస్‌ ప్రవేశించని మండలాల్లోనూ తొలి సారిగా అడుగులు వేస్తోంది.అక్కడక్కడ పాజిటివ్‌ కేసులు బయటపడుతు న్నాయి.ఆఖరికి ప్రముఖ నేతలు, జిల్లా,మండల స్థాయి అధికారులు వరుసగా వైరస్‌ బారినపడుతున్నారు.ఏలూరులో కేసులు మరింతగా పెరుగుతున్నాయి. ఇప్పటికే వెయ్యికి చేరువగా ఉన్న కేసుల సంఖ్యకు తోడు మరిన్ని కొత్తగా నిర్ధారణ అవుతున్నాయి.తాజాగా శనివారం ఒక్కరోజే దాదాపు 51 కేసులు రాగా  ఇప్పటి వరకూ జిల్లాలో 1698 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.


ఒక్క ఏలూరు లోనే 30 కేసులు ఉన్నాయి.గొర్రెలవారి వీధి, దాసరివారి వీధి,గాదెవారివీధి, కొత్తపేట, వట్లూరులోని సీఆర్‌ ఆర్‌ కొవిడ్‌ కేర్‌ సెంటర్‌,రంగూన్‌ మేడ వద్ద నమోదయ్యాయి.తాడేపల్లిగూడెం 25, 28వ వార్డుల్లో రెండు,పెరవలి, కుక్కు నూరు,నిడదవోలు, పెనుమంట్ర, పాలకొల్లు బ్రాడీపేటలోని ఐదో వీధి,ఆకివీడు, ఉండి, గరగపర్రు, యండగండి, పెంటపాడు మండలం రాచర్ల,మొగల్తూరు మండలం రామన్నపాలెం,నరసాపురం ఒక్కొ క్కటి చొప్పున నమోద య్యాయి. భీమవరం బ్యాంకు కాలనీ, బేతపూడి పోస్టాఫీసు వద్ద, ఎల్‌వీఎన్‌పురంలలో ఐదు కేసులు నమోదయ్యాయి. కొపర్రులో రెండు నమోదయ్యాయి. 


కరోనా మరణ మృదంగం

గడిచిన కొద్ది రోజులుగా కరోనా లక్షాణాలేవీ బయటకు కనిపించకుండానే అంతర్గతంగా సంక్రమించి ప్రజల ప్రాణాలను హరించి వేస్తోంది. గడచిన వంద రోజుల కాలంలో తొలి రెండున్నర నెలల్లో ఇలాంటి మరణాలు నమోదు కాలేదు. నెల రోజులుగా మరణాల సంఖ్య ఒక్కసారిగా ఆరంభమై క్రమేపీ పెరుగుతోంది.  జిల్లాలో ఐసొలేషన్‌ వార్డుల్లో చేరిన వారిలో మరణించిన వారి సంఖ్య దాదాపు అత్యల్పమే. కానీ వివిధ కారణాలతో ఆసుపత్రుల్లో చేరడం లేదా ఇంటి వద్దే తోచినట్టుగా మందులేసుకుని రోగం కాస్త తీవ్రమైన తర్వాత మరణపుటంచు నకు చేరుతున్నారు. అధికారికంగా ఇప్పటిదాకా జిల్లాలో మృతి చెందినవారి సంఖ్య నాలుగుకే పరిమితం కాగా ఇక ఆసుపత్రికి వచ్చి మరణించిన వారు, ఇంటి వద్దే ఏదో కారణంతో మృతిచెందిన వారికి పరీక్షలు నిర్వహించిన సందర్భంలో ఎక్కువ మందికి పాజిటివ్‌ బయటపడుతోంది.


