ప్రవాసీ విధానాన్ని పరిశీలించేందకు కేరళ వెళ్లిన తెలంగాణ ప్రవాసీ బృందం

ABN , First Publish Date - 2021-04-09T23:41:15+05:30 IST

కేరళ తరహా ప్రవాసీ సంక్షేమ విధానాన్ని అమలు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం పదేపదే చెబుతోంది. ఈ క్రమంలో కేరళలో అమలవుతున్న ప్రవాసీ సంక్షేమ విధానాన్ని అధ్యయనం చేసేందుకు తెలంగా

ప్రవాసీ విధానాన్ని పరిశీలించేందకు కేరళ వెళ్లిన తెలంగాణ ప్రవాసీ బృందం

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: కేరళ తరహా ప్రవాసీ సంక్షేమ విధానాన్ని అమలు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం పదేపదే చెబుతోంది. ఈ క్రమంలో కేరళలో అమలవుతున్న ప్రవాసీ సంక్షేమ విధానాన్ని అధ్యయనం చేసేందుకు తెలంగాణ గల్ఫ్ జేఏసీ బృందం కేరళ వెళ్లింది. కేరళ స్టేట్ బ్యాక్వర్డ్ డెవెలప్మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్ (కేఎస్‌బీసీడీసీ) ఎం.డీ బాల భాస్కరన్‌ ఇతర ఉన్నతాధికారులతో శుక్రవారం ఈ జేఏసీ బృంద సభ్యులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆ రాష్ట్రంలో అమలవుతున్న ప్రవాసీ సంక్షేమ విధానం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.  


ఈ సందర్భంగా తెలంగాణ గల్ఫ్ జేఏసీ బృంద ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. ప్రవాసీ సంక్షేమ విధానాన్ని పరిశీలించేందుకు తెలంగాణ అధికారుల బృందం కేరళలో పర్యటిస్తుందని.. వారిచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలోనే తాము కేరళ పర్యటనకు వచ్చామని గల్ఫ్ జేఏసీ కన్వీనర్ గుగ్గిల్ల రవిగౌడ్ అన్నారు. గల్ఫ్ నుంచి వచ్చిన వలస కార్మికుల పునరావాస కార్యక్రమాల అమలు తీరును పరిశీలించనున్నట్టు చెప్పారు. కేరళ ప్రభుత్వం గల్ఫ్ కార్మికులకు అందజేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను స్వయంగా పరిశీలించి, ఒక నివేదికను తయారుచేసి.. దానిని తెలంగాణ ప్రభుత్వానికి సమర్పిస్తామని మురళీధర్ రెడ్డి అన్నారు. కేరళలో పర్యటిస్తున్న జేఏసీ బృందంలో గుగ్గిల్ల రవిగౌడ్, స్వదేశ్ పరికిపండ్ల, నంగి దేవేందర్ రెడ్డి, పెరుగు మల్లికార్జున్, జలిగం కుమార్ స్వామి, గంగుల మురళీధర్ రెడ్డి ఉన్నారు. 


కాగా.. కేరళలోని పేదవారికి మరియు గల్ఫ్ నుండి తిరిగి వచ్చిన కార్మికులకు తక్కువ వడ్డీ(6%)తో కూడిన రుణాలు ఇస్తూ.. వారికి నైపుణ్యం కలిగిన రంగాలలో సొంత వ్యాపారం చేసుకునేలా కేఎస్‌బీసీడీసీ తోడ్పడుతోంది. రూ.3లక్షల నుంచి 30 లక్షల వరకు లోన్ సదుపాయం అందుబాటులోకి తెచ్చి.. నాలుగు సంవత్సరాల వరకు తిరిగి చెల్లించే విధంగా కార్మికులకు కేఎస్‌బీసీడీసీ, నోర్కా రూట్స్ మరియు ప్రవాసీ వెల్ఫేర్ బోర్డ్ సంస్థలు కలిసి ప్రోత్సహం అందిస్తున్నాయి. 


కేఎస్‌బీసీడీసీ లిమిటెడ్ సంస్థ.. లోన్ సదుపాయం కలిపిస్తూనే ఇన్సూరెన్స్‌తో కూడిన రుణాలు అందిస్తూ.. సురక్షితమైన, చట్టబద్దమైన, క్రమ బద్దమైన వలస కార్మికులను కేరళ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. అంతేకాకుండా.. పేద వారికి రుణాలు అందిస్తూనే వాటిని 97% రికవరీ చేస్తు దేశంలోనే ముందంజలో ఉంది. ఈ సంస్థ 1995లో స్థాపించబడగా.. ఇప్పటి వరకు 15 నేషనల్ అవార్డులతోపాటు ఫీచర్ కేరళ బ్రాండ్ అవార్డును సొంతం చేసుకుంది. 


Updated Date - 2021-04-09T23:41:15+05:30 IST