సామూహిక అఘాయిత్యం జరిగినట్లు రుజువు చెయ్యకపోతే చితకబాదుతాం : టీఎంసీ నేత

ABN , First Publish Date - 2022-04-16T19:48:04+05:30 IST

పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ నేత అఫ్రోజ్ సర్కార్ ప్రతిపక్షాలను

సామూహిక అఘాయిత్యం జరిగినట్లు రుజువు చెయ్యకపోతే చితకబాదుతాం : టీఎంసీ నేత

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ నేత అఫ్రోజ్ సర్కార్ ప్రతిపక్షాలను హెచ్చరిస్తూ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. నాదియా జిల్లాలోని, హన్స్‌ఖలీలో ఇటీవల ఓ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం, హత్య జరిగినట్లు నిరూపించకపోతే, ఈ ఆరోపణలు చేసినవారిని చితక్కొడతామని హెచ్చరించడంతో అందరూ అవాక్కవుతున్నారు. 


టీఎంసీ భగబంగోలా బ్లాక్ వన్ కమిటీ అధ్యక్షుడు అఫ్రోజ్ సర్కార్ మాట్లాడుతూ, మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగిందని రుజువు చేయాలని, ముఖ్యమంత్రి మమత బెనర్జీని అపఖ్యాతిపాలు చేయడం మానుకోవాలని, లేదంటే తాము ఈ ఆరోపణలు చేసేవారి నోరు దుడ్డు కర్రలతో మూయిస్తామని హెచ్చరించారు. ‘‘నేను ఎవరికీ భయపడను. మా నేత మమత బెనర్జీకి సొంత కొడుకు లేకపోవచ్చు, కానీ నేను ఆమె కొడుకుని’’ అని చెప్పారు. 


సామూహిక అత్యాచారం జరిగితే, నిందితులను అరెస్టు చేయాలని పోలీసులను కోరుతామన్నారు. అయితే మమత బెనర్జీని ఈ విధంగా అపఖ్యాతిపాలు చేయవద్దని చెప్పారు. ఇలాంటి విమర్శల వల్ల ఆమెను గద్దె దించడం సాధ్యం కాదన్నారు. 


అఫ్రోజ్ వ్యాఖ్యలను బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం తీవ్రంగా ఖండించాయి. బాధితురాలి తల్లిదండ్రుల కథనం ప్రకారం, పద్నాలుగేళ్ళ బాలిక ఓ టీఎంసీ నేత కుమారుని పుట్టిన రోజు వేడుకలకు వెళ్ళినపుడు ఈ నెల 4న సామూహిక అత్యాచారానికి గురైంది. ఆ మర్నాడు తీవ్ర రక్తస్రావం జరగడంతో ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి మమత బెనర్జీ స్పందిస్తూ, ఇది ప్రేమ వ్యవహారమని, ఈ విషయం బాధితురాలి కుటుంబ సభ్యులకు తెలుసునని చెప్పారు. ఓ జంట బాంధవ్యంలో ఉంటే, తాను ఆపగలనా? అన్నారు. ఇది ఉత్తర ప్రదేశ్ కాదని, ఇక్కడ లవ్ జీహాద్ చేయబోమని అన్నారు. ఇది వారి వ్యక్తిగత స్వేచ్ఛ అని తెలిపారు. ఏదైనా తప్పు జరిగితే పోలీసులు నిందితులను అరెస్టు చేస్తారన్నారు. 


మమత వ్యాఖ్యలపై కూడా ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ కేసుపై దర్యాప్తు బాధ్యతలను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి కలకత్తా హైకోర్టు మంగళవారం అప్పగించింది. సీబీఐ బృందం శుక్రవారం ఈ గ్రామంలో నిందితుని ఇంటికి వెళ్లి దర్యాప్తు ప్రారంభించింది. 


Updated Date - 2022-04-16T19:48:04+05:30 IST