ఈ రకంగా జిల్లాలో ఇప్పటికే దాదాపు 25 మందికి పైగానే కన్నుమూశారు. వీరి మరణం ప్రత్యేకించి కొవిడ్‌ చావుల జాబితాల్లో చేరనేలేదు. ఎక్కువ మంది పాజిటివ్‌ లక్షణాలు కన పడకపోవడం వల్లే కాస్తంత నిర్లక్ష్యంగా వ్యవహరించి చివరకు ప్రాణాలమీదకు తెచ్చుకున్నారు. ఇప్పుడది తీవ్రస్థాయిలో పుంజుకుంటుంది. కరోనా లక్షణాల్లో మార్పులు, చేర్పులు చోటుచేసుకున్నాయి. తొలుత దగ్గు, జలుబు, జ్వరం ఈ మూడింటితో బాధపడేవారందరికీ పరీక్షలు నిర్వహించి పాజిటివ్‌ సోకితే ఐసొ లేషన్‌వార్డుకి లేదా క్వారంటైన్‌కు తరలించేవారు. ఇప్పుడా పరిస్థితి లేనేలేదు. ప్రత్యేకించి ఇప్పుడు రుచి కోల్పోవడం లక్షణంగా కనిపిస్తోంది.


ముక్కు వెంట నీరు కారడం, ఒళ్ళునొప్పులు, జ్వరం వంటి లక్షణాలు కూడా వైరస్‌ ప్రబలడానికి ముందుగా వచ్చే ప్రాథమిక గుణాలు. అలాగని కాస్తంత నీరసంగా ఉండి ఏదైనా ఆసుపత్రికి వెళదామంటే వెంటాడుతున్న భయమే ఆ తరువాత ప్రాణం మీదకు తెస్తోంది. ఇప్పుడెక్కువగా నమోదవుతున్న పాజిటివ్‌ కేసుల్లో ఇంటి పట్టున ఉన్నవారే ఎక్కువ మంది. కానీ వీరందరికీ పాజిటివ్‌ ఏదో రూపంలో సంక్రమించింది. ఉద్యోగులు మొదటి నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా వారికి కూడా కరోనా అలవోకగా సంక్రమిస్తోంది. ఏకంగా రెండు డజన్లకు పైగానే ఉద్యోగులకు కరోనా సోకింది. ప్రస్తుత పరిస్థితిని అంచనా వేస్తున్న వైద్యులు రానున్న రోజుల్లో వైరస్‌ లక్షణాలతో ఆసుపత్రులకు వచ్చేవారి సంఖ్య  ఊహిం చలేమని చెబుతున్నారు. 


కొవిడ్‌ ఆసుపత్రులు పెంపు..

 కరోనా వైరస్‌ సోకిందేమోనన్న అనుమానం తీర్చుకునేందుకు ఎక్కువ మంది కరోనా టెస్టులకు ఆసుపత్రులకు వస్తున్నారు.లక్షణాలు ఏవీ బయట పడకుండానే  వైరస్‌ సంక్రమిస్తున్నట్టు ఎక్కువ మంది భావిస్తున్నారు. అయితే ప్రజల్లో వచ్చిన చైతన్యం మంచిదేనని వైద్యులు చెబుతున్నారు. ఇటీవల వైరస్‌ పరీక్షలకు అత్యధికులు ప్రభుత్వాసుపత్రులకు వస్తుండడంతో ఏకంగా జిల్లా కలెక్టర్‌ ముత్యాల రాజు స్పందించాల్సి వచ్చింది. ఎవరూ భయపడక్కరలేదని, ప్రకటిస్తూనే నగరంలో ఉన్న కొన్ని కమ్యూనిటీ ఆసుపత్రులు ఈ తరహా టెస్టులు నిర్వహించబోతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఏలూరు ఆసుపత్రితో పాటు అదనంగా తాడేపల్లిగూడెం,భీమవరం కమ్యూనిటీ ఆసుపత్రిని ఇక ముందు కొవిడ్‌ ప్రత్యేక ఆసుపత్రులుగా పరిగణిస్తున్నారు. చికిత్సకు వచ్చే రోగు లకు పొరుగున ఉన్న హెల్త్‌ సెంటర్లను సూచిస్తున్నారు. ఇదంతా బాగానే ఉన్నా ప్రత్యేకించి ఏదైనా వ్యాధితో చికిత్సకు వెళదామంటే ఇప్పుడు వైద్యమే అందు బాటులో లేకుండా పోయింది. దాదాపు ఆర్‌ఎంపీలు దగ్గరికి ప్రత్యేకించి ఎవరూ వెళ్ళడమే లేదు. పేరొందిన వైద్యులు తమ ఆసుపత్రులను మూసి ఉంచారు లేదా ప్రత్యేకించి కొందరికి మాత్రమే రోజువారీ వైద్యం అందిస్తున్నారు. ఈ విపత్కర పరిస్థితి జిల్లా ప్రజలను అయోమయంలో పడేస్తోంది. 


