మద్యం మత్తులో పది పరీక్షకు ఇన్విజిలేషన్‌!

ABN , First Publish Date - 2022-05-25T18:27:36+05:30 IST

విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన గురువే దారి తప్పాడు! పదో తరగతి వార్షిక పరీక్షల ఇన్విజిలేషన్‌కు ఓ ఉపాధ్యాయుడు మద్యం సేవించి వచ్చేశాడు! కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. టెన్త్‌ వార్షిక పరీక్షల్లో భాగంగా..

మద్యం మత్తులో పది పరీక్షకు ఇన్విజిలేషన్‌!

తాగి విధులకు వచ్చిన ఉపాధ్యాయుడు

హుజూరాబాద్‌లో ఘటన.. సస్పెండ్‌ చేసిన డీఈవో


హైదరాబాద్‌, (ఆంధ్రజ్యోతి): విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన గురువే దారి తప్పాడు! పదో తరగతి వార్షిక పరీక్షల ఇన్విజిలేషన్‌కు ఓ ఉపాధ్యాయుడు మద్యం సేవించి వచ్చేశాడు! కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. టెన్త్‌ వార్షిక పరీక్షల్లో భాగంగా మంగళవారం సెకండ్‌ లాంగ్వేజీ పరీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ జడ్పీహెచ్‌ఎస్‌ పరీక్ష కేంద్రాన్ని డీఈవో సందర్శించారు. ఆ సమయంలో ఇన్విజిలేషన్‌ విధుల్లో ఉన్న ఏముల రవికుమార్‌ (పీఈటీ, జడ్పీహెచ్‌ఎస్‌ రాంపూర్‌) మద్యం మత్తులో ఉన్నారు. ఆయన పూటుగా తాగి విధులకు హాజరైనట్లు గుర్తించారు. దీంతో ఆయన్ను సస్పెండ్‌ చేశారు. అలాగే విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పరీక్షా కేంద్రం చీఫ్‌ సూపరింటెండెంట్‌, డిపార్ట్‌మెంట్‌ అధికారులను పరీక్షల విధుల నుంచి తప్పిస్తూ డీఈవో నిర్ణయం తీసుకున్నారు. 


2 నుంచి స్పాట్‌ వాల్యుయేషన్‌

జూన్‌ 2 నుంచి టెన్త్‌ స్పాట్‌ వాల్యుయేషన్‌ను నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు అన్ని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 12 స్పాట్‌ వాల్యుయేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో వచ్చే నెల 2 నుంచి 11 వరకు స్పాట్‌ వాల్యుయేషన్‌ను నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియ సవ్యంగా పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పరీక్షల విభాగం డైరెక్టర్‌ కృష్ణారావు అన్ని జిల్లాల అధికారులను ఆదేశించారు. కాగా, రాష్ట్రంలో మంగళవారం నిర్వహించిన టెన్త్‌ సెకండ్‌ లాంగ్వేజీ పరీక్షకు సుమా రు 99.04% మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ పరీక్షకు మొత్తం 5,08,143 మంది హాజరు కావాల్సి ఉండగా 5,03,253 మంది విద్యార్థులు హాజరయ్యారు.  కాగా, నల్లగొండ జిల్లాలో 4 మాల్‌ ప్రాక్టీస్‌ కేసులను నమోదు చేశారు.


ముగిసిన ఇంటర్‌ పరీక్షలు

రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు ముగిశాయి. ఈ నెల 6న ప్రారంభమైన ఈ పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. ఇంటర్‌ ప్రధాన పరీక్షలు 19నేముగిసినప్పటికీ, 24తో సాంకేతికంగా మిగిలిన పరీక్షలు కూడా పూర్తయ్యాయి. ఇప్పటికే స్పాట్‌ వాల్యుయేషన్‌ ప్రక్రియను కూడా ప్రారంభించారు. వీలైనంత త్వరగా ఇంటర్‌ ఫలితాలను ప్రకటించడానికి అధికారులు కృషి చేస్తున్నారు.

Updated Date - 2022-05-25T18:27:36+05:30 IST