16 కొత్త కంటైన్మెంట్‌ జోన్లు ఏర్పాటు.. 

జిల్లాలో నూతనంగా 16 కంటైన్మెంట్‌ జోన్‌లు ప్రకటించినట్టు ముత్యాలరాజు తెలిపారు. ఈ ప్రాంతాల్లో కొత్తగా పాజిటివ్‌ కేసులు నమోదు అయినందున కరోనా వ్యాప్తి నిరోధించేందుకు కంటైన్మెంట్‌ జోన్‌లు ప్రారంభిస్తున్నామన్నారు. గణపవరం సచివాలయం-4, పాలకొల్లు 9 వార్డు సాయి దేవాలయం వద్ద, లింగపాలెం మండలం ఆశన్నగూడెం, తాడేపల్లిగూడెం 12 వార్డు కొబ్బరితోట, తణకు 5వార్డు, పాలకొల్లు రూరల్‌ మండలం ఉల్లంపర్రు పసర్లవీధి, ఏలూరు అమీనా పేట, బాపిస్టుపేట, పెదదేగి మండలం జెసెఫ్‌ నగర్‌ దుగ్గిరాల, ఏలరు రూరల్‌ మండలం హేలపురి నగర్‌ సచివాలయం-6, ఏలూరులోని లక్ష్మీవారపుపేట, భీమవరం 16 వార్డు యనిజల వారి వీధి, పాలకొల్లు మండలం దగ్గులూరు, నరసాపురం 11వ వార్డు, పెదవేగి మండలం ముండూరు 6 వార్డు, గణపవరం మండలం వరదరాజులపురం.


9 కంటైన్మెంట్లుఎత్తివేత

జిల్లా వ్యాప్తంగా 9 ప్రాంతాల్లో కంటైన్మెంట్‌ జోన్లు ఎత్తివేసినట్టు కలెక్టర్‌ తెలిపారు.పాలకోడేరు మండలం విస్సాకోడేరు, లింగపాలెం మండలం ములం గలంపాడు, పెదపాడు మండలం విద్యుత్‌ కాలనీ, ఏలూరు  మహేశ్వరపురం, శ్రీపర్రు, లక్ష్మీసూర్యనగర్‌, బీడీ కాలనీ తంగెళ్లమూడి, కొవ్వూరు మండలం వాడపల్లి బంగారమ్మపేట, పెరవలి మండలం నల్లాకుల వారిపాలెం, భీమవరం కొవ్వాడ అన్నవరం,ద్వారకాతిరుమల మండలం శరభాపురం,కన్నాపురం,  ప్రాం తాల్లో సాధారణ కార్యాకలాపాలు నిర్వహించుకోవచ్చని కలెక్టర్‌ తెలిపారు. 


మాజీ మంత్రికి పాజిటివ్‌..

మాజీ మంత్రికి కరోనా పాజిటివ్‌గా నమోదైంది. మూడు రోజుల కిందట మునిసిపల్‌ మాజీ చైర్మన్‌కు పాజిటివ్‌ సోకగా ఆయనతో సన్నిహితంగా ఉండే మాజీ మంత్రికి పరీక్షలు చేశారు. పాజిటివ్‌గా తేలడంతో ఏలూరు ఆశ్రం ఆసుపత్రి ఐసోలేషన్‌కు తరలించారు. ఈ మేరకు కడకట్లలో రెడ్‌జోన్‌గా ప్రకటించారు. మరో మాజీ మునిసిపల్‌  చైర్మన్‌కు తాజాగా కరోనా వైరస్‌ సంక్రమించింది. 

Updated Date - 2020-07-05T11:35:25+05:30 IST